ఇందూరు రైతుల కల నెరవేరింది
ABN, First Publish Date - 2023-10-04T03:45:47+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో ఇందూరు రైతుల కల నెరవేరిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
పసుపు బోర్డు ప్రకటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : ఈటల
సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే : అర్వింద్
కేసీఆర్ ఏ పథకాన్ని పూర్తిగా అమలు చేయరు : డీకే అరుణ
నిజామాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో ఇందూరు రైతుల కల నెరవేరిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో మంగళవారం జరిగిన ఇందూరు జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు జిల్లా నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ, రైతుల కష్టాన్ని గుర్తించిన ప్రధాని మోదీ వారి ఆశలను నెరవేర్చారని చెప్పారు. పసుపు రైతులు అందరికీ ఈ బోర్డు ఉపయోగపడుతుందన్నారు. కాగా, ఇందూరు ప్రజలు ఇచ్చే తీర్పుతో బీఆర్‌ఎస్ పునాదులు కదలనున్నాయని ఈ సభలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నిక మాదిరిగానే రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కట్టడం ఖాయం అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత లోక్‌సభ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జి పీ.మురళీధర్ రావు అన్నారు. పసుపు రైతుల కోసం ప్రధాని మోదీ పసుపు బోర్డును ప్రకటిస్తే బీఆర్‌ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేంద్రం రూ.లక్షల కోట్లను రాష్ట్రానికి ఇస్తే బీజేపీ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి ఎక్కడ బయటపడుతుందనే భయంతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను రాష్ట్రం కేంద్రానికి పంపడం లేదని ఆరోపించారు. ఎన్నికల కోసమే పాలమూరు పథకం విషయంలో కేసీఆర్ హడావిడి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకముందే ట్రయల్‌రన్ చేపట్టి రైతులను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఏ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని కేసీఆర్.. ఎన్నికలు వచ్చినప్పుడు వరాలు ప్రకటించి మాయ చేస్తుంటారని ధ్వజమెత్తారు
.
Updated Date - 2023-10-04T03:45:47+05:30 IST