ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: ముఖ్య అతిథి అంబేడ్కర్‌ మనుమడే

ABN, First Publish Date - 2023-04-05T02:30:04+05:30

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఒక్కరే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయన ఒక్కరినే ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాబాసాహెబ్‌ విగ్రహావిష్కరణకు ప్రకాశ్‌ అంబేడ్కర్‌

ఆయన ఒక్కరినే ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

అంగరంగ వైభవంగా కార్యక్రమం.. బౌద్ధ సంప్రదాయంలో నిర్వహణ

నెక్లెస్‌ రోడ్‌లో 40 వేల మందితో సభ.. విగ్రహ శిల్పి సుతార్‌కు సన్మానం

పాలనావ్యవస్థకు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ నిత్య స్ఫూర్తి

తెలంగాణకు మార్గం సుగమం చేసిన బాంధవుడు: కేసీఆర్‌

తక్షణమే దళిత బంధు, గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల చేయండి

రెండో విడత గొర్రెల పంపిణీని సత్వరం ప్రారంభించండి

పోడు హక్కు పత్రాల పంపిణీ కూడా.. అధికారులకు నిర్దేశం

సచివాలయ సందర్శకులకు 2 గంటల సమయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఒక్కరే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయన ఒక్కరినే ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, విగ్రహాన్ని భారీ గజమాలతో అలంకరించాలని, గులాబీలు, తెల్ల చామంతి, తమలపాకులతో దానిని రూపొందించాలని, ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా పైనుంచి పూల జల్లు కురిపించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి, వారి సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అంబేడ్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు.

ఈనెల 14వ తేదీన అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణ, అనంతరం జరిగే సభ, జన సమీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితబంధు, గృహలక్ష్మి పథకాల అమలుకు తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌ రావు, సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు. గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలని, పోడు హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించాలని నిర్దేశించారు. కాగా, ‘‘పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరో దిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్తూపం.. వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేడ్కర్‌ మహానుభావుడు. మనల్ని నిత్యం చైతన్యపరుస్తూ పాలన వ్యవస్థకు నిత్య స్ఫూర్తిమంతమై దారిచూపుతాడు’’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శోభాయమానంగా, తెలంగాణ సమాజంతోపాటు యావత్‌ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని చెప్పారు.

దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నతంగా, అంబేడ్కర్‌ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని నిర్దేశించారు. విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా, కన్నుల పండువగా, దేశం గర్వించే రీతిలో జరపాలని అన్నారు. అనంతరం నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపైనా సమీక్షించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని; విగ్రహావిష్కరణ తర్వాత, దేశవ్యాప్తంగా అంబేడ్కర్‌ అభిమానులు, సామాజికవేత్తలు, సామాన్యులు సందర్శనకు వస్తారని, వారు నివాళులర్పించేందుకు రకరకాల పుష్పాలను అందుబాటులో ఉంచాలని, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంబేడ్కర్‌ ఔన్నత్యాన్ని చాటేలా దేశవ్యాప్తంగా ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలని చెప్పారు. ఈ బాధ్యతను మంత్రులు హరీశ్‌, కొప్పల ఈశ్వర్‌, ప్రశాంత్‌ రెడ్డిలతో కూడిన కమిటీకి అప్పగించారు. విగ్రహావిష్కరణ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి నెక్లెస్‌ రోడ్‌లో దాదాపు 40 వేల మందితో సభ నిర్వహించనున్నారు.

నియోజకవర్గానికి 300 మంది చొప్పున అన్ని నియోజక వర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు సుమారు 750 ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఇక, సభ సీఎస్‌ శాంతికుమారి ఉపన్యాసంతో ప్రారంభం కానుంది. తర్వాత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ముఖ్య అతిథి ప్రకాశ్‌ అంబేడ్కర్‌, చివరిగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. కాగా, అంబేడ్కర్‌ విగ్రహ రూపశిల్పి, మహారాష్ట్రకు చెందిన రామ్‌ వంజీ సుతార్‌ని ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించాలని సమీక్షలో నిర్ణయించారు. అలాగే, అంబేడ్కర్‌ పాటలతో సాంస్కృతిక నీరాజనం అందించాలని, ఇందుకు గిడ్డంకుల శాఖ చైర్మన్‌, గాయకుడు సాయిచంద్‌తో కార్యక్రమాలు రూపొందించాలంటూ సదరు బాధ్యతను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అప్పగించారు. సభకు హాజరయ్యే ప్రజలకు అందించేందుకు లక్ష స్వీట్‌ ప్యాకెట్లు, లక్షన్నర చొప్పున మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, ఇందుకు విజయ డెయిరీ సహకారం తీసుకోవాలని సూచించారు.

40 ఏళ్ల కిందటే ఏర్పాటు..

దేశంలో దళితుల స్థితిగతులను ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పోలుస్తూ అధ్యయనం చేయాలనే తపనతో నాలుగు దశాబ్దాల కిందట తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ‘సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీస్‌’ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశానని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. అంటరానితనం పేరుతో దుర్మార్గమైన రీతిలో వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతి కోసం, వారితోపాటు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్‌ పడిన శ్రమ, చేసిన కృషి ఆసియా ఖండంలోనే మరొకరు చేయలేదని సీఎం కొనియాడారు. తాను ఊహించిన దానికంటే అత్యద్భుతంగా విగ్రహ రూపం ఆవిష్కృతమైందని, ప్రసన్న వదనంతో నిలుచుని ఉన్న అంబేడ్కర్‌ ఒక తాత్విక జ్ఞానిగా అలరిస్తున్నాడని సంతృప్తి వ్యక్తం చేశారు. కలకాలం నిలిచేలా సాంకేతికంగా, తయారీపరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి రెండేళ్ల సమయం తీసుకుందని అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించడం తనకు సంతృప్తిని కలిగించిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు అనేక చర్చల అనంతరం ఎంతో దూరదృష్టితో ఆర్టికల్‌ 3ని రాజ్యాంగంలో పొందుపరిచారని, తెలంగాణ సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన తెలంగాణ బాంధవుడు, అందరివాడు, అంబేడ్కర్‌ అని కొనియాడారు.

దళితబంధు, గృహలక్ష్మికి తక్షణమే మార్గదర్శకాలు ఇవ్వండి

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ దళితబంధు, సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షల సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు మార్గదర్శకాలను తక్షణమే రూపొందించి, విడుదల చేయాలని మంత్రి హరీశ్‌ రావు, సీఎస్‌ శాంతి కుమారిని ఆదేశించారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న గొర్రెల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని సత్వరమే ప్రారంభించాలన్నారు. పోడు హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించుకోవాలని ఆదేశించారు.

సచివాలయ సందర్శకులకు రెండు గంటలు

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ అనంతరం ఏప్రిల్‌ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు. ఆరోజు శాస్ర్తోక్తంగా నిర్వహించే కార్యక్రమాలను ఆర్‌ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిర్వహిస్తారని మంగళవారంనాటి సమీక్షలో ఖరారు చేశారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సచివాలయ ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం, సీఎం కేసీఆర్‌ తొలుత తన చాంబర్లోని కుర్చీలో కూర్చుంటారు. తర్వాత, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళతారు. ఇక, తూర్పు (మెయిన్‌ గేట్‌) గేటును సీఎం, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు దేశ, విదేశ అతిథులు, ప్రముఖులు రాకపోకలకు వినియోగించనున్నారు. ఈశాన్య ద్వారం నుంచి అధికారులు రాకపోకలు సాగిస్తారు. ఆగ్నేయ ద్వారాన్ని సందర్శకుల కోసం వినియోగించనున్నారు. ఈ గేటు ద్వారా సందర్శకులు వచ్చేందుకు మఽధ్యాహ్నం 3 నుంచి 5 వరకు సమయం ఉండనుంది. అవసరమైనప్పుడు మాత్రమే వాయవ్య గేటును వాడనున్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్తు వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు.

జగ్జీవన్‌రామ్‌ జీవితం

అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం:కేసీఆర్‌

దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం అన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకమని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం జగ్జీవన్‌రామ్‌ 116వ జయంతిని పురస్కరించుకొని దళిత సమాజాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన సంఘసంస్కర్తగా బాబూ జగ్జీవన్‌రామ్‌ భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతికి సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.

Updated Date - 2023-04-05T03:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising