ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Singareni elections : సింగరేణి ఎన్నికలు మళ్లీ వాయిదా

ABN, First Publish Date - 2023-10-12T04:24:43+05:30

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ..

పెద్దపల్లి/కొత్తగూడెం/భూపాలపల్లి/హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం.. ఆరు జిల్లాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగాల్సి ఉండటం, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 27న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. నవంబరు చివరి నాటికే ఎన్నికల అధికారి అయిన కేంద్ర డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌కు ఓటర్ల జాబితా అందజేయాలని సింగరేణికి స్పష్టం చేసింది. డిసెంబరులో నిర్వహించే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని.. శాంతిభద్రతలను కాపాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ (అండర్‌టేకింగ్‌) హైకోర్టు రికార్డు చేసింది. తాజా ఆదేశాలతో సింగిల్‌ జడ్జి ఆదేశాలను సవరిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వస్తున్నామని, మరోసారి హైకోర్టుకు వచ్చి ఎన్నికలు నిర్వహించలేదని చెప్పవద్దంటూ చురకలు అంటించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సింగరేణి యాజమాన్యం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. ఈ అప్పీల్‌ పిటిషన్‌పై బుధవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగరేణి యాజమాన్యం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు.

మొత్తం ఆరు జిల్లాలు, 13 నియోజకవర్గాల పరిధిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయని, ఇవన్నీ నక్సల్స్‌ ప్రాబల్య ప్రాంతాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలంటే వందలమంది ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఆయా జిల్లాల అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారని.. సింగరేణి ఎన్నికలకు సమయం ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కార్మిక సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. సింగరేణి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారికి ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతినెలా ఎంతమందికి జీతాలు ఇస్తున్నారో డేటా ఉంటుందని, కొత్తగా ఓటర్ల జాబితా తయారుచేసేది ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకోర్టు నిర్ణయించే తేదీన ఎన్నికలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని.. ఈమేరకు ప్రభుత్వం తరఫున అండర్‌టేకింగ్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిర్వహణకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని.. ఇప్పటివరకు ఓటర్ల జాబితా సమర్పించలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రస్తావిస్తూ సింగిల్‌ జడ్జి ఆదేశాల తర్వాత పరిణామాలు మారిపోయాయని అభిప్రాయపడింది. డిసెంబరు 27న ఎన్నికలు నిర్వహించి.. ఫలితాలు వెల్లడించాలని పేర్కొంది.

మొదటి నుంచీ అధికార పార్టీ అయిష్టత

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు వెళ్లేందుకు మొదటి నుంచీ అధికార పార్టీ అయిష్టత చూపుతోంది. 2017లో సింగరేణిలోని 11 ఏరియాల్లో 9 చోట్ల గులాబీ సంఘమే(టీజీబీకేఎస్‌) విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. అయితే, ఏడాది తర్వాత 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ఏరియాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో మూడుచోట్ల మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు వెళ్తే లాభంకంటే నష్టమే ఎక్కువనే అంచనాల్లో ఆ పార్టీ ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, కీలక నేతలు వలస వెళ్లడం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

Updated Date - 2023-10-12T04:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising