Nagoba Jatara: నాగోబా జాతరకు రావడం ఆనందంగా ఉంది: అర్జున్ ముండా
ABN, First Publish Date - 2023-01-22T15:31:55+05:30
ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు....
ఆదిలాబాద్: ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లాపూర్ నాగోబా జాతర (Nagoba Jatara) వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా (Arjun Munda) నాగోబా జాతరకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగోబా జాతరకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆదివాసులే.. అటవీప్రాంత యజమానులని చెప్పారు. అటవీ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అర్జున్ ముండా ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర శనివారం ప్రారంభమైంది. పుష్య అమావాస్యను పురస్కరించుకొని శనివారం రాత్రి 10.30 గంటలకు మెస్రం వంశీయులు వారి ఆచారం ప్రకారం మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. పవిత్ర గంగాజలాలతో అభిషేకం నిర్వహించారు. మహాపూజతో ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. శనివారం అర్ధరాత్రి బేటింగ్ (కొత్త కోడళ్ల పరిచయం), 22న జాతర, భక్తుల దర్శనం, ప్రత్యేక పూజలు, 23న ఆదివాసీ దేవుళ్లు పెర్సాపేన్, బాన్‌పేన్‌లకు పూజలు, 24న దర్బార్ నిర్వహించనున్నారు. 25న బేతాల్‌పూజ, మండగాజలింగ్ (ముగింపు కార్యక్రమం)తో జాతర ముగుస్తుంది.
Updated Date - 2023-01-22T15:32:10+05:30 IST