Incident in Hanumakonda district : అత్తను కాల్చిచంపిన కానిస్టేబుల్!
ABN, First Publish Date - 2023-10-13T04:31:48+05:30
తనకు పిల్లనిచ్చిన అత్తను అతి దారుణంగా హత్య చేశాడో పోలీసు కానిస్టేబుల్! తాను పనిచేస్తున్న స్టేషన్‌లోంచి ఎస్సై సర్వీసు రివాల్వర్‌ను దొంగిలించి, దాంతోనే ఆమెను కాల్చి చంపాడు.
స్టేషన్ నుంచి ఎస్సై రివాల్వర్ తస్కరించి.. ఊరెళ్లి హత్య
హనుమకొండ జిల్లాలో ఘటన
ఆర్థిక వ్యవహారాలు.. భార్యతో గొడవలే ఘటనకు కారణం
కోటపల్లి, హన్మకొండ టౌన్, అక్టోబరు 12: తనకు పిల్లనిచ్చిన అత్తను అతి దారుణంగా హత్య చేశాడో పోలీసు కానిస్టేబుల్! తాను పనిచేస్తున్న స్టేషన్‌లోంచి ఎస్సై సర్వీసు రివాల్వర్‌ను దొంగిలించి, దాంతోనే ఆమెను కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అత్తతో డబ్బు పరమైన గొడవలు, భార్యతో మనస్పర్థలే ఈ ఘటనకు కారణం అని భావిస్తున్నారు. నిందితుడు జిల్లాలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అడ్డె ప్రసాద్. హతురాలు హన్మకొండ జిల్లా గుండ్లసింగారం గ్రామానికి అనిగల కమలమ్మ (53). గుండ్లసింగారానికి చెందిన కమలమ్మ-వీరయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరయ్య చాలా కాలం క్రితమే చనిపోయాడు పెద్ద కూతురు రమాదేవిని పాతికేళ్ల క్రితం వరంగల్ జిల్లా గొర్రెకుంటకు చెందిన అడ్డె ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రసాద్-రమాదేవికి ఇద్దరు కూతుళ్లు. ప్రసాద్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కోటపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే గోదావరిఖని నుంచి బదిలీపై వచ్చి పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ప్రసాద్ నుంచి అత్త కమలమ్మ రూ4 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బుకు వడ్డీ కడుతూ వస్తోంది. ఏడాది క్రితం ప్రసాద్-రమాదేవి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని గుండ్లసింగారానికి వచ్చింది. ఆ గ్రామంలో తల్లి కమలమ్మ ఇంటి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటోంది. భార్య రమాదేవితో గొడవల వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు కూతుళ్ళు, భార్యకు ప్రతి నెల ప్రసాద్ కొంత మొత్తం చెల్లిస్తున్నాడు. అయితే అప్పుగా ఇచ్చిన రూ.4 లక్షలను కమలమ్మ తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెతోనూ ప్రసాద్ గొడవ పడుతున్నట్లు తెలిసింది. కమలమ్మ అప్పు తీర్చకపోగా.. భార్య తనకు దూరమయ్యేందుకూ కారణమైందని ఆమెపై కోపం పెంచుకొని హత్య చేయాలనుకున్నాడు.
పథకం ప్రకారం రివాల్వర్ చోరీ..
ఆయుధాలను సర్వీసింగ్ చేసే ఆర్మ్ క్లీనింగ్ టీమ్ బృందం బుధవారం కోటపల్లి పోలీ్‌సస్టేషన్‌కు వచ్చింది. అక్కడి ఆయుధగారంలోని ఆయుధాలను సర్వీసింగ్ చేసి వెళ్లింది. అదేరోజు వారెంటు బుక్ కోసం లోపలికి వెళ్లిన ప్రసాద్, అక్కణ్నుంచి ఎస్సై సర్వీసు రివాల్వర్‌ను దొంగిలించాడు. గురువారం ఉదయం నేరుగా హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉంటున్న అత్త కమలమ్మ ఇంటికి వెళ్లాడు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగిచ్చేయాలని కమలమ్మను ప్రసాద్ అడిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆగ్రహించిన స్థానికులు ప్రసాద్‌ను పట్టుకొని తీవ్రంగా కొట్టారు. పోలీసులు కమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టేషన్ నుంచి సర్వీస్ రివాల్వర్‌ను ప్రసాద్ చోరీ చేసిన ఘటనపైనా విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2023-10-13T04:31:48+05:30 IST