ఆశావర్కర్ల ఆశలు తీరేనా?
ABN, First Publish Date - 2023-09-01T00:05:30+05:30
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు చిన్నారుల వరకు టీకాలు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ బాధితుల వివరాలను, క్షయ బాధితుల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడడం ఇలా ఒక్కటేమిటీ వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఆశా కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకాలు, వ్యాక్సిన్‌లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది.
- ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహిస్తున్నా జీతాలు అంతంతే..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకం అమలులో పని చేస్తున్న ఆశాలు
- కనీస వేతనం అందించాలంటూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 31: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆసుపత్రికి చేరే వరకు.. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు చిన్నారుల వరకు టీకాలు వేయించడం.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం.. ప్రాణాంతకమైన కరోనా వైరస్ బాధితుల వివరాలను, క్షయ బాధితుల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, వారికి తగిన వైద్యసేవలు అందేలా చూడడం ఇలా ఒక్కటేమిటీ వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఆశా కార్యకర్తలే. ఎన్నికలు, ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు టీకాలు, వ్యాక్సిన్‌లు, ఐసీడీఎస్‌లో వారి సేవలు తప్పని సరి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతీ పథకంలో వారి భాగస్వామ్యం ఉంటుంది. ఇన్ని సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వం మాత్రం విస్మరిస్తోంది. వారికి చెల్లించాల్సిన పారితోషకాలను పెంచకపోవడం అంతకుముందు నుంచి అమలులో ఉన్న పారితోషకాలను పూర్తిస్థాయిలో అందించకపోవడంతో పాటు ఏళ్ల తరబడి పనులు చేస్తున్న వారికి కనీస వేతనంగా రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. ప్రభుత్వ పట్టింపులేని తనాన్ని ప్రశ్నిస్తూ పారితోషకం కిందకు వచ్చే పనులతో పాటు మిగిలిన పనులు కూడా చేస్తున్న వారికి అందాల్సిన పారితోషకం అందకపోవడంతో దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
సరిపోని పారితోషకాలు
ఆశాలకు పారితోషకాలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పాటు అంతకుముందు అందించే పారితోషకాలు సైతం అంతంత మాత్రంగానే అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. పైగా పారితోషకాలు లేని అనేక అదనపు పనులను తమతో చేయిస్తూ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా అందించడం లేదని దీంతో కుటుంబ అవసరాలతో పాటు, విధి నిర్వహణలో రోజువారి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని క్షయ బాధితులను గుర్తించేందుకు ఉదయమే విధులకు హాజరుకావాలని అధికారులు చెబుతుండడంతో ఇంట్లో పనులను సైతం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖలలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ పనిని నిర్వహిస్తున్నా తమ సేవలకు తగిన గుర్తింపు రావడం లేదని పేర్కొంటున్నారు.
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు కరువు
యావత్తు ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ మహమ్మారికి ప్రతి ఒక్కరూ గడగడలాడిన వైరస్ భారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అఽధికారుల సూచనల మేరకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా.. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్న చుట్టు పక్కల వారితో పాటు ఇతరులు దూరం పెట్టినా ఎలాంటి ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహించినా తమకు గుర్తింపే లేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులే పట్టించుకోని సమయంలో తాము ధైర్యంగా వెళ్లి నిత్యం వారి ఆరోగ్యపరిస్థితిని ఆరా తీస్తూ మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నా తమను మాత్రం ప్రభుత్వం ప్రతీసారి విస్మరిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఇంట్లో హడావిడిగా పనులు ముగించుకుని విధులలో చేరుతూ ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నా తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించాలని, పని భారం తగ్గించాలని కోరుతున్నారు.
కనీస వేతనం అందించాలని డిమాండ్
సాధారణంగా ప్రతీ ప్రభుత్వశాఖలో వివిధ రకాలుగా విధులు నిర్వహించే సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకున్నా జీతం రూపంలో ఎంతో కొంత చెల్లిస్తోంది. కానీ ఆరోగ్యశాఖలో విధులు నిర్వహించే ఆశా కార్యకర్తలకు అలాంటి పరిస్థితి లేదు. రోజంతా గ్రామాల్లో సేవలందిస్తున్నా పారితోషకంతో సరిపెడుతూ వెట్టిచాకిరి చేయిస్తోందని కార్మిక సంఘాల ఆరోపణ. ఆశాలు గ్రామాల్లో గర్భిణీని గుర్తిస్తే రూ.400, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయిస్తే రూ.500, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే రూ.600 ఇలా వారి సేవలను బట్టి పారితోషకం అందిస్తారు. ఒకవేళ గర్భిణి ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఆ నగదు కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తు ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలా పారితోషికంతో ముడిపెట్టకుండా వారి సేవలకు తగ్గ గుర్తింపును ఇస్తు కనీస వేతనంగా రూ.18వేలు అందించాలని ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో పాటు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-09-01T00:05:30+05:30 IST