కూరలు కుతకుత!
ABN, First Publish Date - 2023-03-23T23:55:32+05:30
కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పంటన్నీ దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది. కూరగాయ ధరలు భగ్గుమంటున్నాయి.
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలు
టమాటకు మచ్చలు.. రంగు మారిన ఆకు కూరలు
మార్కెట్‌లో కొనడానికి ముందుకు రాని వ్యాపారులు
సెంచరీ కొట్టిన మునక్కాయ
ధరల పెరుదలతో మధ్య తరగతి జనం బెంబేలు
ఇటీవల కురిసిన వర్షాలు, వడగళ్లు అటు రైతన్నను దెబ్బతీశాయి. పంటలన్నీ దెబ్బతిన్నాయి. ప్రధానంగా కూరగాయల పంటలు భారీగా ధ్వంసమయ్యాయి. దీంతో దిగుబడి భారీగా తగ్గింది. ఆ ప్రభావం ఇప్పుడు వినియోగదారులపై పడింది. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, మార్చి 23 : కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పంటన్నీ దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోయింది. కూరగాయ ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని కూరగాయల ధరలు మండి పోతున్నాయి. రేట్లు చూసి ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు’ లేదు అని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సామాన్యుడు ఏ కూరగాయ కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు ఆకాశానికి నిచ్చెన వేశాయి. మునగకాయ కిలో సెంచరీ కొట్టింది. చిక్కుడు, బీన్స్, బీర, బెండ, గోకర, కాకర ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. మిగతా ఏవి కొనాలన్న తక్కువలో తక్కువ రూ.40 వెచ్చించాల్సిన పరిస్థితి సేర్పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దీంతో మార్కెట్‌కు సరఫరా తగ్గింది. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు సరిపడా కూరగాయలు వెళ్లేవి. కానీ, ఇప్పుడు ఈ జిల్లాల్లో పంటలన్నీ దెబ్బతినడంతో ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. వడగళ్ల వర్షానికి టమాటకు మచ్చలు ఏర్పడ్డాయి. కొత్తిమీర, తోటకూర రంగు మారింది. మార్కెట్‌కు తరలించినా వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి కూరగాయలకు ధర మాత్రం భారీగా పెంచారు. పొన్నగంటి కూర, పుంటికూర, బచ్చలికూర, పాయిలికూర చిక్కుడు కాయ మార్కెట్‌కు అసలు రావడమే లేదు.
ధరలు భగ్గుమంటున్నాయి : బి.మల్లమ్మ, గృహిణి, షాద్‌నగర్
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనబోయినా కిలో రూ.40 నుంచి 80 చెబుతున్నారు. పావుకిలో కొందామంటే వ్యాపారులు ఇవ్వడం లేదు. కనీసం అరకిలో తీసుకుంటేనే ఇస్తున్నారు. రేట్లు తగ్గించమంటే మార్కెట్‌ల్లో మాకే పడలేదు.. మీకెలా ఇచ్చేదంటున్నారు. ప్రస్తుతం తక్కువ ధర ఉన్న కూరగాయలను కొనాల్సి వస్తుంది.
రూ.500 పెట్టినా సంచి నిండడం లేదు : విజయలక్ష్మి, గృహిణి, కేశంపేట
గతంలో 100 రూపాయలు పట్టుకుని మార్కెట్‌కి వస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా నిండటం లేదు. ప్రతీ ఏటా అతివృష్టి, అనావృష్టి రావడం పంటలు దెబ్బతినడం, రైతులు నష్టపోవడం, కూరగాయల దిగుమతి లేక ధరలు పెరగడం జరుగుతుంది. సామాన్యులు ఏమి కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Updated Date - 2023-03-23T23:55:32+05:30 IST