ఎండుతున్న పంటలు
ABN, First Publish Date - 2023-08-19T00:10:01+05:30
ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణానికి మించే వర్షపాతం నమోదైనప్పటికి వారం పది రోజులు ఏకధాటిగా పడి మళ్లీ వర్షాలు కురియడం లేదు.
ముఖం చాటేసిన వరుణుడు
జూలైలో అధిక వర్షం.. ఆగస్టులో జాడలేని వానలు
విచిత్ర ‘కాలం’తో అన్నదాతల ఆందోళన
బోర్లు ఉన్న రైతులు తడులతో మొక్కల రక్షణ
పరిగి, ఆగస్టు 18: ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణానికి మించే వర్షపాతం నమోదైనప్పటికి వారం పది రోజులు ఏకధాటిగా పడి మళ్లీ వర్షాలు కురియడం లేదు. దీంతో చేలు ఎండుతున్నాయి. తలజుట్టుకు వచ్చిన మొక్కజొన్న, పత్తి మొక్కలు వాడుజూపుతున్నాయి. ఇతర పంటలూ నీరు లేక ఎండుముఖం చూపుతున్నాయి. వానలు రాక రైతుల్లో కలవరం మొదలైంది. జూలైలో రెండు వారాల పాటు కురిసిన వానలతో మొలకలు నీరుపట్టి దెబ్బతిన్నాయి. వానలు ఆగిన తర్వాత రైతులు మొలకలకు కలుపు, తీసి ఎరువులు వేశారు. 15రోజుల నుంచి వర్షాలు కురియడం లేదు. ఎండ తీవ్రత సైతం బాగానే ఉంటుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. రేగడి భూముల్లో పదన ఉండి పంటలు కాస్త బాగానే ఉన్నా.. చెలకల్లో వేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వాడుచూపుతున్నాయి. జూలైలో వర్షాలు పడినా ఆగస్టులో చినుకే రాలేదు. జిల్లాలో 5.8లక్షల సాధారణ సాగుకుగాను 5.4లక్షల ఎకరాల్లో పంటలేశారు. 2లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో మొక్కజ్నొ వేశారు. జూలై వానకుల కొన్ని చెరువు కుంటల్లోని నీరొచ్చినా మెట్ట పంటలకు వాననీరే ఆధారం. కనీసం వారం పది రోజులకైనా ఒక వాన పడితేనే ఈ పంటలు గట్టెక్కుతాయి. 20రోజులుగా వర్షాలు కురియడం లేదు. ఎండుతున్న పంటలతో ఆందోళన చెందుతున్న రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. రేగడి భూముల్లో పదన ఎక్కువ రోజులు ఉంటుంది. దీంతో పంటలు తట్టుకుంటాయి. కానీ చెలక, దుబ్బ నేలల్లో పదన లేక మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలు ఎండుతున్నాయి. కులకచర్ల, దోమ, చౌడాపూర్, పరిగి, బొంరాసిపేట్, దౌల్తాబాద్, కొడంగల్, దుద్యాల్, యాలాల్ మండలాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. దోమ మండలం బాసుపల్లి, బొంపల్లి, గొడుగోనిపల్లి, మోత్కూర్, మైలారం, కులకచర్ల మండలం ముజాహిద్‌పూర్, కామునిపల్లి, అంతారం, పుట్టపహాడ్, తీర్మాలాపూర్ గ్రామాల్లో పంటలెండుతున్నాయి. 40వేల ఎకరాల్లో మొక్కజొన్న, 50వేల ఎకరాల్లో పత్తి చేలు వాడుతున్నాయి. వర్షం కురిస్తే ఇప్పుడు ఎరువులు వేయాల్సి ఉంది. మరో వారంలోగా వానలు కురవకుంటే మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం వాటిల్లే ఆస్కారం ఉందని రైతులు అంటున్నారు.
ఊరిస్తున్న మేఘాలు
ఎండలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం మొదట్లో వర్షాలు మురిపించి ఇప్పుడు ఏడిపిస్తున్నట్టుగా కాలం ఉంది. వానల్లేక ఎండుతున్న పంటలను చూసి ఏం తోచని స్థితిలో రైతులున్నారు. జూన్, జూలై నెలల్లో ఆరుతడి పంటలు వేసుకున్నారు. వరి వేసే వానలైతే పడనే లేదు. ఆగస్టు మొదటి నుంచీ వర్షాలు కురియడం లేదు. మేఘాలు వచ్చి మాయమైతున్నాయి తప్పితే వర్షించడం లేదు. జిల్లాలో సాగునీటి వనరులు పెద్దగా లేవు. ఎక్కువగా బోర్లపై సాగు చేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే పంటలు గట్టెక్కే పరిస్థితి నెలకొంది.
మొక్కజొన్న ఎండిపోతున్నది : మల్లయ్య, రైతు, దోమ
జూలైలో భారీ వర్షాలు మురిపించాయి. పంటల సాగుకు వేలాది రూపాయల అప్పు చేసి మొక్కజొన్న పంటలను సాగు చేశాను. అయితే అధిక వర్షాలకు చేలల్లో జాలు పట్టింది. వానలు తగ్గి మొలకలు కోలుకుంటున్న తరుణంలో 16రోజుల నుంచి వర్షం జాడే లేదు. మొక్కజొన్న చేను ఎండుతోంది. రెండు, మూడు రోజుల వరకైనా వాన కురిస్తే మొలకలు బతుకుతాయి. ఆలస్యం అయితే మాత్రం పంటపై ఆశలు వదులుకోవాల్సిందే.
పంట నష్టపరిహారం చెల్లించాలి : లింగం, కౌలురైతు, సయ్యద్ మల్కాపూర్, పరిగి మండలం
అతివృష్టి, అనావృష్టిలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహరం చెల్లించాలి. నేను 40ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాను. మొన్నటి భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత బతికిన మొలకల్లో కలుపుతీయించాను. ఇప్పుడు వర్షం లేక, ఎండలతో ఉన్న మొలకలు ఎండిపోతున్నాయి. నష్టాలతో ఇప్పటికే కోలుకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఎకరానికి రూ.20వేల చొప్పున పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
Updated Date - 2023-08-19T00:10:01+05:30 IST