Revanth Reddy: రేవంత్‌రెడ్డి అనే నేను..
ABN, First Publish Date - 2023-12-07T03:20:13+05:30
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నేడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం
మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో.. రేవంత్‌తోపాటు పలువురు మంత్రులు
తొలి సంతకం 6 గ్యారెంటీల అమలుపైనే.. సోనియా, ఖర్గే, ప్రియాంక, రాహుల్ రాక
సిద్ద రామయ్య, డీకే శివకుమార్, సీపీఐ జాతీయ నాయకత్వం కూడా..
తెలంగాణ అమరుల కుటుంబాలకూ ఆహ్వానం
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారంపై రాజ్‌భవన్‌కు టీపీసీసీ అధికారిక లేఖ
హైదరాబాద్/న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డితోపాటు 9 నుంచి 11 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇంకా మిగిలి ఉండే మంత్రి పదవుల భర్తీపై నిర్ణయాధికారాన్ని రేవంత్‌రెడ్డికే వదిలి పెడతారని ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా గురువారం మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారిలో మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. లేదా ఆయన సతీమణి పద్మావతిరెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, సీతక్క, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు దామోదర్ రాజనర్సింహ, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పి.సుదర్శన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లపై కూడా చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికీ ఇచ్చే అవకాశాలు లేవని కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఒక కుటుంబంలో ఒకే పదవి సూత్రాన్ని పాటించాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్బంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు ఉత్తర్వులపై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. అలాగే రజని అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై సంతకం చేయనున్నారు. రజిని ఈ ఏడాది అక్టోబరు 17న గాంధీభవన్‌కు వచ్చి.. తాను పీజీ చేసినా ఇంతవరకు ఉద్యోగం రాలేదని, దివ్యాంగురాలిని కావడంతో ప్రయివేటు ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడంలేదని రేవంత్‌రెడ్డికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తానని మాటిచ్చారు. ఆ మేరకు ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకార మహోత్సవం సాక్షిగా ఆమెకు ఉద్యోగ మంజూరు పత్రాన్ని ఇచ్చి.. మాట నిలబెట్టుకోనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో.. ప్రభుత్వం ఎలా ఉండబోతుందన్న దానిపై విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేతల రాక..
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో వారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. వీరితోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. వాస్తవానికి మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. బిజీ బిజీగా గడిపారు. మంగళవారం ఢిల్లీ రాగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పరిశీలకుడు డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుసుకుని మంత్రివర్గ జాబితా గురించి చర్చించారు. అనంతరం పార్టీ అగ్రనేత సోనియాగాంధీ నివాసానికి వెళ్లి అక్కడే సోనియా, రాహుల్, ప్రియాంకలతో చర్చలు జరిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వీరందరినీ ఆహ్వానించారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నారా? అంటూ పార్లమెంటు హాల్లో సోనియాను మీడియా ప్రశ్నించగా, ‘వెళ్లే అవకాశం ఉంది’ అని సమాధానమిచ్చారు.
పలువురు ప్రముఖులకు ఆహ్వానం..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తదితరులకు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపారు. పలువురు రేవంత్‌రెడ్డి సహచర ఎంపీలు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ ఆహ్వానాలు పంపారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులకూ ఆహ్వానాలు వెళ్లాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, చిదంబరం, మీరా కుమార్, కురియన్, షిండే తదితరులకూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితోపాటు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరుల కుటుంబాలను, ఉద్యమకారులు, మేధావులనూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి కోసం సభికుల్లో ప్రత్యేకంగా కుర్చీలు కేటాయించారు. టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులనూ ఆహ్వానించారు. కాగా, సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లనూ టీపీసీసీ పూర్తి చేసింది. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దానికి కుడివైపు వేదికపైన పార్టీ ఎమ్మెల్యేలు 64 మంది ఆసీనులు కానున్నారు. ఎడమ వైపు వేదికపైన ప్రత్యేక ఆహ్వానితులు కూర్చుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తారని అంచనాతో ఉన్న టీపీసీసీ.. దానికి తగిన ఏర్పాట్లు చేసింది.
ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చి.. మళ్లీ వెనక్కి
అధిష్ఠానం పెద్దలను కలిసి.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. బుధవారం మొత్తం బిజిజీబిజీగా గడిపారు. అధిష్ఠానం పెద్దలతో చర్చలు, ఆహ్వానాలు పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు బయలుదేరిన రేవంత్.. విమానాశ్రయం దాకా వచ్చిన తర్వాత పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే నుంచి పిలుపు వచ్చింది. దీంతో రేవంత్ వెంటనే వెనుదిరిగి వెళ్లి ఠాక్రేతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయనతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో రేవంత్‌రెడ్డి వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ ఉన్నారు.
Updated Date - 2023-12-07T06:55:04+05:30 IST