Union Budget: దేశ భవిష్యత్‌కు ఆశాజనకంగా ఉంది: స్వదేశీ జాగరణ మంచ్
ABN, First Publish Date - 2023-02-02T20:01:05+05:30
కేంద్ర బడ్జెట్‌ను స్వదేశీ జాగరణ్ మంచ్ స్వాగతించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న 45.03 లక్షల కోట్ల వ్యయంతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్(Union Budget)ను స్వదేశీ జాగరణ్ మంచ్ (Swadeshi Jagarn Manch) స్వాగతించింది. బడ్జెట్ భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, సమ్మిళిత అభివృద్ధిని సూచించే విధంగా ఉందని అభిప్రాయపడింది. కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.8% ఆర్థిక వృద్ధి సాధిస్తుందని 2023 ఆర్థిక సర్వేలో పేర్కొనడం భారత దేశ దృఢమైన ఆర్థిక నిర్మాణానికి చిహ్నమని తెలిపింది. కేంద్ర బడ్జెట్ భారతదేశం వచ్చే 25 సంవత్సరాలలో పయనించే అమృత కాల మార్గానికి పునాదిగా భావించవచ్చని అభిప్రాయపడింది. సమాజంలో విస్మరించబడిన వర్గాలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించిందని, సమతుల్యంగా అలాగే భారత దేశ భవిష్యత్‌కు ఆశాజనకంగా ఉందని స్వదేశీ జాగరణ మంచ్ అభిప్రాయ పడింది. ప్రతిపాదిత బడ్జెట్ అమృత్ కాల వ్యవధిలో యువత సామర్థ్యాన్ని వెలికితీయడం, బలమైన, స్థిరమైన స్థూల-ఆర్థిక మూలాలను కలిగి ఉండడం ద్వారా ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. స్వదేశీ జాగరణ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర సహ సంయోజక్ డాక్టర్ సత్తు లింగమూర్తి పత్రికా ప్రకటన విడుదల చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని నిమ్న-మధ్య ఆదాయ వర్గం మరియు వేతన వర్గాలకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. మూలధన వ్యయాన్ని 13.7 లక్షల కోట్ల వరకు పెంచడాన్ని అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు మొదలైన వాటి విస్తరణ వల్ల దేశం, యువతరం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని లింగమూర్తి అభిప్రాయపడ్డారు.
Updated Date - 2023-02-02T20:01:12+05:30 IST