Delhi Liquor Scam: మద్యం నిందితులకు నో బెయిల్
ABN, First Publish Date - 2023-02-17T03:16:28+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరపూరిత కుట్ర జరిగిందనడానికి సరిపడా ఆధారాలున్నాయని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరించింది.
నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా ఆధారాలున్నాయి
బెయిల్ కుదరదు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
ఫోన్ సాక్ష్యాల ధ్వంసం.. బయటకొస్తే ఆధారాలు తారుమారే
కోర్టు అనుమానం.. తీర్పులో 4 చోట్ల కవిత పేరు ప్రస్తావన
నేరపూరిత కుట్రగా తేల్చడంతో తేలిగ్గా పోయే కేసు కాదని స్పష్టత
చార్జిషీటులో పేర్లు నమోదైన వారందరికీ చిక్కులే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరపూరిత కుట్ర జరిగిందనడానికి సరిపడా ఆధారాలున్నాయని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరించింది. కుంభకోణంలో భాగంగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అరెస్టు చేసిన నిందితులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, మద్యం వ్యాపారులు సమీర్ మహేంద్రు, బినయ్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యునికేషన్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన విజయ్ నాయర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించారు. తీర్పు కాపీలో సీబీఐ, ఈడీచార్జిషీట్లలో పేర్కొన్న అంశాలను అవసరమైన చోట ప్రస్తావించారు. అలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తీర్పు కాపీలో నాలుగు చోట్ల సౌత్ గ్రూప్ భాగస్వామి హోదాలో కనిపించింది. కుట్ర జరిగిందనడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో చార్జిషీట్‌లో పేర్కొన్న వారందరికీ భవిష్యత్తులో చిక్కులు తప్పవని భావిస్తున్నారు.
గుత్తాధిపత్యానికి ప్రభుత్వం అనుమతించింది
‘‘వాస్తవాలు, పరిస్థితులను పరిశీలించిన నేపథ్యంలో ప్రస్తుత దశలో నిందితులు బెయిల్‌పై విడుదలకు అర్హులు కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. నిందితులపై ఉన్న మనీలాంరింగ్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఆర్థిక నేరారోపణలు తీవ్రమైనవి. ఈ నేరం పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం శిక్షార్హం. కాబట్టి బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నాం’’ అని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పేర్కొంది. ఢిల్లీ మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం విధానపరమైన నిర్ణయమని, దాన్ని కోర్టు సమీక్షించరాదని నిందితుల తరఫున న్యాయవాదులు చేసిన వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. లంచాలు స్వీకరించినట్లు లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తే దర్యాప్తు సంస్థలు, కోర్టులకు కేసులు చేపట్టే అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఢిల్లీలో అధికార పార్టీ పెద్దలకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించడం వల్ల మద్యం విధానాన్ని ఉల్లంఘిస్తూ కార్టెల్‌ను ఏర్పాటు చేసుకొని గుత్తాధిపత్యాన్ని చెలాయించడానికి ప్రభుత్వం అనుమతించినట్లు దర్యాప్తులో తేలిందని ప్రస్తావించింది. మద్యం తయారీదారులు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారాన్ని చేయరాదని మద్యం విధానంలో ఉన్నప్పటికీ సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థ అలాంటి వ్యాపారం చేసిందని పేర్కొంది. ముడుపులు చెల్లించడానికి, తిరిగిరాబట్టుకోడానికి సమావేశాలు జరిగినట్లు ఆధారాలు లేవని నిందితుల తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు అంగీకార యోగ్యంగా లేవని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిందితులు క్రిమినల్ నేరానికి పాల్పడినట్లు ఈడీ సరిపడా సాఽక్ష్యాధారాలు సమర్పించిన నేపథ్యంలో నిందితుల వాదనల్లో పస లేదని పేర్కొంది. ఈ కేసులో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలే కాకుండా వాట్సప్ చాట్లు, సెల్‌ఫోన్ లొకేషన్లు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, హోటల్‌లో జరిగిన సమావేశాల వివరాలు, ఇతర డిజిటల్ డేటా రూపంలో ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఈడీ అనుమానం వ్యక్తం చేసినట్లు బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేస్తానడం నిజం కాకపోవచ్చని, అలాంటి సందర్భంలో షరతులు విధించగలం కానీ నిందితులు ఇప్పటికే సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు, పలుసార్లు మొబైల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేయబోరని చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా పి.శరత్ చంద్రారెడ్డిపై ఈ ఆరోపణలు ఉన్నాయని ఉదాహరించింది. అయితే, తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రధాన కేసు మెరిట్స్‌పై ప్రభావం పడరాదని సీబీఐ కోర్టు తేల్చిచెప్పింది.
నాలుగు చోట్ల కవిత పేరు
రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పులో నాలుగు సార్లు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెల్లించడానికి ముడుపులను అభిషేక్ బోయినపల్లి ద్వారా శరత్ చంద్రా రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన సౌత్ గ్రూపు నుంచి విజయ్ నాయర్‌కు పంపించినట్లు దినేశ్ అరోరా, అరుణ్ పిళ్లై వాంగ్మూళంలో చెప్పినట్లు తీర్పులో జడ్జి పేర్కొన్నారు. అలాగే, ఆప్ నేతలకు రూ. 100 కోట్ల మేర ముడుపులు చెల్లించిన కవిత, శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ తదితరులతో కూడిన సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్రారెడ్డి కూడా కీలక వ్యక్తి అని పేర్కొంది. 2022 ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌లో ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో విజయ్ నాయర్, కవిత, దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై పాల్గొన్నారని తీర్పులో న్యాయమూర్తి ప్రస్తావించారు.
Updated Date - 2023-02-17T03:16:29+05:30 IST