ఢీకొనేదెవరో?
ABN, First Publish Date - 2023-08-25T00:01:31+05:30
కామారెడ్డి జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయడం, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంటుంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచేదేవరో.. గట్టిపోటీనిచ్చేదెవరోననే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
- ఎన్నికలకు సిద్ధమైన బీఆర్‌ఎస్ అభ్యర్థులు
- ప్రత్యర్థులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి
- రోజురోజుకూ కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు
- దరఖాస్తులను స్వీకరిస్తున్న కాంగ్రెస్ పెద్దలు
- నేటితో దరఖాస్తులకు చివరి గడువు
- బీజేపీలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువే
- ఎవరు గట్టిపోటీ ఇస్తారనేదానిపై జోరుగా చర్చ
కామారెడ్డి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయడం, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంటుంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచేదేవరో.. గట్టిపోటీనిచ్చేదెవరోననే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ శంఖారావం పూరించింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన విషయం విధితమే. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి ఎవరు పోటీలో ఉంటారో తేలాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ తరపున ఆశావహులు పార్టీ పెద్దలకు దరఖాస్తులు చేసుకునేందుకు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. నేటితో కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తులకు చివరి తేది కానుంది. అదేవిధంగా బీజేపీలోను ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఈ సారి తమకంటే తమకు టికెట్ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో పాటు టికెట్‌లు ఆశించేవారు సైతం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి మినహాయిస్తే మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పోటీచేసే ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించడంతో గత వారం రోజులుగా పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. రేపటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్‌అలీ బరిలో నిల్వనున్నారు. దాదాపు ఈ నేతకే టికెట్ ఖరారు కానుంది. షబ్బీర్‌అలీ కాకుండా ఆ పార్టీలోని ఎవరు కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్ నేత వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ఇరువురు నేతలు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలే కాకుండా సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎల్లారెడ్డి నుంచి టికెట్‌కై కాంగ్రెస్ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరోనేత తాడ్వాయికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి టికెట్‌కై దరఖాస్తు చేసుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోనూ ముగ్గురు నేతల మధ్య టికెట్‌కై పోటీ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ఎన్‌ఆర్‌ఐ లక్ష్మీకాంత్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు నేతలు టికెట్‌కై కాంగ్రెస్ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మొన్నటి వరకు కాసుల బాలరాజు ఒక్కరే టికెట్ ఆశించారు. గతంలోనూ బాల్‌రాజే పార్టీ పరంగా పోటీచేసి స్పీకర్‌పై ఓడిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ నియోజకవర్గం నుంచి మరో 11 మంది కాంగ్రెస్ నాయకులు టికెట్లకై దరఖాస్తు చేసుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు చెందిన అంబర్‌సింగ్, ప్రతాప్‌సింగ్, శ్రీనివాస్‌రావు, రాజిరెడ్డి, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, మోతీలాల్, వెంకటరాంరెడ్డిలు టికెట్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చేనెల మొదటి రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.
బీజేపీలోనూ ఆశావహులు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారో ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జ్ కాటిపల్లి వెంకటరమణరెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలైన మురళీధర్‌గౌడ్, ఎంజీ వేణుగోపాల్ లాంటి నేతలు కూడా టికెట్‌లు ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ అధిష్ఠానం వెంకటరమణరెడ్డికే టికెట్ ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలో ఉన్నందున బీజేపీ నుంచి బలమైన నేతను బరిలో దింపాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ పలువురు నేతలు టికెట్‌లు ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పార్టీ పరంగా పోటీచేసి ఓడిపోయిన బాణాల లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తుండగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారంతో అధిష్ఠానం అతనికి టికెట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బైండ్ల పోచన్న సైతం టికెట్ ఆశిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతారకు దాదాపు టికెట్ ఖరారు కానుంది. బాన్సువాడ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ నేత మల్యాద్రిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మల్యాద్రిరెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. అయితే మల్యాద్రి రెడ్డి వ్యతిరేకవర్గం ఆయనకు కాకుండా వేరే వ్యక్తులకు టికెట్‌లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే బీజేపీ అధిష్ఠానం సైతం త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-08-25T00:01:31+05:30 IST