నరకయాతన!
ABN, First Publish Date - 2023-03-30T23:48:20+05:30
నగర శివారు మొయినాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ జాం
కూడళ్ల వద్ద పనిచేయని సిగ్నళ్లు
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
మొయినాబాద్ రూరల్, మార్చి 30 : నగర శివారు మొయినాబాద్ ప్రాంతంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ఈ రహదారిపై ప్రతీ గంటకు కనీసంగా వేయి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శని, ఆదివారాల్లో మాత్రం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చే భక్తుల కారణంగా రోడ్డు తీవ్ర రద్దీగా ఉంటుంది. ప్రధానంగా అజీజ్‌నగర్ చౌరస్తా, హిమాయత్ నగర్ చౌరస్తా, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన ద్వారం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చౌరస్తాల వద్ద ఉన్న దుకాణాలు, హోటళ్ల ఎదుట వాహనాలను నిలుపుతుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అంతే కాకుండా పాత అజీజ్ నగర్ చౌరస్తా నుంచి మొయినాబాద్ వరకు చిన్న చిన్న తినుబండారాల బండ్లు రోడ్డుకు పక్కనే ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. శని, ఆదివారాల్లో పరిస్థితి వర్ణణాతీతం. వివిధ పనుల కోసం నగరానికి వెళ్లే వారితోపాటు ఇటు వైపు వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు. ఉదయం సాయంత్రం గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి.
పనిచేయని సిగ్నల్
ఏడాది క్రితం మొయినాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. పోలీసులకు చాలాన్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ క్రమబద్దీకరణపై లేదని వాహనదారులు వాపోతున్నారు. గండిపేట చౌరస్తా, అజీజ్ నగర్, హిమాయత్ నగర్, ఆమ్డాపూర్ చౌరస్తాల వద్ద విద్యార్థులు, ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో వీరంతా బస్సుల కోసం రోడ్డుపైనే నిల్చోవాల్సి వస్తోంది. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మొయినాబాద్ మండల కేంద్రం వరకు రహదారి విభాగినుల మధ్య రూ. 2 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. కానీ అవి రాత్రి వేళలో సరిగ్గా వెలగడం లేదు. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వీటి నిర్వహణ ఎవరి పరిధిలోకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
వెలగని వీధి దీపాలు
తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మొయినాబాద్ మండల కేంద్రం వరకు దాదాపు రూ. 2కోట్లతో ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదు. కనీసం వీటి నిర్వహణ బాధ్యత ఎవరి పరిధిలోకి వస్తుందో కూడా స్పష్టత లేదు. శని, ఆదివారాల్లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి అజీజ్‌నగర్ చౌరస్తా మొదలు, ఎన్కేపల్లి చౌరస్తా, హిమాయత్ నగర్ చౌరస్తా, జేబీఐఈటీ చౌరస్తాల వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుంది. గంటల తరబడి వాహనలు నిలిచిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలిగే విధంగా చూడాలి.
- ఎల్గని నరేష్‌గౌడ్, హిమాయత్ నగర్
Updated Date - 2023-03-30T23:48:20+05:30 IST