మొదలైన కాంగీ.. రేస్
ABN, First Publish Date - 2023-08-19T23:53:15+05:30
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకోవడానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టు ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వరుస ఓటమి చవిచూసినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లలో టికెట్ల కోసం కొనసాగుతున్న నాయకుల పోటి, పార్టీకి ఉన్న ఓటింగ్ బలానికి అద్దం పడుతోంది. జిల్లాలోని ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు టికెట్ కోసం ఆశావహులు హోరాహోరీగా పోటీ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్ఠానం ఇటీవల ఆదేశించింది. దీంతో జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచే ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు షబ్బీర్‌అలీకే ఖాయం కానుంది. బాన్సువాడలోనూ పోటీ అంత లేకున్నప్పటికీ కొందరు ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
- జిల్లా కాంగ్రెస్ టికెట్ల రేసులో పలువురు నాయకులు
- టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- జుక్కల్, ఎల్లారెడ్డిలో నేత మధ్య పోటీ
- జుక్కల్‌లో ముగ్గురు, ఎల్లారెడ్డిలో ఇద్దరు నేతల దరఖాస్తులు
- బాన్సువాడ కాంగ్రెస్‌లోనూ ఆశావహులు
- కామారెడ్డి టికెట్ షబ్బీర్‌అలీకే
- జిల్లాలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ నేతల పట్టు
కామారెడ్డి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకోవడానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టు ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వరుస ఓటమి చవిచూసినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లలో టికెట్ల కోసం కొనసాగుతున్న నాయకుల పోటి, పార్టీకి ఉన్న ఓటింగ్ బలానికి అద్దం పడుతోంది. జిల్లాలోని ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు టికెట్ కోసం ఆశావహులు హోరాహోరీగా పోటీ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్ఠానం ఇటీవల ఆదేశించింది. దీంతో జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచే ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు షబ్బీర్‌అలీకే ఖాయం కానుంది. బాన్సువాడలోనూ పోటీ అంత లేకున్నప్పటికీ కొందరు ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
జుక్కల్ టికెట్ రేసులో ముగ్గురు నేతలు
జుక్కల్ నియోజకవర్గం ఒక్కప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటింది. అలాంటి జుక్కల్‌లో కాంగ్రెస్ తరపున గంగారాం రెండు పర్యాయాలుగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకమారు అరుణతార కాంగ్రెస్ బరిలో ఉండి విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా కాంగ్రెస్ ఓడిపోతూ వస్తోంది. అయితే జుక్కల్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంక్‌ను ఉపయోగించుకునేందుకు ప్రస్తుతం అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు బరిలో ఉండేందుకు పోటీ పడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఎన్‌ఆర్‌ఐ లక్ష్మీకాంత్‌రావులు టికెట్ ఆశిస్తున్నారు. గత కొన్నిరోజులుగా వీరిలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ సారి జుక్కల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే భావనతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నప్పటికీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంటుంది. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నియోజకవర్గం నుంచి ఎవరు టికెట్లు ఆశిస్తున్నారనే దానిపై అధిష్ఠానం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ జుక్కల్ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి.
ఎల్లారెడ్డిలో తగ్గేదేలేదంటున్న ఇద్దరు నేతలు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటూ ప్రత్యేక పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏకైక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది ఎల్లారెడ్లిలోనే ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచారు. తదనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేందర్ ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుభాష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావులు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సురేందర్‌తో పాటు సుభాష్‌రెడ్డి సైతం టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో సుభాష్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవడమే కాకుండా నామినేషన్ సైతం వేశారు. అయితే పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి సుభాష్‌రెడ్డి నామినేషన్ విరమింపజేసింది. సురేందర్ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తర్వాత సుభాష్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో మదన్‌మోహన్‌రావు సైతం ఎల్లారెడ్డిలోనే పోటీ చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తు వస్తున్నారు. తనకంటూ క్యాడర్‌ను ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎల్లారెడ్టిలో టికెట్ కోసం ఈ ఇరువురి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బరిలో ఖచ్చితంగా ఉండాలని తగ్గేదేలేదంటూ టికెట్ కోసం ఈ ఇరువురి నేతలు అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకోనున్నారు.
కామారెడ్డి, బాన్సువాడ టికెట్ రేసులో పాతవారే..
కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలోని టికెట్ ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ కామారెడ్డి నియోజకవర్గంలో సీనియర్ నేత షబ్బీర్‌అలీ టికెట్ రేసులో ఉన్నారు. సీనియర్ నేత కావడం దాదాపు అతనికి టికెట్ ఖాయం కానుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలుగా గెలుపొందిన షబ్బీర్‌అలీ విద్యుత్‌శాఖ మంత్రిగా చేశారు. అనంతరం వరుసగా నాలుగు పర్యాయాలుగా ఓడిపోతూ వచ్చారు. అయితే షబ్బీర్‌అలీకి ప్రస్తుతం కాస్త సానుభూతి ఉండడం, కాంగ్రెస్‌కంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉండడంతో ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం షబ్బీర్‌అలీకే టికెట్ దాదాపు ఖాయం చేయనున్నట్లు తెలిసింది. బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో టికెట్‌లు ఆశిస్తున్న నేతలు లేరు. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాసుల బాలరాజు ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఎవరైన ఆర్థికంగా ఉండి అధికార పార్టీ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఢీకొనే బలమైన నాయకుడు వస్తే టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు ఆపార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
Updated Date - 2023-08-19T23:53:15+05:30 IST