పని బారేడు.. వేతనం మూరే డు!
ABN, First Publish Date - 2023-09-04T01:29:13+05:30
విద్యారంగాభివృద్ధికి, ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విద్యాశాఖకు వారధిగా నిలుస్తు, పేద పిల్లలకు సౌకర్యాలతో కూడిన విద్యను బోధిస్తున్న సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టారు. పని బారెడు జీతం మూరేడు అనే చందంగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రశిక్ష అభియాన్ అమల్లోకి వచ్చింది.
- చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారం
- హామీలకే తప్ప అమలుకు నోచుకుని ప్రజాప్రతినిధుల వాగ్దానాలు
- 15 ఏళ్లుగా సమగ్రశిక్ష అభియాన్‌లో విధుల నిర్వహణ
- ఏళ్ల తరబడి వేతనాల పెంపుకై ఎదురుచూపులే..
- ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని ఆందోళన బాటలో సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు
- జిల్లాలో 744 మంది ఉద్యోగులు
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 3: విద్యారంగాభివృద్ధికి, ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విద్యాశాఖకు వారధిగా నిలుస్తు, పేద పిల్లలకు సౌకర్యాలతో కూడిన విద్యను బోధిస్తున్న సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టారు. పని బారెడు జీతం మూరేడు అనే చందంగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రశిక్ష అభియాన్ అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్ట్ ఏర్పడింది. దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పని చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో, అధిక పనిభారంతో సతమతమవుతున్నామని, తమను క్రమబద్ధీకరించాలంటూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో తమకు తగిన న్యాయం చేస్తామని సీఎం, విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆ హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఇక నిరసన బాట పట్టే తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామంటూ రోజుకోరకంగా గత వారం రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 744 మంది ఉద్యోగులు
జిల్లాలో సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 744 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు కలిగి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్‌కం రోస్టర్ ప్రకారం కలెక్టర్ చైర్మన్‌గా కలిగిన డీఎస్‌సీ కమిటీ ఆధ్వర్యంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూలో ఎంపికై కాంట్రాక్ట్ పద్ధతిన నియమింపబడ్డారు. వీరు డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 744 మంది ఉద్యోగులలో డీపీవోలు 7, యూఆర్‌ఎస్‌అండ్ కేజీబీవీ 476, పీటీఐలు 70, కేర్‌గివింగ్ వాలంటీర్స్ 16, సీసీవోలు 19, సీఆర్‌పీలు 78, ఎంఐసీ 17, ఐఈఆర్‌పీలు 42, మెసెంజర్‌లు 19 మంది సిబ్బంది, బోధన, బోధనేతర సిబ్బంది ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమకు కనీస వేతన పేస్కేల్ అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, విద్యాశాఖ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10లక్షలు, ఆరోగ్య బీమా రూ.5లక్షలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తక్కువ వేతనంతో ఎక్కువ పని భారం
15 సంవత్సరాలుగా జిల్లాస్థాయిలో డీఈవోలు, సిస్టం ఆనలిస్టులు, ఏపీవోలు, టెక్నికల్ పర్సన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డీఎల్‌ఎం ఎంట్రీ అటెండర్లు, రిసోర్స్‌పర్సన్‌లుగా భవిత కేంద్రాలతో పాటు మండల రిసోర్స్‌పర్సన్‌లు, కేజీబీవీల్లో, స్కూళ్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సీఆర్‌పీ తమ పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అందిస్తు డీఈవో, ఎంఈవోలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. బోధనేతర బిల్లు, మధ్యాహ్న భోజన బిల్లులు తయారు చేయడం, డీఈవో కార్యాలయం నుంచి అడిగిన ప్రతీ సమాచారాన్ని సేకరించి పంపడం, పాఠశాల్లో ఉపాధ్యాయులు రాని సమయంలో విధులు నిర్వర్తించడం, పండుగలు, పబ్బాలు అని లేకుండా కేజీబీవీల్లో విధులు నిర్వహించడం, ప్రైవేట్ పాఠశాలల గుర్తింపులు, యూడైస్ వివరాలు తదితర పనులు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా వారికి మాత్రం చాలీచాలని వేతనాలు అందుతున్నాయి. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వీరికి నెల వేతనాలు రూ.8500 నుంచి రూ.32వేల వరకు ఉన్నాయి. ఎక్కువ శాతం రూ.19,500 వేతనాలు అందుకుంటున్న వారే అధికంగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని నాలుగేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాలుగా ఉద్యోగులు జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా స్థాయిలో గత వారం రోజుల నుంచి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహానీయుల విగ్రహాల ముందు తమ దీక్షలు, వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పని చేస్తున్నాం
- వీణ, కేజీబీవీ, వ్యాయామ ఉపాధ్యాయురాలు
గత 10 సంవత్సరాలుగా కేజీబీవీ పరిధిలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. ఉదయం 6 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. రూ.15వేల జీతం అందిస్తుండగా అందులో ప్రయాణ ఖర్చులకే రూ.6 వేల వరకు పోతుండగా మిగిలిన జీతం ఏ మూలన సరిపోవడంలేదు. పండుగ, పబ్బం సెలవులు అంటూ ఏమి లేకుండా కుటుంబం కంటే పాఠశాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా చాలీచాలని జీతాలు మాత్రమే అందుతున్నాయి. తమకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- శైలజ, కంప్యూటర్ ఆపరేటర్, సమగ్రశిక్ష అభియాన్ ఉపాధ్యక్షురాలు
గత 17 సంవత్సరాలుగా విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నా ఇంత వరకు రెగ్యులర్ చేయలేదు. తన విధుల్లో భాగంగా మధ్యాహ్న భోజన బిల్లులు, బియ్యం సరఫరాకు సంబంధించిన వివరాలు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, యూడైస్‌తో పాటు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన గుర్తింపు వివరాలు తదితర అనేక విధులు నిర్వహిస్తున్నాం. ఇంత వరకు తమకు ఉద్యోగభద్రత అనేది లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నో సార్లు హామీలు ఇచ్చారే తప్ప అమలుకు మాత్రం కృషి చేయడం లేదు.
సమానపనికి సమాన వేతనం అందించాలి
- సత్యనారాయణ, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యారంగంలో కీలకంగా వ్యవహరిస్తు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులకు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదు. 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న తమను అసలు పట్టించుకోకపోవడం, ఉద్యోగభద్రత కల్పించకపోవడం విడ్డూరంగా ఉంది. తమకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం అందించాలి.
Updated Date - 2023-09-04T01:29:13+05:30 IST