TRS MLAs poaching case: కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురు
ABN, First Publish Date - 2023-01-02T15:25:20+05:30
బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
హైదరాబాద్: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. సిట్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేయడంతో ఈ కేసులో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చినట్లైంది.
అటు ఈ కేసులో ఇటీవలే హైకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసు సీబీఐకి (CBI) ఇవ్వడానికి 45 అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చింది. సిట్ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కేసులో దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని హైకోర్టు మండిపడింది. కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం కేసీఆర్‌కు చేరవేతపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సిట్ చేసిన దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం ఎఫ్‌ఐఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేసింది.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా సిట్ ఏర్పాటైంది. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్ సభ్యులుగా ఎంపిక చేశారు.
Updated Date - 2023-01-02T16:51:46+05:30 IST