దంచికొట్టిన వర్షం
ABN, First Publish Date - 2023-07-20T23:48:25+05:30
జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడిన భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. వర్షాల తాకిడికి జనజీవనం సైతం స్తంభించిపోతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64.2మి.మీ వర ్షపాతం నమోదైంది.
- జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు
- సదాశివనగర్, గాంధారిలో కుండపోత
- సదాశివనగర్‌లో 100 మి.మీ, గాంధారిలో 95 మి.మీ కురిసిన వర్షం
- ఉప్పొంగి పారుతున్న వాగులు, వంకలు
- నిండుకున్న చెరువులు, కుంటలు
- నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 23వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో
- నిండుకున్న పోచారం ప్రాజెక్ట్.. కళ్యాణి గేట్ల ఎత్తివేత
- భారీ వర్షాలకు తెగిపోతున్న రహదారులు.. కూలుతున్న భారీ వృక్షాలు
కామారెడ్డి, జూలై 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురుతో కూడిన భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. వర్షాల తాకిడికి జనజీవనం సైతం స్తంభించిపోతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64.2మి.మీ వర ్షపాతం నమోదైంది. సదాశివనగర్, గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. ఈ రెండు మండలాల పరిధిలో 90 మి.మీ.ల కంటే ఎక్కువే వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల రహదారులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు కూలి రోడ్డుపై పడిపోతున్నాయి. మరికొన్నిచోట్ల శిఽథిల భవనాలు కూలి పోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లైన నిజాంసాగర్, పోచారం కౌలాస్ ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తుతోంది. కళ్యాణి రిజర్వాయర్ పూర్తిగా నిండుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సదాశివనగర్, గాంధారిలో కుండపోత
జిల్లాలోని సదాశివనగర్, గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో సదాశివనగర్‌లో 100.3 మి.మీ వర్షం కురువగా గాంధారిలో 95.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మద్నూర్‌లో 5.0 మి.మీ వర్షం కురువగా జుక్కల్‌లో 12.9మి.మీ, పెద్ద కొడప్‌గల్‌లో 52.1మి.మీ, బిచ్కుందలో 13.2 మి.మీ, బీర్కూర్‌లో 9.7మి.మీ, నస్రుల్లాబాద్‌లో 21.2మి.మీ, మాచారెడ్డిలో 58.5మి.మీ, బాన్సువాడలో 32.0మి.మీ, పిట్లంలో 41.2మి.మీ, నిజాంసాగర్‌లో 48.5మి.మీ, నాగిరెడ్డిపేటలో 81.4మి.మీ, ఎల్లారెడ్డిలో 66.9మి.మీ, లింగంపేటలో 65.1మి.మీ, తాడ్వాయిలో 71.8మి.మీ, రాజంపేటలో 69.0మి.మీ, భిక్కనూర్‌లో 63.7మి.మీ, కామారెడ్డిలో 78.6మి.మీ, దోమకోండలో 57.6మి.మీ, బీబీపేటలో 54.2మి.మీ డోంగ్లిలో 4.8మి.మీ., పల్వంచలో 54.0 మి.మీ, రామారెడ్డిలో 85.6మి.మీ వర్షం కురిసింది.
తెగిపోతున్న రహదారులు.. కూలుతున్న వృక్షాలు
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగుల్లో వరద పోటెత్తుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వరద తాకిడికి రహదారులు తెగిపోతున్నాయి. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈదురుగాలులకు భారీ వృక్షాలు కూలి రోడ్లకు అడ్డంగా పడిపోతున్నాయి. పిట్లం మండలం తిమ్మానగర్ శివారులోని నల్లవాగు కాల్వ వద్ద నూతనంగా వంతెన నిర్మిస్తున్నారు. వాగుపై తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటుచేశారు. భారీ వర్షాలతో నల్లవాగుకు వరద పోటెత్తింది. ఈ వరద తాకిడికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రహదారి గుండా కాకుండా వేరే మార్గం ద్వారా పోలీసులు వాహనాలను తరలిస్తున్నారు. గాంధారి మండలంలో తిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడి వరద నీరు వృథాగా పోతోంది. రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో వర్షానికి ఇంటి గోడ కూలింది. లింగంపేట మండలం మేగారం గ్రామ శివారులో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే సురేందర్ వెంటనే అధికారులను ఆదేశించి భారీ వృక్షాన్ని తొలగించారు.
వాగులు, చెరువులకు జలకళ
గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని పలు చెరువులు, వాగులకు జలకళ సంతరించుకుంటుంది. ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలతో లింగంపేట పెద్దవాగుకు వరద పోటెత్తుతోంది. ఈ వాగు వరద ఉధృతితో ప్రవహిస్తోంది. అదేవిధంగా పిట్లం, గాంధారి, సదాశివనగర్,మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట తదితర మండలాల పరిధిలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వచ్చి చేరుతుంది. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. కామారెడ్డి పెద్దచెరువు పూర్తిస్థాయిలో నిండుకుంది. కేవలం ఒక అడుగు దూరంలోని నీటిమట్టం ఉంది. రేపోమాపో కామారెడ్డి చెరువు అలుగు దూకే అవకాశం ఉంది. అదేవిధంగా సదాశివనగర్‌లోని అమర్లబండ చెరువు నిండుకోవడంతో కట్టకు బుంగ పడింది.
ప్రాజెక్ట్‌లోకి పోటెత్తుతున్న వరద
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. గత వారం రోజుల కిందట నీరులేక బోసిపోయిన నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్ట్‌లతో పాటు కళ్యాణి, సింగీతం రిజర్వాయర్‌లకు వరద ప్రవాహం వచ్చి చేరడంతో నిండుకుండలా కనిపిస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తోంది. 23వేల 400ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.475 టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. పోచారం ప్రాజెక్ట్ సైతం నిండుకుంటుంది. ఈ ప్రాజెక్ట్‌లోకి 10వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.143 టీఎంసీలలో నిరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నేడు నిండే అవకాశం ఉంది. అదేవిధంగా కళ్యాణి రిజర్వాయర్ సైతం పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సింతీతం రిజర్వాయర్ సైతం నిండుతోంది.
Updated Date - 2023-07-20T23:48:25+05:30 IST