వరిసాగు ఉల్టా పల్టా!
ABN, First Publish Date - 2023-07-09T02:15:24+05:30
ఏటికేడు పెరుగుతూ వస్తున్న వరి విస్తీర్ణానికి ఈసారి బ్రేక్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలహీనంగా ఉండటం
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఏటికేడు పెరుగుతూ వస్తున్న వరి విస్తీర్ణానికి ఈసారి బ్రేక్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలహీనంగా ఉండటం, ఐదు వారాలు గడిచినా వర్షాలు సరిపడా కురియకపోవటంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడాల్సి ఉండగా 1.40 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. అయితే పోసిన నార్లకు నీళ్లు లేకపోవటం, బురద దుక్కులు సిద్ధంచేయటానికి నీటి వసతి లేకపోవటంతో రైతులు వరిసాగుకు వెనకడుగేస్తున్నారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన విషయం విదితమే! వానాకాలం, యాసంగి.. రెండు సీజన్లలో కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. ఇక వానాకాలం విషయానికి వస్తే, 2020-21 లో 53.34 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2021-22 లో 61.95 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 2022-23 లో 64.55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఈసారి కూడా 65 లక్షల ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో రైతులు వరి సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ వాతావరణం అనుకూలించకపోవటం, వరుణుడు కరుణించకపోవటంతో అంతా ఉల్టాపల్టా అయింది. సాధారణంగా జూన్ మొదటి, రెండో వారాల్లో నార్లు పోసే రైతులు... ఈసారి నిర్ణీత షెడ్యూలు ప్రకారం వరినార్లు పోయలేకపోయారు. ఎంత నీటి వసతి ఉన్నప్పటికీ... వర్షాలు పడకపోతే ఆ నార్లు కూడా ఆరోగ్యంగా పెరిగే పరిస్థిఽతి ఉండదు. ఇప్పుడలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పోసిన నార్లు కూడా ఎదగటంలేదు. నాట్లు వేసేందుకు రైతులు ఆసక్తి చూపటంలేదు. బోరుబావుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్న రైతులే వరి నాట్లు వేస్తున్నారు. నిజామాబాద్‌లో 55 వేల ఎకరాలు, కామారెడ్డి లో 17 వేల ఎకరాలు, నారాయణపేటలో 35 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో 10 వేల ఎకరాలు, నల్లగొండలో 7 వేల ఎకరాలు, ఖమ్మంలో 5 వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 వేల ఎకరాలు, వికారాబాద్‌లో 7 వేల ఎకరాలు, కరీంనగర్‌లో 5 వేల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 7 వేలు, వనపర్తిలో 5 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. అంతాకలిపి కేవలం 1.40 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లువేశారు. నిరుడు ఈ సమయానికి కేవలం 86 వేల ఎకరాల్లోనే వరి నాట్లు పడ్డాయి. ఈసారి జూలై మొదటివారం ముగిసేసరికి నిరుటి కంటే 54 వేల ఎకరాల్లో ఎక్కువగానే నాట్లు వేశారు. కానీ సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంది. 50 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో... ఇప్పటివరకు 2 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉండగా... 60 వేల ఎకరాలు తక్కువగా నాట్లు పడ్డాయి. దీంతో వరి సాగు చేయటానికి రైతులు వెనకాముందు ఆలోచిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
65 లక్షల ఎకరాలు దాటేనా?
వరి సాగు విస్తీర్ణం వానాకాలంలో 65 లక్షల చేరువకు వచ్చేసింది. ఈసారి అంతకంటే ఎక్కువే సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం... 50 లక్షల ఎకరాలు కూడా దాటుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐదు వారాల మేర వానాకాలం సీజన్ ముగియటంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జూలైలో వర్షాలు పడకపోతే సాగులెక్కలన్నీ తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుటికిప్పుడు వర్షాలు పడినా... దీర్ఘకాలిక రకాలు సాగుచేయటం శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. స్వల్పకాలిక రకాలతోపాటు వెదజల్లే పద్ధతి కూడా మేలు చేస్తుందని, పంట కాలవ్యవధి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ కాలం కలిసిరాకపోతే.. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వరి విస్తీర్ణం అసాధారణ స్థాయిలో పెరగటం, ధాన్యం ఉత్పత్తి పెరగటం, ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వద్ద బియ్యం నిల్వలు కూడా దండిగా ఉండటంతో వరి సాగు తగ్గిస్తే మేలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుపై దృష్టిసారించాలనే సూచనలు వస్తున్నాయి.
Updated Date - 2023-07-09T02:15:24+05:30 IST