ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టం విలువ సున్నా

ABN, First Publish Date - 2023-03-24T00:50:01+05:30

అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఆరుగాలం శ్రమించిన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈనెల 18, 19న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిశాయి. దీంతో వరితో పాటు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,858 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. యాదాద్రి జిల్లాలో 8,275 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 12,873, నల్లగొండ జిల్లాలో 1,710 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్నజిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెట్టుబడి రూ.27వేలు.. పరిహారం రూ.10వేలు

కంటితుడుపుగా ప్రభుత్వ పరిహారం

పూర్తిస్థాయిలో ఇచ్చి ఆదుకోవాలని రైతుల వేడుకోలు

ఉమ్మడి జిల్లాలో 22,858 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ప్రాథమికంగా అంచనావేసి నివేదించిన వ్యవసాయ, ఉద్యానశాఖలు

యాదాద్రి, మార్చి 23(ఆంధ్రజ్యోతి)/సూర్యాపేట సిటీ, నల్లగొండ: గడ్డం ఎల్లారెడ్డి. మోత్కూరు మునిసిపాలిటీలో నివసిస్తున్న కౌలు రైతు గడ్డం ఎల్లారెడ్డి మోత్కూరు సమీపంలో 13 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నాడు. ఎకరాకు రూ.27వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మొత్తం 13 ఎకరాలకు రూ.3,51,000 పెట్టుబడి వ్యయం అయింది. వరి పంట ఏపుగా పెరిగి కోతకు వచ్చింది. మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఉగాది పండుగ తరువాత పంట నూర్పిడి చేద్దామనుకున్నాడు. ఈ నెల 19న రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి సగానికి పైగా ధాన్యం రాలింది. అయితే ప్రభుత్వం తాజాగా, ఎకరాకు రూ.10వేలు పంట నష్టపరిహారం ప్రకటించింది. దీంతో అతడికి రూ.1,30,000 పరిహారంగా అందనుంది. అయితే పెట్టుబడిలో సగం కూడా రావడం లేదని, చేసిన కష్టం వృథా అయిందని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఆరుగాలం శ్రమించిన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈనెల 18, 19న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిశాయి. దీంతో వరితో పాటు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,858 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. యాదాద్రి జిల్లాలో 8,275 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 12,873, నల్లగొండ జిల్లాలో 1,710 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాలు, గుండాలలో తొమ్మిది, అడ్డగూడూరులో మూడు, మోత్కురులో మూడు, వలిగొండ ఐదు, రాజపేటలో రెండు, మోటకొండూరులో ఐదు, రామన్నపేటలో మూడు, చౌటుప్పల్‌లో 10 గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. ఈ నెల 18న కురిసిన వర్షానికి 4,343 ఎకరాల్లో, రెండోరోజు కురిసిన వర్షానికి 3,800 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పంట నష్టాన్ని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 3,755 మంది రైతులకు చెందిన 8,275 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రూ.17.13కోట్ల మేర నష్టం వాటిల్లిందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి నివేదించారు.

సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో అధికంగా పంట నష్టం వాటిల్లింది. తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లోని వెలిశాల, నెలిగొండతండా, కోకియాతండా, బొల్లికుంటతండా, మామిడాల, గొట్టిపర్తి, జలాల్‌పుర్‌, తాటిపాముల గ్రామాల్లో అధికంగా పంటలు దెబ్బతిన్నాయి. గొట్టిపర్తి గ్రామంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌ తిరుమలగిరి మండలంలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా వరి 11,495 ఎకరాలు, మొక్కజొన్న 42 ఎకరాలు, మామిడి 1,120 ఎకరాలు, మిరప 216 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు.

నల్లగొండ జిల్లాలో మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో భారీగా వడగళ్లు కురవడంతో రైతులు అధికంగా పంట నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,060 ఎకరాల్లో వరి, 650 ఎకరాల్లో మామిడి, పుచ్చ, మిర్చి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి.

పరిహారం ఇంతేనా?

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఎకరా వరి సాగు చేయాలంటే దున్నకం, విత్తనాలు, నాట్లు, కలుపుతీత మొదలు పంట చేతికొచ్చేవరకు సుమారు రూ.27వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.10వేలు ప్రకటించటంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని వ్యవసాయ, రెవెన్యూ అధికారులు తక్కువ చూపి అన్యాయం చేశారని చాలామంది రైతులు వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఫోన్ల ద్వారానే సమాచారాన్ని సేకరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు హడావుడిగా అంచనావేయడం వల్ల పూర్తిస్థాయిలో పరిహారం దక్కేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33శాతం మేర పంట నష్టం వాటిల్లితేనే అధికారులు లెక్కలోకి తీసుకుంటారు. అయితే 33శాతం లోపు నష్టపోయిన తమకు దిక్కెవరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు ఏమాత్రం సరిపోవని, పెట్టుబడులకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

22,858 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

అకాల వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 22,858 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. యాదాద్రి జిల్లాలో యాసంగిలో 2,90,527 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అకాల వర్షాలకు 8,148ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు రూ.16.62కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక కూరగాయలు, ఇతర పంటలు 182.38ఎకరాల్లో దెబ్బతినగా, రూ.51లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. మామిడి 154 ఎకరాలు, పచ్చి మిర్చి 3, ఎర్రమిర్చి 2, నిమ్మ 8.75, టమాటా 1.63, బొప్పడి 1.5, వంకాయ 0.5, సొరకాయ 1.5, బీరకాయ 0.5, పుచ్చకాయ 7ఎకరాల్లో పంటనష్టం వాట్లిల్లింది. ఈ నెల 18న జిల్లాలో 9.4మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భువనగిరి మండలంలో 43.1మి.మీ, యాదగిరిగుట్టలో 37.78మి.మీ, బొమ్మలరామారంలో 25.8మి.మీ, అత్యల్పంగా గుండాలలో 0.8మి.మీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 19న జిల్లాలో 28.8మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదగిరిగుట్ట మండలంలో 76.8మి.మీ, భువనగిరిలో 71.4మి.మీ, బొమ్మలరామారంలో 66.4మి.మీ, బీబీనగర్‌లో 45.6మి.మీ, అత్యల్పంగా రామన్నపేట మండలంలో 0.8మి.మీ వర్షపాతం నమోదైంది.

సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, తిరుమలగిరి మండలాల్లో 7,859 మంది రైతులు 12,873 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. 7,474 మంది రైతులు 11,495 ఎకరాల్లో వరి, 42 మంది రైతులు 42 ఎకరాల్లో మొక్కజొన్న, 202 మంది రైతులు 1,120 ఎకరాల్లో మామిడి, 141 మంది రైతులు 216 ఎకరాల్లో మిరప పంటను నష్ట పోయారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం విడుదల చేస్తే జిల్లాకు రూ.12,87,30,000 మంజూరు కానున్నాయి.

నల్లగొండ జిల్లాలో మర్రిగూడ, నాంపల్లి, చిట్యాల మండలాల్లో వడగళ్లు కరవడంతో రైతులు నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,710 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 1,060 ఎకరాల్లో వరి, 650 ఎకరాల్లో మామిడి, పుచ్చ, మిర్చి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి.

పంటనష్టం ప్రభుత్వానికి నివేదించాం : కె.అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 33శాతానికి పైగా దెబ్బతిన పంటలను పరిగణనలోకి తీసుకున్నాం. అవి 8,275ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పంటనష్టంపై సర్వే నిర్వహించారు. పంట నష్టం రూ.17.13కోట్ల మేర వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసి పంటల వారీగా ప్రభుత్వానికి నివేదిక పంపించాం.

Updated Date - 2023-03-24T00:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising