బస్సుకు నోచని 88 పల్లెలు
ABN, First Publish Date - 2023-12-08T23:41:47+05:30
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమవుతున్నవేళ.. ఇప్పటి వరకు బస్సు మొహమే చూడని గ్రామాల ప్రజలు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.
ఉచిత ప్రయాణం దేవుడెరుగు.. బస్సు వేస్తే చాలంటున్న జనం
మెదక్ జిల్లాలో 469 గ్రామాలు.. 381 గ్రామాలకే బస్సు సర్వీసులు
నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
మెదక్ అర్బన్, డిసెంబరు 8: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమవుతున్నవేళ.. ఇప్పటి వరకు బస్సు మొహమే చూడని గ్రామాల ప్రజలు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే ‘మహాలక్ష్మి’ పథకం నేటి ప్రారంభం కానుంది. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేయకుండానే ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లావ్యాప్తంగా 88 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులే లేకపోవడంతో ఆయా గ్రామాల్లో నివసించే మహిళలు మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉన్నది. జిల్లాలో 469 గ్రామాలుండగా 381 గ్రామాలకు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. మెదక్ డిపో పరిధిలో ఆర్టీసీ సంస్థ 45 బస్సులుండగా.. ప్రైవేటు 59 బస్సులున్నాయి. ఆర్టీసీ సంస్థ కంటే రప్రైవేటు బస్సులే అధికంగా ఉన్నాయి. పట్టణాలు, ప్రధాన మార్గాలకు బస్సు సర్వీసులు బాగానే ఉన్నాయి. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే పల్లెలకు ఆర్టీసీ సేవలు అందుబాటులో లేవు. ఆయా గ్రామాలకు ప్రైవేటు వాహనాలు, ఆటోలే దిక్కవుతున్నాయి.
నేటి నుంచి అమలులోకి ‘మహాలక్ష్మి’
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి గ్యారంటీ పథకం శనివారం నుంచి అమలులోకి రానుంది. ఇందుకోసం మెదక్ ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు 79, ఎక్స్‌ప్రెస్ 13 బస్సులు, నర్సాపూర్ డిపో పరిధిలో 35 పల్లెవెలుగు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ డిపో మేనేజర్ సుధ తెలిపారు. మధ్యాహ్నం నుంచి బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బస్సు సర్వీసులకు నోచుకోని 88 గ్రామాలకు సైతం సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2023-12-08T23:41:48+05:30 IST