కల్యాణం.. కమనీయం
ABN, First Publish Date - 2023-03-30T23:44:54+05:30
శ్రీరామ నవమి వేడుకలను గురువారం కనుల పండువగా నిర్వహించారు.
కనుల పండువగా రాములోరి కల్యాణోత్సవం
పలు చోట్ల పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
ఘట్‌కేసర్/కీసర రూరల్/మేడ్చల్ టౌన్, మార్చి 30: శ్రీరామ నవమి వేడుకలను గురువారం కనుల పండువగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలుచోట్ల కల్యాణోత్సవాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్, పోచారం, మున్సిపాలిటీల్లో, చౌదరిగూడలో సీతారాములు కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడలో, పోచారం మున్సిపాలిటీ నారపల్లి, అన్నోజిగూడ, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడ, మున్సిపల్ కార్యాలయం వద్ద కల్యాణోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగారం పరిధి ఎస్వీనగర్, సత్యనారాయణ కాలనీ, రాంపల్లి, దమ్మాయిగూడ ఆంజనేయస్వామి ఆలయం, ప్రజయ్ సాయి గార్డెన్‌లోని త్రిమూర్త్యాత్మక ఆలయంలో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన వడపప్పు, పానకాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఎస్వీనగర్, సత్యనారాయణ కాలనీల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కె.చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ మల్లేష్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మేడ్చల్‌లో సీతారాముల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్విహించారు. రామలింగేశ్వరాలయంలో, అత్వెల్లి, రైల్వే స్టేషన్ ఆలయాల్లో, వార్డుల్లో సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. గుండ్లపోచంపల్లిలో అక్కన్న మాదన్నల కాలం నాటి లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో లావణ్య-మల్లికార్జున్ దంపతులు నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయన తనయుడు మహేందర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
వాడవాడలా సీతారాముల పరిణయోత్సవాలు
వికారాబాద్: సీతారాముల కల్యాణోత్సవాన్ని వికారాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వికారాబాద్‌లోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో, శివారెడ్డిపేటలోని మల్లికార్జునాలయంలో ఉదయం స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. శివారెడ్డిపేటలో మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులరమేష్ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. వికారాబాద్ రామ్ మందిర్‌లో నిర్వహించిన కల్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
Updated Date - 2023-03-30T23:44:54+05:30 IST