తల్లిపాలే శ్రేయస్కరం
ABN, First Publish Date - 2023-08-02T23:53:19+05:30
తల్లిపాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దీనిపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. పలు ప్రాంతాల్లో నేటికీ కాన్పు కాగానే పుట్టిన బిడ్డకు తల్లిపాల(ముర్రుపాలు)ను ఇవ్వరు. దీనిపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆ తర్వాత కూడా తల్లిపాలను ఇవ్వడం తగ్గించి మార్కెట్‌లో లభించే డబ్బా పాలను పడుతుంటారు. దీని ఫలితంగా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం
- వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు
- జిల్లాలోని 24 మండలాల్లో గల అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 2: తల్లిపాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దీనిపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. పలు ప్రాంతాల్లో నేటికీ కాన్పు కాగానే పుట్టిన బిడ్డకు తల్లిపాల(ముర్రుపాలు)ను ఇవ్వరు. దీనిపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆ తర్వాత కూడా తల్లిపాలను ఇవ్వడం తగ్గించి మార్కెట్‌లో లభించే డబ్బా పాలను పడుతుంటారు. దీని ఫలితంగా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అనేక రకాల వ్యాధులు చిన్నపిల్లలను పట్టి పీడిస్తాయి. తల్లిపాలపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టి పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతీ యేట తల్లిపాల వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
తల్లిపాలే బిడ్డకు అమృతం
ప్రస్తుతం పుట్టిన గంటలో 41 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలకు భవిష్యత్తులో అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. తల్లిపాలలో కొలస్ట్రం అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి ఇమ్యూనోగ్లోబిన్‌గా పని చేస్తోంది. దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. అదేవిధంగా పిల్లలకు శ్యాసకోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్‌ఫెక్షన్‌లు వంటివి రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల మానసిక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదం చేయడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతోంది. క్రమం తప్పకుండా పుట్టినప్పటి నుంచి ఆరునెలల వరకు బిడ్డకు తల్లిపాలను తప్పక ఇవ్వాలని వైద్యులు స్పష్టం చేస్తుంటారు.
తల్లికీ మేలే..
తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల ఒక బిడ్డ ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా మంచి చేస్తోంది. తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లీ బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతోంది. ప్రసవం తర్వాత మహిళలు సాధారణంగా నెలరోజుల వరకు రక్తస్రావంతో బాధపడుతుంటారు. కానీ తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం వల్ల దీనిని నివారించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా కొందరు కాన్పు అయిన తర్వాత వెంటనే మళ్లీ గర్భం రాకుండా గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటుంటారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇది గర్భనిరోధక సాధనంగా కూడా పని చేస్తుందని చెబుతున్నారు. అయితే జిల్లాలోని 24 మండలాల పరిధిలో 1193 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 6 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 53,032 మంది వరకు ఉన్నారు. గర్భిణులు 7,810, బాలింతలు 8,574 మంది ఉన్నారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాల పరిధిలో వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లులు, గర్భిణులు, మహిళలను పిలిపించి వారికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
Updated Date - 2023-08-02T23:53:19+05:30 IST