బిల్లుల పంచాయితీ
ABN, Publish Date - Dec 25 , 2023 | 12:18 AM
గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీ భవనాలు నిర్మించాలని తలచింది. పక్కా భవనాలు లేని గ్రామపంచాయతీలకు కొత్త భవనాలు అందుబాటులో వస్తాయని పాలకవర్గాలు, ప్రజలు భావించారు. కానీ.. ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల బాధ సర్పంచులను వేధిస్తోంది. పూర్తి బిల్లులు వస్తాయో..? రావోనని..? సందేహాలు వారిని వేధిస్తున్నాయి
ఏడాదిగా మంజూరుకాని గ్రామపంచాయతీ భవనాల బిల్లులు
వివిధ దశల్లో 97 భవన నిర్మాణాలు
వచ్చేనెలతో ముగుస్తున్న సర్పంచుల పదవీకాలం
భువనగిరి అర్బన్, డిసెంబరు 24: గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీ భవనాలు నిర్మించాలని తలచింది. పక్కా భవనాలు లేని గ్రామపంచాయతీలకు కొత్త భవనాలు అందుబాటులో వస్తాయని పాలకవర్గాలు, ప్రజలు భావించారు. కానీ.. ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల బాధ సర్పంచులను వేధిస్తోంది. పూర్తి బిల్లులు వస్తాయో..? రావోనని..? సందేహాలు వారిని వేధిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి రూ.20లక్షలుగా నిర్థారించి పనులు మొదలుపెట్టారు. కాగా, పక్కా భవనాలు లేక అక్కడి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యకలపాలకు తరుచూ ఆటంకం కలుగుతోంది. సర్పంచులకే భవనాల నిర్మాణ బాధ్యతలు అప్పగించడంతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లో ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు అందక నిరాశలో ఉండగా లక్షలు వెచ్చిస్తే నిర్మిస్తే బిల్లుల పరిస్థితి ఏమిటని సందిగ్ధంలో సర్పంచులు ఉన్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో...
యాదాద్రిభువనగిరి జిల్లాకు 116పంచాయతీ భవనాలు మంజూరు మంజూర య్యాయి. 113భవనాలకు అంచనాలు వేశారు. ప్రస్తుతం 97కొత్త భవనాలు వివిధ దశల్లో ఏడాదిగా కొనసాగుతున్నాయి. 58బునాది, 10 బేస్మెంట్, 18 స్లాబ్, రెండు ఫినిషింగ్ పనులు కొనసాగుతుండగా వలిగొండ మండలంలో పాత నమూనాతో దాసిరెడ్డిగూడెం, కొత్త నమూనలో జంగారెడ్డిగూడెంలో అందుబాటులోకి వచ్చాయి.
ఏడాది గడిచినా..
జిల్లాలోని పంచాయతీ భవన నిర్మాణాలకు సంబంధించి 2022 డిసెంబరు 16న గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులు మంజూరు చేసింది. భవన నిర్మాణ బాధ్యతలను సర్పంచులకే అప్పజెప్పడంతో పనులు నిలిచిపోయాయి. అధికారులు కూడా ఒత్తిడి చేయడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వీటి భవన నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన అవి నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచులు ఈ భవనాల నిర్మాణాలు ముందడుగు వేయలేకపోతున్నారు.
సర్పంచుల సందేహాలు
వచ్చే ఏడాది జనవరి 31తో గ్రామపంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ముగుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వాహణపై స్పష్టత రాలేదు. దీంతో ప్రభుత్వం మారడంతో నెల వ్యవధిలో నిధులు మంజూరు చేస్తారో...? లేదోనని సర్పంచులు సందేహ పడుతున్నారు. పూర్తి చేసిన భవనాలకు పదవీ గడువు ముగిసిన తర్వాత బిల్లుల రావేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏడాదిగా ఎక్కడికక్కక్కడే పనులు నిలిచిపోయాయి.
ఇబ్బందులు తప్పినట్లేనా?
అభివృద్ధిలో భాగంగా వివిధ గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, చెత్త నిల్వ చేసేందుకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. ఇదిలా ఉండగా కార్యదర్శులతో పాటు సిబ్బందిని నియమించినా పంచాయతీలకు మాత్రం సొంత భవనాలు లేవు. ఇబ్బందులు తొలగించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం చర్యలు చేపట్టిన అవి పూర్తి కాకపోవడంతో కొత్తగా పగ్గాలు చేపట్టనున్న పాలకవర్గాలకు తలనొప్పి తప్పేలా లేదు.
శంకుస్థాపన చేసి వదిలేశారు
మా గ్రామ పంచాయతీ కొత్త ఏర్పడింది. ఐదేళ్లుగా మొర పెట్టుకున్న ఆలకించని గత పాలకులు ఆఘమేఘాలపై 2023 ఆక్టోబరు 3న శంఖుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు ఆ స్థలంలో పనులు మొదలుపెట్టలేదు.
కొమ్మగాని ప్రభాకర్‌గౌడ్, ఉపసర్పంచ్, ముత్తిరెడ్డిగూడెం, మోటకొండూరు
పనులు వివిధ దశల్లో ఉన్నాయి
పలు గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మాణంలో జాప్యం జరిగింది. పంచాయతీల పాలకవర్గమే నిర్మాణాలు చే యాల్సి ఉండగా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతాయి.
వెంకటేశ్వర్లు, ఈఈ, పంచాయతీరాజ్ యాదాద్రిభువనగిరి జిల్లా.
Updated Date - Dec 25 , 2023 | 12:18 AM