Prajavani : ప్రజాదర్బార్.. ఇకమీదట ప్రజావాణి
ABN, First Publish Date - 2023-12-12T04:30:07+05:30
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. ప్రజా పాలన అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రజా దర్బార్‌ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వారంలో రెండు రోజులు.. ప్రతి మంగళ,
మంగళ, శుక్రవారాల్లో నిర్వహించేందుకు సీఎం ఆదేశం..
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహణ
శాఖలపై సీఎం వరుస సమీక్షలు
ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించిన
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. ప్రజా పాలన అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రజా దర్బార్‌ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వారంలో రెండు రోజులు.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని సూచించారు. జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణికి వేళలను కూడా నిర్దేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలలోపు చేరుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూల ఏర్పాటు, ప్రజల సౌకర్యార్థం తాగు నీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. కాగా, రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో బిజీబిజీగా గడిపారు. పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఆయన రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉన్నారు. సమీక్షల విరామంలో.. తనను కలిసేందుకు వచ్చిన పలువురు ప్రముఖులు, అధికారులతో ముచ్చటించారు. ప్రజాకవి జయరాజు సచివాలయంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్, పశు సంవర్ధక శాఖ డైరక్టర్ రాంచందర్ సహా పలువురు అధికారులు, గతంలో రాష్ట్రంలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలి కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. వీరితోపాటు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్ సహా పలువురు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు.
ఏఈ పరీక్ష వాయిదాపై సీఎంతో చర్చిస్తాం
ఈ నెల 17న నిర్వహించబోయే టీఎస్ జెన్‌కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్ధులు ప్రజాదర్బార్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే రోజు రెండు, మూడు పరీక్షలు ఉన్నాయని తెలిపారు. వేతనాన్ని కూడా పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ప్రజాదర్బార్‌కు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై విజ్ఙప్తులను స్వీకరించారు. ఏఈ పరీక్ష వాయిదాపై సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారులు విజ్ఞప్తి లేఖల్లో పూర్తి అడ్రస్, ఫోన్ నంబరు రాయాలని.. తద్వారా సమస్యను పరిశీలించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.
Updated Date - 2023-12-12T04:30:10+05:30 IST