వర్ష నష్టం
ABN, First Publish Date - 2023-08-02T00:08:06+05:30
జిల్లాలో గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్నే చేకూర్చాయి. భారీ వర్షాలతో చాలా మంది నిరుపేదలు గూడు కోల్పోగా మరికొందరు రైతుల పంటలు నీట మునిగి అప్పులను మిగిల్చాయి. ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం వాటిల్లింది.
రూ.7 కోట్లకు పైగానే..
- జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం
- నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన జిల్లా యంత్రాంగం
- ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు.. రూ.4.68 కోట్లకు పైగానే నష్టం
- నష్ట పరిహారం ఇవ్వాలంటున్న 1600 మందికిపైగా బాధిత రైతులు
- వరదలతో ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం
- ఏకధాటి వర్షాలకు కూలిన 380 ఇళ్లు
- పలు చెరువులు, కుంటలకు గండ్లు
- నష్ట నివారణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేనా?
కామారెడ్డి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్నే చేకూర్చాయి. భారీ వర్షాలతో చాలా మంది నిరుపేదలు గూడు కోల్పోగా మరికొందరు రైతుల పంటలు నీట మునిగి అప్పులను మిగిల్చాయి. ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం వాటిల్లింది. వరదల తాకిడికి రహదారులు గుంతలమయంగా మారాయి. మరికొన్ని చోట్ల కల్వర్టులు, వంతెనలు తెగిపోయాయి. పలు చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎక్కువగా వ్యవసాయరంగానికి నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగి వందలాది మంది రైతులకు అప్పులను మిగిల్చాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై జిల్లా యంత్రాంగం లెక్కలు తేల్చింది. ఎంత నష్టం జరిగిందనే దానిపై క్షేత్రస్థాయిలో ఆయా శాఖల అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు సుమారు రూ.7 కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది.
కూలిన 380 ఇళ్లు
జిల్లాలో గత వారం రోజుల కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వందలాది కుటుంబాలు నివాస గృహాలను కోల్పోయారు. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వందలకు పైగానే ఇళ్లు కూలిపోయాయి. 380కి పైగా ఇళ్లు కూలిపోయినట్లు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌శాఖలు ప్రాథమిక అంచనాలు వేశాయి. ఇందులో 371 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 9 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు ఆయా శాఖల అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలనలో తేలింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నివాస గృహాలు ధ్వంసం అయిన నేపథ్యంలో సుమారు రూ.1.62 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తిగా కూలిపోయిన ఇళ్ల యజమానులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. 50 శాతం మేర శిథిలమైన వాటికి పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.
దెబ్బతిన్న పంటలకు రూ.4.68 కోట్ల నష్టం
జిల్లాలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టింది. భారీ వర్షాలు, వరదల తాకిడికి వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతినడమే కాకుండా వందలాది మంది రైతులను అప్పుల ఊబిలోకి నెట్టింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సుమారు రూ.4.68 కోట్ల వరకు నష్టం ఉంటుందని సంబంధిత శాఖ ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా 3 మండలాల్లోని 37 గ్రామాల పరిధిలో 1641 మంది రైతులకు సంబంధించి 2981 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునగడంతో నష్టం వాటిల్లింది. ఇందులో వరి 258 ఎకరాలు, సోయాబిన్ 2225, కందులు 319, పెసర్లు 37, మినుములు 76, పత్తి 36 ఎకరాల్లో పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల వరద తాకిడికి కొట్టుకుపోయాయి. వారం రోజులుగా వరి, సోయా వరదనీటిలోనే ఉండిపోవడం, కొట్టుకుపోవడంతో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోయా పంట మూడు రోజుల కంటే ఎక్కువగా వరద నీటిలో ఉండి పంట మొత్తం మురిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం డోంగ్లిలో వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్న సోయా పంటకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ బాధిత రైతులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం
జిల్లాలో భారీ వరదలు, వర్షాలతో ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం వాటిల్లింది. రహదారులు ధ్వంసం అవ్వడమే కాకుండా గుంతలమయం అయ్యాయి. వరదల తాకిడికి పలు చెరువులు, కుంటలకు గండ్లు ఏర్పడ్డాయి. దీంతో లక్షల్లోనే ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాలు వేసినట్లు తెలుస్తోంది. వరదల తాకిడికి జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖకు, రోడ్డు భవనాల శాఖకు సంబంధించి పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయి గుంతలమయం అయ్యాయి. దీంతో ఇరు శాఖలకు సుమారు రూ.57లక్షల్లో నష్టం వచ్చినట్లు తెలిసింది. 6 చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రాణ నష్టం సైతం వాటిల్లింది. మూడు మూగ జంతువులు వరదల తాకిడికి చనిపోగా ఇద్దరు వ్యక్తులు వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.
Updated Date - 2023-08-02T00:08:06+05:30 IST