మేళ్లచెర్వు జనసంద్రం
ABN, First Publish Date - 2023-02-18T23:43:57+05:30
మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం శనివారం మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగింది. బ్రహ్మీముహూర్తంలోనే ఎమ్మెల్యే సై
మేళ్లచెర్వు, ఫిబ్రవరి 18 : మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం శనివారం మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగింది. బ్రహ్మీముహూర్తంలోనే ఎమ్మెల్యే సైదిరెడ్డి, రజిత దంపతులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం, హుజూర్‌నగర్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాగా స్వామివారిని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జాతర ముఖ్య అధికారి మహేంద్రకుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో వెంకారెడ్డి ఉన్నారు.
ఆకట్టుకున్న ప్రభల ఊరేగింపు
జాతర సందర్భంగా మండలకేంద్రంలో వివిధ సెంటర్లలో ఏర్పాటు చేసిన ప్రభలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేర్చారు.
ప్రారంభమైన యాగశాల, అన్నదాన కేంద్రాలు
ఆలయ సమీపంలోని టీటీడీ కళ్యాణమండపంలో లోకకళ్యాణం, సకల జనుల సంరక్షణార్ధం మాతా చారిటబుల్ ట్రస్టు, శ్రీచండీ పీఠం ఆధ్వర్యంలో కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే యాగశాలను ప్రారంభించారు.ఈ యాగాలను నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో వివిధ సంఘాలు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం
ఆలయ ప్రాంగణంలో వివిధ సంఘాలు, పార్టీల వారు ఏర్పాటుచేసిన విద్యుత ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివిధ ఫౌండేషన్ల చైర్మన్లు ప్రారంభించారు. పోటాపోటీగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగుదేశం ప్రభ
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభతో ఉత్సాహం వచ్చింది. అదే ఉత్సాహంతో పదేళ్ల విరామం తరువాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభలకు పోటీగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రభను ఏర్పాటుచేశారు. ఈ ప్రభ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సోమప్ప దేవాలయంలో
నేరేడుచర్ల: మండలంలోని సోమప్ప దేవాలయం, దిర్శించర్లలోని శివాలయం, నేరేడుచర్లలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయంలలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. సోమప్ప ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే పూజలు మొద లయ్యాయి. ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రజిత దంపతులు ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఐ నవీన్‌కుమార్ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పుడు వాహనాలను పంపించి వేశారు.
దేవాదాయ శాఖాధికారిని అంటూ చైర్మన్ బావమరిది అత్యుత్సాహం
పురాతన దేవాలయం సోమప్ప దేవాలయంలో ఆలయ చైర్మన్ రాచకొండ శ్రీనివాసరావు బావమరిది ఎండోమెంట్ అధికారిని అంటూ గర్భగుడిలో భక్తులను నెట్టివేస్తుండడంతో చాలామంది దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయం బయట ఉన్న దేవాలయం సిబ్బందికి, చైర్మన్‌కు తెలిపినా తామే ఉంచామని ఇటువంటివి జరగుతూనే ఉంటాయంటూ చైర్మన్ భక్తులతో అమర్యాదగా ప్రవర్తించాడని పలువురు భక్తులు వాపోయారు. దేవాదాయ శాఖాధికారిగా చెప్పుకున్న వ్యక్తిపై కేసునమోదు చేయాలని భక్తులు డిమాండ్ చేశారు.
పిల్లలమర్రి దేవాలయంలో
సూర్యాపేట రూరల్: చారిత్రక పిల్లలమర్రి శివాలయాలకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుండే భక్తులు పెద్దసంఖ్యలో ప్రత్యేక పూజలు, సాముహిక అభిషేకాల్లో పాల్గొన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, వివిధరాజకీయ పార్టీల నాయకులు శివాలయాలను సందర్శించారు. ఉదయం నాలుగు గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఎర్రకేశ్వరాలయం, త్రికూటేశ్వరం ఆలయాల్లో బసవముద్ద, లింగోద్భవ కాలంలో స్వామి,అమ్మవార్ల కళ్యాణం అంగరంగా వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన జెర్రి పోతుల భిక్షం, కమిటీ సభ్యులు అన్ని వసతులు ఏర్పాట్లు చేశారు. పిల్లలమర్రి శివాలయ ఉత్సవాల బందోబస్తును ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి, ఎర్రకేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రికుటేశ్వరాలయంలో
పెనపహాడ్: మండలంలోని నాగులపహాడ్‌లోని త్రికుటేశ్వరాలయం, అనంతారం, పెనపహాడ్, లింగాల, నారాయణగూడెం గ్రామాల్లోని శివాలయాలను మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించి పూజలు నిర్వహించారు. నాగులపహాడ్ జాతరకు జిల్లా నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో బారులు తీరిన భక్తులకు గంట నుంచి రెండు గంటల వరకు దర్శన సమయం పట్టింది. కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన సంకరమర్ధి నిరంజనరెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొండ జానకిరాములుగౌడ్, సర్పంచ రాయిలీ లక్ష్మీశ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన నాతాల జానకిరాంరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, నారాయణగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, మల్లయ్య, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-18T23:44:34+05:30 IST