జిల్లాలో పెరుగుతున్న గన్ కల్చర్
ABN, First Publish Date - 2023-08-16T23:52:03+05:30
కామారెడ్డి జిల్లాలో తుపాకుల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. ఏదో ఒక చోట తుపాకులు వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. సరదా కోసం కొందరు ఎయిర్‌గన్‌లను ఉపయోగిస్తుండగా అవి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. మరికొందరు ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ తీసుకుంటున్నప్పటికీ వాటిని దుర్వినియోగానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
- మరోసారి కలకలం రేపిన ఎయిర్‌గన్
- లింగంపేటలో ఎయిర్‌గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు
- గత ఆరు నెలల క్రితం నాటు తుపాకీ పేలి ఒకరి మృతి
- కామారెడ్డి పట్టణంలోనూ గన్‌తో బెదిరించిన ఇద్దరిపై కేసు నమోదు
- జిల్లాలో తరచూ బయటపడుతున్న తుపాకుల వినియోగం
- పోలీసుశాఖ నిఘా పెట్టడం లేదని విమర్శలు
కామారెడ్డి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో తుపాకుల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో గన్‌కల్చర్ పెరిగిపోతోంది. ఏదో ఒక చోట తుపాకులు వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. సరదా కోసం కొందరు ఎయిర్‌గన్‌లను ఉపయోగిస్తుండగా అవి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నాయి. మరికొందరు ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ తీసుకుంటున్నప్పటికీ వాటిని దుర్వినియోగానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో జంతువులను వేటాడేందుకు నాటు తుపాకులను వాడుతున్నట్లు పోలీసుల దాడుల్లో బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా లింగంపేట మండల పరిధిలోని ఓ గ్రామంలో గల ఫాంహౌజ్‌లో ఎయిర్‌గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు కావడం కలకలం రేపుతోంది. గత ఏడాది కిందట ఇదే మండలంలోని అటవీ ప్రాంతాల్లో జంతువులను నాటు తుపాకులతో వేటాడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా జిల్లాలో తుపాకుల వినియోగం విచ్చలవిడిగా మారుతుందని వీరిపై పోలీసులు నిఘా పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఎయిర్‌గన్.. నాటు తుపాకుల వినియోగం
లింగంపేట మండలం షట్పల్లి సంగారెడ్డిలో ఓ ఫాంహౌజ్‌లో ఎయిర్‌గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు సరదా కోసం ఎయిర్‌గన్‌లను అక్రమంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలు, తండాల్లో కొందరు ఫాంహౌజ్‌లను ఏర్పాటు చేసుకుని ఎయిర్‌గన్‌లతో సరదాగా వినియోగిస్తున్న సమయంలో మిస్‌ఫైర్ అయి ఎదుటి వ్యక్తి దేహంలోకి గుండ్లు దిగుతున్నాయి. చివరకు ప్రాణాల మీదకు వస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోనూ గతంలో కొందరు యువకులు బర్త్‌డే వేడుకలో ఎయిర్‌గన్‌లను ఉపయోగించినట్లు ప్రచారం సాగుతోంది. గత ఆరునెలల కిందట మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో అటవీ ప్రాంతంలో మూగజీవాలను వేటాడుతుండగా ఓ వ్యక్తి నాటు తుపాకీ మిస్‌ఫైర్ అయి మృతి చెందాడు. అదేవిధంగా లింగంపేట మండలంలోనూ హైదరాబాద్‌కు చెందిన కొందరు వేటగాళ్లు నాటు తుపాకులు, ఎయిర్‌గన్‌లతో జంతువులను వేటాడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోనూ గన్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది.
మహానగరం దాటి పట్టణాలకు చేరిన గన్‌కల్చర్
గతంలో ముంబాయి, హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన గన్ కల్చర్ జిల్లా కేంద్రాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వెలుగుచూడడం కలకలం రేపుతోంది. పోలీసుల ఉదాసీనత వల్లే గన్‌కల్చర్ పెరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గత రెండేళ్లలోనే ఆరుకుపైగా సంఘటనలు వెలుగులోకి రావడం పోలీసులకు సవాల్ విసిరినట్టు అవుతోంది. పెద్దపెద్ద వ్యాపారులకు ఉపయోగించిన గన్‌కల్చర్‌ను మద్యం మత్తులో కొందరు చిన్నపాటి విషయాల్లోనే గన్‌చూపించి బెదిరింపులకు పాల్పడి పోలీసులకు పట్టుబడడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో పెద్ద మొత్తంలో లావాదేవీల విషయంలో సెటిల్‌మెంట్ విషయాల్లో గన్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం చిన్నపాటి గొడవలకు గన్‌లను చూపుతూ బెదిరింపులకు పాల్పడడం చూస్తుంటే గన్ కల్చర్ రోజురోజుకూ విస్త్రత మవుతోంది. అమెరికా లాంటి దేశాల్లో గన్‌కల్చర్ విచ్చలవిడిగా ఉండడం దేశంలోనూ గన్‌కల్చర్ అందుబాటులోకి వస్తుందనడానికి జిల్లాలో తుపాకుల సంఘటనలే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో 27 మందికి మాత్రమే గన్ లైసెన్స్
కామారెడ్డి జిల్లాలో పోలీసుశాఖ సుమారు 27 మందికి మాత్రమే గన్ లైసెన్స్ ఇచ్చినట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కానీ కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు సెటిల్‌మెంట్‌ల కోసం అక్రమంగా గన్‌లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఫ్యాషన్ కోసం ఈగన్‌లను మహానగరాల్లో రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ తీసుకుని చట్టప్రకారం వ్యవహరించాల్సి ఉండగా కొందరు చిన్నాచితక తగదాలకు బెదిరింపులకు గన్‌లను ఉపయోగిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఓ బార్‌లో ఓ వ్యక్తి గన్‌తో హల్‌చల్ చేశారు. అంతకుముందు పొందుర్తి దాబా వద్ద మరికొందరు గన్‌తో బెదిరింపులకు పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించిన సంఘటనలు ఉన్నాయి. అయితే జిల్లాలో గన్, ఎయిర్‌గన్, నాటు తుపాకుల వినియోగం సంఘటనలు బయటపడుతున్నా ఈ ఆయుధాలపై పోలీసుశాఖ నిఘాపెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గన్‌ల వినియోగం విచ్చలవిడిగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
Updated Date - 2023-08-16T23:52:03+05:30 IST