ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైల్వే జంక్షన్‌గా మిర్యాలగూడ

ABN, First Publish Date - 2023-09-08T00:57:06+05:30

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ త్వరలో రైల్వే జంక్షన్‌గా మారనుంది. బీబీనగర్‌-నడికుడి మార్గంలో ఇటీవల డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ తాజాగా, డోర్నకల్‌-మిర్యాలగూడ రైల్వేలైన్‌కు ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు (ఎఫ్‌ఎల్‌ఎ్‌స)కు ఆమోదం తెలిపింది. డబ్లింగ్‌తోపాటు నూతన రైల్వేలైన్‌ పూర్తయితే నడికుడి, బీబీనగర్‌ లాగా మిర్యాలగూడ కూడా రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందనుంది. రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌

డోర్నకల్‌-మిర్యాలగూడ కొత్త రైల్వేలైన్‌కు ఎఫ్‌ఎల్‌ఎస్‌

బీబీనగర్‌-నడికుడి మార్గంలో డబ్లింగ్‌

ఇవి పూర్తయితే జంక్షన్‌గా అభివృద్ధి చెందే అవకాశం

మెరుగవ్వనున్న ప్రయాణ సౌకర్యం

మిర్యాలగూడ, సెప్టెంబరు 7: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ త్వరలో రైల్వే జంక్షన్‌గా మారనుంది. బీబీనగర్‌-నడికుడి మార్గంలో ఇటీవల డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ తాజాగా, డోర్నకల్‌-మిర్యాలగూడ రైల్వేలైన్‌కు ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు (ఎఫ్‌ఎల్‌ఎ్‌స)కు ఆమోదం తెలిపింది. డబ్లింగ్‌తోపాటు నూతన రైల్వేలైన్‌ పూర్తయితే నడికుడి, బీబీనగర్‌ లాగా మిర్యాలగూడ కూడా రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందనుంది. రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో తెలంగాణలో రూ. 50,848కోట్లతో 15 కొత్త రైల్వే లైన్ల కోసం సుమారు 2,647కి.మీ ఎఫ్‌ఎల్‌ఎ్‌సకు ఆమోదం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటమే గాక, రెండు లైన్లతో ఈ ప్రాంతాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా వేగంగా గమ్యాన్ని చేరే అవకాశం ఉందని రైల్వే ప్రయాణికులు అభిప్రాయ పడుతున్నారు.

డోర్నకల్‌-మిర్యాలగూడ నూతన రైల్వేలైన్‌

డోర్నకల్‌-మిర్యాలగూడ మధ్య 120కి.మీ మేర రూ.2,160కోట్ల అంచనా వ్యయంతో నూతన రైల్వే లైన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటుచేయనున్న కొత్త రైల్వే మార్గంతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. డోర్నకల్‌, మిర్యాలగూడ పట్టణాలు హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరాలకు అదనపు అనుసంధనాన్ని కల్పించాలని రైల్వే శాఖ భావిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు సౌకర్యాలు మెరుగుపడటమేగాక, ఈ ప్రాంతం సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం, వ్యాపా రం, విద్య, పర్యాటకం లాంటి పలు రంగాల్లో ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైటీపీకి బొగ్గు రవాణా

మరో ఏడాదిలో ప్రారంభం కానున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ (వైటీపీ)కు అవసరమైన ముడి సరుకు బొగ్గు రవాణాను ఈ నూతన రైల్వే మార్గం సులభతరం చేయనుంది. డోర్నకల్‌-మిర్యాలగూడ రైల్వేలైన్‌ సింగరేణి కాలరీస్‌ నుంచి రానున్న బొగ్గును వైటీపీకి చేర్చేందుకు అనువుగా ఉంటుంది. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలోని పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లుల నుంచి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.

డబ్లింగ్‌తో రైలు ప్రయాణం వేగం

గత నెలలో బీబీనగర్‌-నడికుడి రైలు మార్గం డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండోలైన్‌ పూర్తయితే మిర్యాలగూడతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రయాణికులు వేగంగా గమ్యం చేరే అవకాశం కలుగుతుంది. బీబీనగర్‌ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు జిల్లా నడికుడి వరకు 239కి.మీ డబ్లింగ్‌ పనులను రూ.2853.23కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. దీంతో రైళ్ల సంఖ్యను పెంచేందుకు వీలుకలగడమే గాక, ఒకే లైన్‌తో రైళ్ల రాకపోకల్లో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. డబ్లింగ్‌ వల్ల సెక్షన్‌ సామర్ధ్యం పెరిగి ఎక్కువ రైళ్లను నడవనున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడతో పాటు ఏపీ రాష్ట్రంలోని దాచెపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు వరకు ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది.

మెరుగైన సాంకేతిక పరిజ్జానం

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ జంక్షన్‌గా మారే క్రమంలో మెరుగైన సాంకేతిక పరిజ్జానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది రైల్వే స్టేషన్‌లో రైల్వే గోదాముల నుంచి బియ్యం రవాణా చేసే లారీ రైల్వే పట్టాలకు అనుకుని నిలిచిపోవడంతో గూడ్స్‌ రైలు ఈ లారీని స్వల్పంగా ఢీకొట్టింది. జంక్షన్‌గా వృద్ది చెందే క్రమంలో రైళ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నందున పటిష్ఠ సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుతో పాటు నూతన ప్లాట్‌ ఫాంలు సమకూరనున్నాయి. దీంతో ప్రమాదాలను సైతం నివారించే అవకాశం ఉంది. అంతేగాక ఆధునిక విశ్రాంతి గదులు, రైళ్ల రాకపోకల సమయాన్ని సూచించే డిజిటల్‌ బోర్డులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2023-09-08T00:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising