బీఆర్‌ఎస్‌ను వీడనున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-07-10T02:23:36+05:30
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
నాగర్‌కర్నూల్/హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన కృత నిశ్చయానికి వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రాహుల్ గాంధీని కలిసిన సమయంలో వారితో పాటు.. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో రాజేశ్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వినిపించాయి. అనూహ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి కూచకుళ్ల దామోదర్‌రెడ్డి హాజరుకావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే తనయుడు రాజేశ్‌తోపాటు తాను కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు దామోదర్‌రెడ్డి అక్కడ ఉన్న కార్యకర్తలు, ముఖ్య నాయకులకు సంకేతాలిచ్చారు. ఈ నెల 20న కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ సభలో ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ఆయన చెప్పారు. అయితే అంతకు ముందే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
Updated Date - 2023-07-10T03:08:53+05:30 IST