వారధి ప్రారంభం ఎప్పుడో?
ABN, First Publish Date - 2023-01-12T23:52:56+05:30
ప్రజలకు దూరభారం తగ్గించి.. వారి గమ్యస్థానాలకు చేర్చందుకు వీలుగా జీవన్గి వద్ద కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి అలంకారప్రాయంగా మారింది.
కాగ్నా నదిపై జీవన్గి వద్ద వంతెన పూర్తయి మూడేళ్లు
ఇరు వైపులా అప్రోచ్ రోడ్డు వేయక నిరుపయోగం
రూ.6.36కోట్లు ఖర్చు చేసినా ఫలిత శూన్యం
భూ సేకరణకు చర్యలు తీసుకోని ప్రభుత్వం
20 గ్రామాల ప్రజలు తాండూరు వెళ్లేందుకు, దూరభారం తగ్గించేందుకు గాను కాగ్నా నదిపై జీవన్గి వద్ద వంతెన నిర్మించి మూడేళ్లవుతున్నా ఇంకా వినియోగంలోకి రాలేదు. కేవలం నాలుగైదు కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్డు వేయని కారణంగానే కోట్లు వెచ్చించి కట్టిన బ్రిడ్జి వినియోగంలోకి తేవడం లేదు. రైతులు నది ఒడ్డునున్న పొలాలకు వెళ్లాలన్నా, ప్రయాణికులు ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు రావాలన్నా నదిలోకి దిగాల్సి వస్తోంది. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయాల్లో చుట్టూ తిరిగి వెళ్తున్నారు. దూర భారం తగ్గించేందుకు, రైతులకు సౌకర్యం కోసం నిర్మించిన బ్రిడ్జికి వెంటనే అప్రోచ్ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
బషీరాబాద్, జనవరి 12: ప్రజలకు దూరభారం తగ్గించి.. వారి గమ్యస్థానాలకు చేర్చందుకు వీలుగా జీవన్గి వద్ద కాగ్నా నదిపై నిర్మించిన బ్రిడ్జి అలంకారప్రాయంగా మారింది. బ్రిడ్జి నిర్మించి మూడేళ్లయినా ఇరువైపులా భూసేకరణ చేయక అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో వారధి వాడకంలోకి రాలేదు. వంతెన నిర్మాణానికి రూ.6.36కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఫలితం లేకుండా పోయింది. బ్రిడ్జి కట్టినా వినియోగంలోకి రాక 20 గ్రామాల ప్రజలకు దూరభారం వ్యయప్రయాస తప్పడం లేదు. అలాగే రైతులకు నది ఆటువైపు పొలాలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రయాణికులు, రైతుల సౌకర్యార్థం వంతెన నిర్మాణం
జీవన్గి-కరణ్‌కోట్ మీదుగా తాండూరు వెళ్లాలంటే కాగ్నా నది దాటాలి. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జీవన్గి వద్ద కాగ్నా నదిపై ప్రభుత్వం రూ.6.36కోట్లతో బ్రిడ్జి నిర్మించింది. కాంట్రాక్టర్ వేగంగా వంతెన నిర్మాణాన్ని పూర్తిచేశారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల కోసం రూ.2.38కోట్ల నిధులు ఉన్నాయి. వంతెన నిర్మాణం పూర్తయి మూడేళ్లయినా ప్రభుత్వం ఇంకా వినియోగంలోకి తేలేదు. బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూమి సేకరించాల్సి ఉండగా దీనిపై అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు. వంతెన నుంచి పాత రోడ్లకు కలపాలంటే ఒక వైపు కిలో మీటరు, మరో వైపు మూడు కిలోమీటర్ల దూరం రోడ్లకు భూసేకరణ చేపట్టాలి. గతంలో అప్రోచ్ రోడ్డుకు భూసేకరణకు ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. ఏ మేరకు భూములు అవసరమనేది గుర్తించి రైతుల వివరాలతో కూడిన నివేదికలు ప్రభుత్వానికి పంపారు. భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోనే పరిహారం అందజేసి అప్రోచ్ రోడ్డు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నా అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ ఆలస్యం కావడంతో నిధులు వెనక్కి వెళ్లాయని మరోవైపు అధికారులే చెబుతున్నారు. కొత్తగా నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామంటున్నారు. అయితే వేగవంతంగా చర్యలు తీసుకొని నిర్మించిన వంతెనను వినియోగంలోకి తేవడం లేదని ప్రజలు అంటున్నారు. ఏ లక్ష్యం కోసమైతే బ్రిడ్జి కట్టారో అది నెరవేరడం లేదు.
రోడ్లకు భూసేకరణ చేయలేదు : జి.మాధవరెడ్డి, రైతు, కాంగ్రెస్ మండల నాయకుడు, జీవన్గి
కాగ్నాపై వంతెన నిర్మించి మూడేళ్లవుతోంది. బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ చేయలేదు. రూ.కోట్లు పెట్టి నిర్మించిన వంతెన నిష్ప్రయోజనంగా మారింది. మేం పొలాలకు వెళ్లేందుకు వంతెన ఎక్కి దిగేందుకు తాత్కాలిక రోడ్డు వేసుకున్నాం. ఇంత బాగా బ్రిడ్జి కట్టించిన ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు వేయడం లేదు. బ్రిడ్జిపై వాహనాలు, ప్రయాణికులు వెళ్లేలా సౌకర్యం కల్పిస్తేనే తాండూరుకు దూరభారం తగ్గుతుంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అప్రోచ్ రోడ్డును వేయిస్తానని చెప్పినా పనులు మొదలు కాలేదు.
Updated Date - 2023-01-12T23:52:58+05:30 IST