TSPSC Paper Leak Case: ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి
ABN, First Publish Date - 2023-03-16T19:33:02+05:30
టీఎస్‌పీఎస్‌సీప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీప్రశ్నపత్రం లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో సిట్ చీఫ్ సమావేశం తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి. లక్ష్మీ నుంచి ప్రవీణ్ పాస్‌వర్డ్ చోరీపై సిట్ ఆరా తీసింది. 5 పేపర్లను కంప్యూటర్ నుంచి ప్రవీణ్ తీసుకున్నట్టు గుర్తించారు. ప్రవీణ్(Pulidindi Praveen Kumar) కోసం రాజశేఖర్(Atla Rajashekar Reddy) కంప్యూటర్ లాన్‌లో మార్పులు చేశాడు. రాజశేఖర్ సాయంతోనే ప్రవీణ్ కంప్యూటర్ నుంచి పేపర్లు కొట్టేశాడు. నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 3 ప్రశ్నాపత్రాలు గుర్తించారు. టౌన్‌ప్లానింగ్, వెటర్నరీతో పాటు మరో పేపర్ లీక్ అయిందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే పరీక్షల పేపర్లు కూడా రేణుకకు ఇస్తానని ప్రవీణ్ హామీ ఇచ్చాడు. ఏఈ ఎగ్జామ్‌తో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పేపర్‌ను ప్రవీణ్ తీసుకున్నాడు.
కేసులో ఏ1 నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి పరీక్ష రాసే సమయంలో ప్రవీణ్ తన ఓఎంఆర్ షీట్‌పై బుక్‌లెట్ నంబరును తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతడి పేపర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అతణ్ని డిస్‌క్వాలిఫై చేశారు. అయితే, లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో అతడికి ఎన్ని మార్కులు వచ్చాయనే ఆసక్తి నెలకొంది. ‘కీ’ పరిశీలించగా 103 మార్కులు వచ్చినట్టు తేలడంతో అంతా విస్తుపోతున్నారు. సాధారణంగా గ్రూప్-1 పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థులు చాలా సీరియ్‌సగా చదువుతారు. నిరుద్యోగ అభ్యర్థులైతే.. ఆర్నెల్ల నుంచి దాదాపు ఏడాదిపాటు కోచింగ్ తీసుకుంటారు. ఇతర పనులను పక్కనపెట్టి ఇదే పనిలో ఉంటారు. అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారైతే ఈ పరీక్షకు సన్నద్ధం కావడం కోసం కొంతకాలంపాటు సెలవు పెట్టి మరీ చదువుకుంటారు.
ఇంతగా కష్టపడ్డ చాలా మందికి ఈ పరీక్షల్లో 70-80 మార్కులే వచ్చాయి. మరింత సీరియ్‌సగా చదివినవారికి సైతం 100 మార్కులు దాటలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అలాంటిది.. ఒక్కరోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎలాంటి కోచింగూ తీసుకోకుండా పరీక్ష రాసిన ప్రవీణ్‌కు ఇన్ని మార్కులు రావడానికి కారణం పేపర్ లీకేజీనే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ పేపర్ ఆధారంగా ప్రవీణ్ తానొక్కడే చదివి పరీక్ష రాశాడా? లేక లీకైన పేపర్‌ను మరింకెవరికైనా అందించాడా అనే కోణంలో కూడా అభ్యర్థుల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకైన విషయాన్ని తామే పసిగట్టామని కమిషన్ అధికారులు చెబుతున్నది నిజం కాదా? ఈ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైన ఘటనలో డబ్బు చెల్లింపునకు సంబంధించి నిందితుల మధ్య గొడవ జరిగినట్లు, దాంతో ఈ విషయం పోలీసులకు చేరినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుక(Renuka).. తన తమ్ముడు రాజేశ్‌నాయక్ కోసం టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రశ్నపత్రాన్ని తమ తండాకే చెందిన నీలేశ్, శ్రీను, రాజేందర్‌నాయక్‌లకు ఇచ్చినందుకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు పరీక్షకు ముందురోజు వీరందరినీ వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకొని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్ చేయించింది. పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని వచ్చింది.
కాగా, ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రూ.2లక్షల చొప్పున చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు. దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు. దీంతో రేణుకకు, వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్.. డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. పోలీసులు వెంటనే స్పందించి రేణుకతోపాటు ఆమె సోదరుడిని, నీలేశ్‌ని, మిగిలిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా చేరిన తర్వాత ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దానిని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌పీఎస్‌సీని సంప్రదించి, పలుమార్లు హైదరాబాద్‌లోకి కార్యాలయానికి వెళ్లారని ఆ క్రమంలోనే ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆపై సాన్నిహిత్యం పెరిగి ఇంతటి అక్రమానికి దారితీసిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా కాంటాక్టులు, చాటింగ్‌లు చేస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌కు కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును విచారిస్తుస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 60 మందినీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా 2017 నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు రికవరీ చేయనున్నట్లు తెలిసింది. 2017 నుంచి టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పబ్లిక్ పరీక్షలు జరిగాయి? ఆ సమయంలో ప్రవీణ్ ఏవైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2023-03-16T20:03:27+05:30 IST