బోగస్ కార్డుల ఏరివేత!
ABN, Publish Date - Dec 20 , 2023 | 11:28 PM
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
రేషన్ తీసుకోని వారి జాబితా గుర్తింపు
కొత్త కార్డుల మంజూరుపై అర్హుల్లో ఆశలు
గతంలో రద్దు చేసిన రేషన్ కార్డుల సంఖ్య 95,040
మేడ్చల్ డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించారు. కార్డు ఉండీ కొన్నేళ్లుగా సరకులు తీసుకోని వారిపై దృష్టి సారించారు. ప్రత్యేక సాప్ట్‌వేర్ సహాయంతో జిల్లాల వారీగా ఇప్పటి వరకు సరుకులు పొందని వారి రేషన్ కార్డుదారులను గుర్తించారు. ఆహారభద్రత కార్డులను ఇబ్బడిముబ్బడిగా ధనవంతులకు కూడా పంపిణీ చేయడంతో సరుకులు తీసుకెళ్లడం లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిని తొలగించడమా..? లేక కొనసాగించడమా..? అనే విషయమై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బోగస్ కార్డుల తొలగింపుతో పాటు కొత్త కార్డులు మంజూరు కానున్నాయి.
మూడేళ్లుగా నిరీక్షణ
మేడ్చల్‌జిల్లాలో మూడేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. ఆహారభద్రత కార్డులు లేకపోవడంతో నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఆరోగ్య శ్రీసేవలు అందక ఆర్ధికంగా నష్టపోతున్నారు. జిల్లాలో 5,06,34 ఆహారభద్రత కార్డులున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీలో ఉచిత వైద ్య సేవలు పొందేందుకు కొందరు ధనవంతులు, అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక సాప్ట్‌వేర్ రూపొందించి ఇప్పటి వరకు రేషన్ సరుకులు తీసుకోని వారిని గుర్తించింది. ప్రతి నెల దాదాపు 15 శాతం మంది సరుకులు తీసుకోవడం లేదు. వీరిలో కొందరు ఒక నెల తీసుకుంటూ మరో నెల వదిలేస్తున్నారు. మరికొందరు ఏళ్ల తరబడి సరుకులు తీసుకెళ్లడం లేదని గుర్తించారు.
గతంలో రద్దు చేసిన రేషన్ కార్డులు
జిల్లాలో గతంలో వివిధ కారణాలతో అధికారులు 95,040 ఆహారభద్రత కార్డులను రద్దు చేశారు. 2016లో ప్రభుత ్వ ఆదేశాల మేరకు అనర్హుల పేరుతో జిల్లాలో 95,040 కార్డులను తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్డులు ఎలా రద్దు చేస్తారని లబ్దిదారులు కోర్టును ఆశ్రయించడంతో కోర్డు ఆదేశాలతో ప్రభుత్వం కార్డులను పున:పరిశీలించి రద్దు చేసిన కార్డుల్లో 983 మందిరి అర్హులుగా గుర్తిస్తూ కార్డులు జారీ చేశారు. రద్దయిన కార్డులను తిరిగి కొనసాగిస్తారా..? లేక కొత్త కార్డుల కోసం వేరే మార్గదర్శకాలను రూపొందిస్తారా..? అనేది వేచిచూడాలి.
దరఖాస్తులపై అందని మార్గదర్శకాలు
రాష్ట్రంలో కొత ్త ప్రభుత్వం ఏర్పాటుతో ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీల్లో మరికొన్నింటిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని భావిస్తుండగా గతంలో చేసిన దరఖాస్తులు పని చేస్తాయా..? లేదా కొత్తగా ఆర్జీ పెట్టుకోవాలా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు.
Updated Date - Dec 20 , 2023 | 11:28 PM