‘పది’కి పక్కా ప్రణాళిక
ABN, First Publish Date - 2023-02-25T00:24:40+05:30
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా పదిలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తుంది.
ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణ
వంద శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి
ప్రతీ రోజు ప్రత్యేక పరీక్షలు
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
సీనియర్ టీచర్లచే ప్రత్యేక మెటీరియల్ తయారీ
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా పదిలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తుంది. డీఈవో నిరంతర పర్యవేక్షణలో ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి అవసరమైన మెటీరియల్ అందించడం, సందేహాలను నివృత్తిచేయడంతోపాటు స్నాక్స్ కూడా అందిస్తున్నారు. చదువులో వెనుక బడిన వారిని గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 24 : పాఠశాల విద్యార్థులకు తరగతి తొలిమెట్టు. పదిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి గ్రూపులుగా విభజించి చదివిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 31 వరకు పదో తరగతి సెలబ్‌సను పూర్తి చేశారు. జనవరి నుంచి రివిజన్ ప్రారంభించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీ నుంచి రెండో ప్రాక్టీసు టెస్టు పెట్టేందుకు సన్నద్ధం చేస్తున్నారు. మొదటి టెస్టులో మిగిలిపోయిన 28 శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గత ఏడాది ‘పది’లో 90.04శాతం రిజల్ట్ రాగా ఈసారి 100శాతం తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా మెటీరియల్‌ను అందిస్తున్నారు. 1,326 పాఠశాలల్లో ఈ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాలతో డీఈవో సుశీందర్‌రావు సీనియర్ ఉపాధ్యాయులచే ఈ మెటీరియల్‌ను తయారు చేయించారు. ప్రస్తుతం 2,500 కాపీలను అందజేశారు. దీంతోపాటు ప్రభుత్వం కూడా ఈ సారి పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ బుక్‌లెట్‌ను తయారు చేయించింది. ఇందులో నాలుగు ప్రత్యేక పుస్తకాలున్నాయి. ఈ ప్రత్యేక బుక్‌లెట్‌ను మరో రెండు రోజుల్లో విద్యార్థులకు అందజేసేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ పుస్తకాలు గోదాంకు చేరుకున్నాయి. ప్రత్యేక తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు సాయంత్రం వేళలో స్నాక్స్ అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకూ రూ.15 ఖర్చు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు విద్యార్థులకు ఇచ్చే ఈ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.71.36 లక్షలు ఖర్చుపెడుతోంది. మధ్యాహ్నం భోజనం కూడా మరింత పౌష్టికత ఉండేలా చూస్తున్నారు.
వెనుకబడి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ఉంచి శిక్షణ ఇస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం గంట ప్రత్యేక తరగుతులు నిర్వహిస్తున్నారు. వీరి కోసం ప్రీ ఫైనల్-2 మార్చిలో రెండు వారాల పాటు నిర్వహించేలా ప్రణాళిక తయారు చేశారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం
గత ఏడాది 98 శాతం ఉత్తీర్ణత సాధించాం. ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి సబ్జెక్టుల బోధన పూర్తయింది. అనంతరం ప్రత్యేక తరగతులు ప్రారంభించాము. ఉదయం, సాయంత్రం కలిపి రోజుకూ అదనంగా రెండు గంటలు ప్రత్యేక బోధన చేస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. బాగా చదివే ఒక్కో విద్యార్థికి ముగ్గురి విద్యార్థులను అప్పగించి ప్రిపరేషన్ చేపిస్తున్నాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. ఉదయం లేవగానే పిల్లలను చదివించాలని కోరుతున్నాం. పిల్లలకు సాయంత్రం వేళల్లో అల్పాహారం ఇస్తున్నాం.
- సి. రాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఊరెళ్ల
అర్థమయ్యేలా చెబుతున్నారు
నేను మ్యాథ్స్‌లో కొంచెం వీక్. అయినప్పటికీ మాథ్స్ చెప్పే సార్ ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు. బోర్డుపై లెక్కలు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహిస్తున్నారు. మాథ్స్‌తో పాటు ఇంగ్లీష్, సైన్స్ కూడా బాగా అర్థమవుతుంది. సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు. పద తరగతిలో 10/10 గ్రేడ్ సాధించేలా కష్టపడుతున్నాను.
- నీరుడు వంశీ, 10వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్ లింగంపల్లి, మంచాల మండలం
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
టెన్త్‌లో ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 10/10 జీపీఏ సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల జ్ఞాపక శక్తి అంచనా వేసేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఉపాధ్యాయులు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. ప్రతీ రోజు పిల్లలను బడికి పంపాలి. సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి.
- సుశీందర్‌రావు, డీఈవో
ఐదేళ్లుగా 10వ తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతం
సంవత్సరం విద్యార్థుల విద్యార్థుల ఉత్తీర్ణత
హాజరు ఉత్తీర్ణత శాతం
2016 90607 74360 82.09
2017 42706 36164 84.68
2018 43392 37809 87.13
2019 45747 42467 92.83
2022 47157 42460 90.04
Updated Date - 2023-02-25T00:24:42+05:30 IST