రసవత్తరంగా మదర్ డెయిరీ రాజకీయం
ABN, Publish Date - Dec 13 , 2023 | 11:37 PM
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డెయిరీ(నార్ముల్)లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
కోర్టులో పిటీషన్లపైన పిటీషన్లు
మరోవైపు ఎన్నికల నిర్వహణకు త్రీమన కమిటీ
ఎన్నికలు జరిగేనా?, పాత పాలకవర్గానికే బాధ్యతలా?
నల్లగొండ, డిసెంబరు 13 : నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డెయిరీ(నార్ముల్)లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 10వ తేదీన మదర్ డెయిరీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ రంగారెడ్డి జిల్లా డీసీవో ధాత్రిదేవి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో మూడు డైరెక్టర్ పోస్టులను పాలకవర్గం భర్తీ చేయకపోగా నిబంధనలకు విరుద్ధంగా జనరల్ బాడీ నిర్వహించడంతో సహకార చట్టం 1995 ప్రకారం పాలకవర్గ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆర్సీ నెంబరు 4100 సర్క్యులర్‌ను కూడా జారీ చేశారు. దీంతో పాలకవర్గం పూర్తిగా రద్దయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే మదర్ డెయిరీలో రాజకీయాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ చేతిలో ఉన్న పాలకవర్గం నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పాలకవర్గం రద్దు కావడంతో భవిష్యతలో ఏ మలుపు తిరిగి ఎవరి చేతికి పాలకవర్గం చిక్కుతుందనేది చర్చగా మారింది.
కోర్టులో పోటాపోటీగా పిటీషన్లు
నిబంధనలను కాలరాసి పాలకవర్గం జనరల్ బాడీ నిర్వహించిందని, సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపిస్తూ కొంతమంది సొసైటీల చైర్మన్లు, డైరెక్టర్ స్థానాలను ఆశించే వారు రంగారెడ్డి జిల్లా డీసీవోకు ఫిర్యాదుచేశారు. దీంతో విచారణ జరిపించిన డీసీవో ధాత్రిదేవి పాలకవర్గాన్ని నాలుగు రోజుల కింద రద్దు చేసింది. దీంతో ప్రస్తుత పాలకవర్గ సభ్యులతో పాటు పాలకవర్గానికి ఫిర్యాదు చేసిన వారు కోర్టును ఆశ్రయించారు. మదర్ డెయిరీ పాలకవర్గం కోఆపరేటివ్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ పేర్కొంటూ ఆరోపణలు చేసిన వారితో పాటు డీసీవో ఆదేశాలను సవాల్ చేస్తూ రద్దయిన పాలకవర్గం సభ్యులు కోర్టులో పిటీషన్లు వేశారు. ఇక కోఆపరేటీవ్ ట్రిబ్యునల్‌లో స్టే ఇవ్వకుండా పాల ఉత్పత్తిదారుల ప్రాథమిక సంఘాల అధ్యక్షులు కేవీయట్ పిటీషన్లు దాఖలు చేశారు. రద్దయిన పాలకవర్గానికి తిరిగి అవకాశాలు దక్కకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అటు పాలఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల నిర్వహణకు త్రీమన కమిటీ
కోర్టులో పిటీషన్లు ఓవైపు ఇరువర్గాలు వేస్తుండగా మరోవైపు నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు మదర్ డెయిరీ అధికారులతో పాటు సహకార శాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకుగాను 325మంది పాల ఉత్పత్తిదారుల సంఘాల నుంచి ముగ్గురిని త్రీమన కమిటీగా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ త్రీమన కమిటీ కోర్టులో నుంచి తీర్పులను గమనిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ కోర్టులు పాత పాలకవర్గాన్నే కొనసాగించాలని తీర్పు ఇస్తే తిరిగి ఆ పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది. ఒకవేళ సహకార చట్టాలను ఉల్లంఘించిందని కోర్టులు భావించి రద్దయిన మదర్ డెయిరీ పాలకవర్గానికి వ్యతిరేక తీర్పు ప్రకటిస్తే త్రీమన కమిటీ సభ్యులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కానున్నారు. మొత్తానికి మదర్ డెయిరీ రాజకీయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Dec 13 , 2023 | 11:37 PM