ప్రభుత్వ కళాశాల విద్యార్థిని వైష్ణవిదేవికి ఇంటర్ స్టేట్ ఫస్ట్‌ర్యాంక్
ABN, First Publish Date - 2023-05-10T01:00:09+05:30
హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కంజివరపు వైష్ణవిదేవి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
హుజూర్‌నగర్, మే 9: హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కంజివరపు వైష్ణవిదేవి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 991 మార్కులతో ప్రభుత్వ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని డీఈఐవో కృష్ణయ్య తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ 467 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించిన వైష్ణవిదేవిని మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేసి రూ.50వేల నగదు సత్కరించింది.
పేదరికంలోనూ ప్రతిభ
హుజూర్‌నగర్ పట్టణంలో పేద కుటుంబానికి చెందిన పెయింటర్ సురేందర్, రాజమణి దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవిదేవి. ఆమె మొదటి నుంచి చదువుల్లో ప్రతిభను కనబర్చింది. 1 నుంచి 5వ తరగతి వరకు ఆలాఫ్ స్కూల్‌లో, 6 నుంచి 10 వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకోగా 10వ తరగతిలో 10/10 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన వైష్ణవిదేవిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, కాలువ శ్రీనివాస్, న్యాయవాదులు, విద్యావంతులు అభినందించారు.
ఐఏఎస్ కావడమే లక్ష్యం : వైష్ణవిదేవి
ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నానని ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కంజివరపు వైష్ణవిదేవి తెలిపింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో కష్టపడి చదువుతున్నాని అన్నారు. పేదలకు సేవచేసేందుకు ఐఏఎస్ సాధిస్తానన్నారు. బీటెక్ తర్వాత కోచింగ్ తీసుకుని సివిల్స్ రాస్తానన్నారు. ఎప్పటికైనా ఐఏఎస్ సాధిస్తానని అన్నారు.
Updated Date - 2023-05-10T01:00:09+05:30 IST