‘మన ఊరు - మన బడి’ పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2023-02-24T23:27:33+05:30
మన ఊరు - మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీష్
రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 24 : మన ఊరు - మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి ‘మన ఊరు-మనబడి, దళిత బంధు, పోషణ అభియాన్’ కార్యకమ్రాల అమలుతీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలు, మరుగుదొడ్లు, కలర్స్, డైనింగ్‌హాల్, గార్డెనింగ్, విద్యుత్ తదితర 12 రకాల పనులను చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 464 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. చాలావరకు పాఠశాలల్లో పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా జిల్లాలో 697 యూనిట్లకు 697 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. గ్రౌండింగ్ అయిన యూనిట్లను సంబంధిత మండల అభివృద్ధి అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందించినట్లు తెలిపారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బరువు, ఎత్తు కొలతలు తీసుకొని పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి మోతి పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’లో 2,60,087 మందికి పరీక్షలు
జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 2,60,087 మందికి పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ హరీష్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ స్పెల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, 58,59,76 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్ ఫామ్ సాగుపై జిల్లా అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 45,876 మందికి రీడింగ్ కంటి అద్దాలు అందించినట్లు చెప్పారు. 39,877 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేయాల్సి ఉండగా.. 5,439మందికి అందించినట్లు చెప్పారు. జిల్లాలో మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున 58,59,76 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయాల్సిన క్రమబద్దీకరణ వాయిదా వేసినట్లు సీఎ్‌సకు తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం 8,979 దరఖాస్తులు అందాయని, ఇందులో 3,086 మంది అర్హత కలిగి ఉన్నారని, 2,341 డబుల్ బెడ్‌రూమ్స్ పూర్తయి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా హౌసింగ్‌శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రామేశ్వరి దేవి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-24T23:27:34+05:30 IST