కామారెడ్డి బరిలో కేసీఆర్ !
ABN, First Publish Date - 2023-08-06T00:17:50+05:30
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ నిలబడితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేయవచ్చనే భావనలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీ సామన్య కార్యకర్తలు కోరినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
- కామారెడ్డి నుంచే పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం
- కామారెడ్డి నియోజకవర్గంలోనే కోనాపూర్ కేసీఆర్ సొంత గ్రామం
- ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ నానమ్మ పేరిట సొంత గ్రామంలో ప్రత్యేక అభివృద్ధి పనులు
- తాజాగా కేసీఆర్ పోటీలో ఉంటారంటూ ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు
- విప్ వ్యాఖ్యలతో కేసీఆర్ పోటీకి బలం చేకూరుతుందంటున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాలపై ప్రభావం
- వంద శాతం కామారెడ్డి బరిలో కేసీఆరే ఉంటారు
- పోటీ చేయాలని మూడు సార్లు కేసీఆర్‌ను కోరాను
- ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్‌ను గెలిపిస్తాను
- మీడియా చిట్‌చాట్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు
కామారెడ్డి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ నిలబడితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేయవచ్చనే భావనలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీ సామన్య కార్యకర్తలు కోరినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. అయితే తాజాగా కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేయడం కేసీఆర్ పోటీపై బలం చేకూరుతోంది. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచే వందశాతం పోటీ చేయనున్నారంటూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను మూడు సార్లు కోరానని తెలిపారు. కేసీఆర్ బరిలో ఉంటే ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి కేసీఆర్‌ను గెలిపించుకుంటామని అన్నారు. తాను ఏమి చేయాలో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని ప్రభుత్వ విప్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ సొంత గ్రామంలో కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్ గ్రామం అని అన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం తన నానమ్మ పేరిట సొంత నిధులతో కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించారన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారని ప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ కామారెడ్డి బరిలో ఉంటారా లేదా అనేది బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టత రావాల్సి ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలం పెరిగే అవకాశం
సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలైన జగిత్యాల, సిరిసిల్లా, సిద్దిపేటలోను బీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్వహించిన పలు సర్వేల్లో రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని తేలింది. దీంతో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయవచ్చని ఆ పార్టీ ముఖ్యనేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో ఉంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా కొట్టి పారేయకుండా స్వాగతిస్తున్నారు. దీనికి తోడు తాజాగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సీఎం కేసీఆరే నూటికి నూరు శాతం పోటీలో ఉంటారంటూ చెప్పడం ఉమ్మడి జిల్లాలో మరింత చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ స్వగ్రామం పోసానిపల్లి
సీఎం కేసీఆర్ స్వగ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం పోసానిపల్లి గ్రామం. కేసీఆర్ తల్లి వెంకటమ్మ స్వస్థలం బీబీపేట మండలంలోని పోసానిపల్లి గ్రామం. తండ్రి రాఘవారావుది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం మోహినికుంట రాఘవారావు వెంకటమ్మ వివాహం చేసుకున్న తర్వాత పోసానిపల్లికి ఇల్లరికం వచ్చారు. అప్పట్లో రాజన్న సిరిసిల్లాలో అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మించడంతో పోసానిపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఆ సమయంలో రాఘవారావుకు చెందిన వందలాది ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. పోసానిపల్లిలో నివాసం ఉండే రాఘవారావుతో పాటు ఆ గ్రామ ప్రజలకు అప్పటి ప్రభుత్వం కోనాపూర్‌లో ఇళ్లు నిర్మించాయి. ఆ సమయంలోనే కేసీఆర్ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకుంది.
కోనాపూర్‌లో నానమ్మ పేరిట పాఠశాల నిర్మించిన కేటీఆర్
గత ఏడాది కిందట బీబీపేట మండలం కోనాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్‌లోని ఇల్లుని మంత్రి కేటీఆర్ సందర్శించి తన పూర్వికులను గుర్తు చేసుకున్నారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కేటీఆర్ కోనాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను రూ.2.5 కోట్లతో సొంత నిధులతో నిర్మించారు. పాఠశాల భవనమే కాకుండా ఆ గ్రామంలో పలు బీటీ, సీసీ రోడ్లు కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Updated Date - 2023-08-06T00:17:50+05:30 IST