వైద్య విద్యకు వేళాయే!
ABN, First Publish Date - 2023-08-10T00:02:53+05:30
కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని విద్యార్థి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభం సమయంలో సీఎం కేసీఆర్ వైద్య కళాశాల ఏర్పాటుపై హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
- జిల్లా వైద్య కళాశాలలో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
- ప్రవేశాలు ప్రారంభించిన వైద్యశాఖ
- 100 సీట్లకు అడ్మిషన్లు
- ఇప్పటికే ఆల్ ఇండియా కోటలో 15 సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం
- మరో 85 సీట్లు రెండు నెలల్లో భర్తీ
- వేగంగా కొనసాగుతున్న కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 9: కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని విద్యార్థి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభం సమయంలో సీఎం కేసీఆర్ వైద్య కళాశాల ఏర్పాటుపై హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా వైద్య కళాశాల ప్రారంభానికి కావాల్సిన అన్ని అనుమతులు, వసతులు కల్పించేందుకు ప్రిన్సిపాల్‌ను సైతం నియమించి జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) నుంచి రావాల్సిన అనుమతులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. గత కొన్ని నెలలుగా ఒక్కో ప్రక్రియ కొనసాగుతూ ప్రస్తుతం ఈ ప్రక్రియ చిట్ట చివరికి రాగా కళాశాలలో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం మొదలైంది. మొత్తం 100 సీట్లకు గాను ఆలిండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్‌లో 15 సీట్లు కేటాయించగా అందులో మహారాష్ట్రకు చెందిన అంకిత అనే విద్యార్థిని అడ్మిషన్ పొందింది. మరో 85 సీట్లను రెండు నెలల్లో రాష్ట్ర కోటా కింద భర్తీ కానున్నట్లు కళాశాల సిబ్బంది పేర్కొంటున్నారు.
ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభం
జిల్లాకు వైద్య కళాశాల వచ్చింది కానీ తరగతులు ప్రారంభమయ్యేదెప్పుడూ అన్న సందేహాలు వినిపిస్తూ వచ్చాయి. సరైన భవనం లేదని విద్యార్థులు పాఠాలు ఎక్కడ వింటారని వాదనలు వినిపించగా ఎంసీహెచ్ ఆసుపత్రిలోనే వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టి అందుకు అనుగుణంగా నిర్మాణాలు సైతం చేపడుతూ వస్తున్నారు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు రావడంతో పాటు విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ ఏడాది నుంచే తరగ తులు ప్రారంభిస్తారనే విషయం స్పష్టమవుతోంది. మొత్తం కళాశాలలో 100 సీట్లు ఉండగా ఆల్ ఇండియా కోటాలో 15, రాష్ట్రానికి సంబంధించి మిగిలిన 85 సీట్లను భర్తీ చేయనున్నారు. వైద్య కళాశాలకు కావాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం ఈ ఏడాది ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నారు. ఫస్టియర్‌లో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫీజియాలజీ సబ్జెక్టులు ఉండగా వీటికి సంబంధించి ప్రస్తుతం పలువురు ప్రొఫెసర్లు వచ్చారు. త్వరలోనే మిగతా వారిని ప్రభుత్వం నియమించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు.
వేగంగా కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు
ఎన్నికల వాతావరణం రాకముందే జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభం కావాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తగ్గట్లుగానే జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కళాశాల భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తరగతుల నిర్వహణకు కావాల్సిన నిర్మాణ పనులను పూర్తి చేశారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్ పేర్కొంటున్నారు. ఇక జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిగా కొనసాగనుంది. ఆసుపత్రిలో ఇప్పటికే పై అంతస్తులో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలు చేపట్టగా పనులు పూర్తియ్యే దశ కు చేరుకున్నాయి.
ప్రజలకు చేరువ కానున్న మరిన్ని సేవలు
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారినా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, సిబ్బంది లేక అంతంత మాత్రంగానే అందుతున్నాయని ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తూనే ఉన్నారు. ఆసుపత్రిలో నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుండగా వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రసవం అయ్యాక తగిన బెడ్డు సౌకర్యాలు లేవంటూ ప్రసవం కోసం వచ్చే వారు విమర్శలు గుప్పిస్తున్నారు. రోజులో ఐదారు రోడ్డు ప్రమాదం భారిన పడి ఆసుపత్రికి ప్రాణాపాయ స్థితిలో వస్తున్న వారు ఉంటున్నారు. వీరికి సిటీ స్కాన్ చేయిద్దామంటే అసలు ఆ సౌకర్యమే లేదు. ప్రతీసారి ప్రైవేట్ వైపు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఒకే ఒక ఎక్స్‌రే యంత్రం ఉండడంతో ఎముకలు విరిగి అవస్థలు పడుతూ పదుల సంఖ్యలో క్యూ కట్టాల్సి వస్తోంది. అది కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం వైద్యకళాశాల ఏర్పాటు అయితే నిపుణులైన వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్‌లు అందుబాటులోకి వస్తుండడంతో ఒకటి రెండు సంవత్సరాలలో ప్రస్తుత అందుతున్న సేవలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది.
Updated Date - 2023-08-10T00:02:53+05:30 IST