టీఏ, డీఏలకు ఎగనామం!
ABN, First Publish Date - 2023-07-07T00:14:01+05:30
జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారిపై గడిచిన ఏడేళ్లుగా టీఏ, డీఏల భారం పడుతోంది.
అంగన్‌వాడీలకు రూ.4.03 కోట్ల్లకు పైగానే బకాయిలు
ఏడేళ్లుగా వాటికోసం తప్పని ఎదురుచూపు
సొంత జీతంతో నెట్టుకొస్తున్న కార్యకర్తలు
బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
అసలే అదనపు బాధ్యతలు, పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న అంగన్‌వాడీ సిబ్బందికి ప్రభుత్వం టీఏ, డీఏలను కూడా చెల్లించడం లేదు. ఇది ఏడాదో.. రెండేళ్ల నుంచో కాదు. ఏడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. దీంతో వారు సొంత డబ్బులతో మీటింగులకు వెళ్లాల్సి వస్తోంది. చివరకు ప్రభుత్వం అసలు ఆ డబ్బులు ఇస్తుందా.. లేదా అని అంగన్‌వాడీ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్/షాద్‌నగర్ రూరల్, జూలై 6: జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారిపై గడిచిన ఏడేళ్లుగా టీఏ, డీఏల భారం పడుతోంది. ఎప్పుడో 2017లో చివరి సారిగా వాటిని చెల్లించారు. అప్పటి నుంచి నేటి వరకు వాటి ఊసే లేకుండా పోయింది. దీంతో ప్రతి ఉద్యోగిపై ప్రతినెలా రూ.500 పై చిలుకు భారం పడుతోంది. ఈ భారం మోయలేమని పదే పదే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా.. ఇదిగో.. అదిగో అంటూ నెట్టుకొస్తున్నారే తప్ప ఫలితం లేదు. గడిచిన ఏడేళ్లలో బడ్జెట్ కూడా దీనికి కేటాయించకపోవడంతో వీరు మరింత ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఏడేళ్లకు సంబంధించి సుమారు రూ.4.03 కోట్లకు పైగానే పెండింగ్‌లో ఉన్నాయి. టీఏ, డీఏల కోసం అంగన్‌వాడీలకు నిరీక్షణ తప్పటం లేదు. ఇంతలో టీఏ, డీఏలు చెల్లింపులు జరిగానే అనే విషయం అనుమానంగా మారింది. జిల్లాలో 27 మండలాల్లో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,600 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరు లాక్‌డౌన్ సమయంలోనూ విశేష సేవలు అందించారు. ప్రతినెలా సెక్టార్ మీటింగ్, ప్రాజెక్ట్ మీటింగ్ ఉంటుంది. వాటికి వీరు విధిగా హాజరవ్వాలి. సీడీపీవోలు, ప్రాజెక్టు ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు అందజేస్తారు. నెలకు టీఏ, డీఏలు కలిపి రూ.300 అందజేస్తారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుకు దూరంగా ఉన్న సెంటర్ వాళ్లకు రూ.450 వరకు చెల్లిస్తారు. టీఏ, డీఏలు నెలకు రెండు మీటింగ్‌లకే చెల్లిస్తారు. ఒక్కో నెలలో మీటింగ్‌ల సంఖ్య అంతకంటే ఎక్కువే జరుగుతాయి. అయినా, రెండు సమావేశాలకు మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. మిగతా వాటికి అంగన్‌వాడీ సిబ్బంది తమ చేతినుంచి డబ్బులు పెట్టుకొని వెళ్లాల్సిందే. అయితే, ఏడేళ్లుగా ఆ రెండు సమావేశాలకు కూడా చెల్లించడం లేదు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చే 13,650 రూపాయల జీతంలోనే ఈ ఖర్చులు కూడా చూసుకోవాల్సి వస్తోంది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7,800 మాత్రమే జీతం ఇస్తున్నారు. వీరికిచ్చే ఈ నామమాత్రపు జీతంలో మీటింగులకు కూడా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే కూరగాయలు, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లకు చెల్లింపులు వచ్చిన జీతం డబ్బుల్లో నుంచే ఖర్చు పెట్టుకోవాలి. బిల్లులు పెట్టుకుంటే.. ఆరు నెలల వరకు తీరిగ్గా చెల్లిస్తారని అంగన్‌వాడీ సిబ్బంది వాపోతున్నారు. దీంతో తమ కుటుంబ పోషణకు తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఏ, డీఏలను వెంటనే చెల్లించాలి : రాజ్యలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
అంగన్‌వాడీలకు 2017 నుంచి టీఏ, డీఏ రావడం లేదు. పెండింగ్‌లో పెట్టిన టీఏ, డీఏలను వెంటనే చెల్లించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలి. గతంలో రేషన్ షాపుల నుంచి అంగన్‌వాడీలు కేంద్రాలకు బియ్యం సరఫరా చేసుకున్నారు. మూడేళ్ల పాటు వారికి రవాణా చార్జీలు కూడా ఇవ్వలేదు. ఇవి కూడా వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచింది కానీ.. మూడు నెలలకు సంబంధించిన ఏరియర్స్ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు, ఆయాలకు గ్రాడ్యుటీ రావాల్సి ఉంది. జిల్లాలోని కేంద్రాల్లో డబుల్ గ్యాస్ సిలిండర్లు లేవు. గర్భిణీలకు సీమంతాలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే రూ. 250 సరిపోవడం లేదు. ఇవి పెంచాలి. 2018లో కేంద్రం రూ.1500, ఆయాలకు 750, మినీ టీచర్లకు 1,250 గౌరవ వేతనం పెంచింది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంగన్‌వాడీలకు పీఎఫ్, ఈఎ్‌సఐ సౌకర్యం కల్పించాలి.
టీఏ, డీఏల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం : పానుగంటి పర్వతాలు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు ఏడేళ్లుగా టీఏ, డీఏలు చెల్లించడం లేదు. జీతాలు పెంచామని ఓ వైపు చెబుతూనే మరోవైపు ఇలా టీఏ, డీఏలకు ఎసరు పెట్టింది. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లకు రావాల్సిన టీఏ, డీఏలతో పాటు ఇతర అలవెన్సులను వెంటనే ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాల్సి వస్తుంది.
Updated Date - 2023-07-07T00:14:01+05:30 IST