సహకార సంఘాల వ ్యవస్థ శక్తివంతమైనది
ABN, First Publish Date - 2023-07-22T00:22:54+05:30
సహకార సంఘాల వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాత బాన్సువాడలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ కార్యాలయ భవనాన్ని, గోడౌన్‌లను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 1977లో నా రాజకీయ జీవితం దేశాయిపేట సొసైటీ చైర్మన్‌గా ప్రారంభమైందన్నారు.
- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జూలై 21: సహకార సంఘాల వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాత బాన్సువాడలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ కార్యాలయ భవనాన్ని, గోడౌన్‌లను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 1977లో నా రాజకీయ జీవితం దేశాయిపేట సొసైటీ చైర్మన్‌గా ప్రారంభమైందన్నారు. 1987లో నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా అయ్యానన్నారు. ఆ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహకార సంఘాలను బలోపేతం చేశారని గుర్తు చేశారు. సింగిల్ విండో ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను ఒకే ప్రదేశంలో అందించడం ద్వారా సహకార సంఘాలు విజయవంతమయ్యాయన్నారు. ఇప్పటికీ కూడా ఆ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. స్వలాభం చూసుకోకుండా సేవా భావంతో సొసైటీల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి సొసైటీని జిల్లాలో ఆదర్శంగా అభివృద్ధి చేశారన్నారు. రైతుల సహకారం, పాలక వర్గం శ్రమతో భవిష్యత్‌లో బాన్సువాడ సొసైటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎరువుల కొరత లేకుండా చేయగలిగామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5 టీఎంసీలకు తోడుగా అవసరమైన మరో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటి సారి జూన్ 21న కాల్వలకు నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం వర్షాలు భాగా కురుస్తున్నాయని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైందని పంటల సాగుకు నీరు పుష్కలంగా సరిపోతాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీల ఆధ్వర్యంలో పండిన ధాన్యానికి సమయానుకూలంగా కాంటాలు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరాంరెడ్డి, జడ్పీటీసీ పద్మ, మున్సిపల్ చైర్మన్ జంగం గాధర్, మండల ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలు, పర్యటనలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత నివాసాలు, మట్టి గోడలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని అలాంటి ఇళ్లల్లో ఉండవద్దని ఆయన తెలిపారు.
Updated Date - 2023-07-22T00:22:54+05:30 IST