గృహాలక్ష్మికి శ్రీకారం
ABN, First Publish Date - 2023-08-09T23:59:17+05:30
సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
- నియోజక వర్గానికి 3 వేల చొప్పున 12వేల యూనిట్లు
- ఎంపీడీవో, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
- సొంత జాగా ఉన్న వారికి అవకాశం
- నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
కామారెడ్డి, ఆగస్టు 9: సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 10 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 3వేల చొప్పున యూనిట్లు మంజూరు చేయనున్నారు. దీంతో మొత్తం జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు 12 వేల యూనిట్లు మంజూరు కానున్నాయి.
తెల్ల కాగితంపై దరఖాస్తు
లబ్ధిదారులు హైరానా పడకుండా కేవలం తెల్ల కాగితంపై కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ధ్రువపత్రాలు ఏవి అందుబాటులో ఉంటే అవి జత చేయవచ్చన్నారు. 10వ తేది తర్వాత పరిశీలనకు వచ్చే సిబ్బందికి అన్ని ధ్రువ పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. 20వ తేది నుంచి క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తారని తెలిసింది. ఈ నెల 25 నుంచి లబ్ధిదారులకు పథకం మంజూరయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్, ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకునే వారు సొంత ఇంటి జాగా కాగితాలు, ఆహార భద్రత, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ దరఖాస్తుతో పాటు సమర్పించాలని, దరఖాస్తులను తెల్ల కాగితం పైన కానీ టైప్ చేసిన కాగితం ద్వారా సమర్పించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఆర్‌బీసీ పక్క ఇల్లు ఉన్నవారు జీవో 59 కింద లబ్ధి పొందినవారు ఈ పథకానికి అనర్హులని తెలిపారు.
నేటితో గడువు ముగియనుండడంతో ప్రజల్లో అసంతృప్తి
ప్రభుత్వం అందిస్తున్న గృహాలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని పేర్కొంటుండడం మరోవైపు అధికారులు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెబుతుండడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంటుంది. జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలన్నీ దాదాపుగా ఈ పథకం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎంతో కొంత భూమి ఉన్నవారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం కావాల్సిన ధ్రువపత్రాల అందించడానికి కొంత సమయం తీసుకుంటుంది. కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం దారుణమని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఉపాఽధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, స్థానికంగా అందుబాటులో లేనివారు కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గడువును పెంచాలని నిరంతర ప్రక్రియ అని చెబుతూ గడువును ఎందుకు విధించారనే వాదనలు వినిపిస్తున్నారు.
మీ సేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల్లో కిక్కిరిసిన జనం
నాగిరెడ్డిపేట: ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును విధించడంతో కేవలం మూడు రోజుల పాటు దరఖాస్తులు ఇవ్వడానికి గడువు ఉండడంతో దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారం ఉదయం నుంచే నాగిరెడ్డిపేట రెవెన్యూ కార్యాలయం వద్ద బారులు తీరారు. అలాగే కులం సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న గ్రంథాలయ భవనంలో స్థానిక ఇన్‌చార్జీ తహసీల్దార్ రాందాస్ తమ రెవెన్యూ సిబ్బందిని రెండు కౌంటర్లుగా ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గడువు గురువారంతో ముగుస్తున్నందున లబ్ధిదారులు ఉదయం నుంచే రెవెన్యూ కార్యాలయానికి పరుగులు పెట్టారు. ప్రభుత్వం గడువును పెంచాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2023-08-09T23:59:17+05:30 IST