వానాకాలం.. వ్యాధుల గాలం
ABN, First Publish Date - 2023-07-05T00:37:18+05:30
సంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల కేసుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
సీజనల్ వ్యాధులు వ్యాపించే వేళ కనపడని ముందస్తు చర్యలు
సంగారెడ్డి జిల్లాలో ఏటేటా పెరుగుతున్న డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
సమన్వయ సమావేశాల ఊసే లేదు
ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు శూన్యం
సంగారెడ్డి అర్బన్, జూలై 4 : వానాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరడం, తాగునీరు కలుషితమవడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదువుతాయి. సంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల కేసుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021లో 131 డెంగీ కేసులు, 227 టైఫాయిడ్ కేసులు, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి. 2022లో 301 డెంగీ కేసులు, 3,543 టైఫాయిడ్ కేసులు, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 2,328 మంది ఫైలేరియా బాధితులున్నారు. డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ముందస్తు చర్యలు శూన్యం
సీజనల్ వ్యాధులు సోకకుండా సంబంధిత శాఖల అధికారులు ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మున్సిపల్, గ్రామపంచాయతీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల సమన్వయ సమావేశాలు కానరావడం లేదు. పట్టణాలు, పల్లెలు, ఆవాస ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొని దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారినపడి ఆస్పత్రుల పాలై వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు కానరావడం లేదు. పీహెచ్‌సీల డాక్టర్లు, వైద్య సిబ్బంది, హెల్త్‌ఎడ్యుకేటర్ల ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగత్తలు వివరించాల్సి ఉన్నా అవేవీ చేపట్టడం లేదు. డెంగీ లేదా టైఫాయిడ్ కేసు నమోదైనా నామమాత్రంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
వ్యాధులబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- దోమలు ఇళ్లలోకి చేరకుండా కిటికీలు, తలుపులకు
తెరలు ఏర్పాటు చేసుకోవాలి.
- దోమ తెరల వినియోగం తప్పనిసరి.
- ప్రతీ శుక్రవారం డ్రై-డే పాటించాలి.
- కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి.
- జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Updated Date - 2023-07-05T00:37:18+05:30 IST