గర్భిణిని నరికి చంపిన తండ్రి, తమ్ముళ్లు!
ABN, First Publish Date - 2023-11-11T04:02:32+05:30
అతడికి ఆమె కన్న కూతురు! ఐదు నెలల గర్భిణి! ఆస్తి తగాదాలతో అప్యాయత, అనురాగాలన్నీ మరిచి గొడ్డలి, కొడవలితో కూతురుపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు
ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడి
ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
ఆస్తి తగాదాలే కారణం
ఖమ్మం జిల్లా వైరాలో ఘోరం
వైరా, నవంబరు 10: అతడికి ఆమె కన్న కూతురు! ఐదు నెలల గర్భిణి! ఆస్తి తగాదాలతో అప్యాయత, అనురాగాలన్నీ మరిచి గొడ్డలి, కొడవలితో కూతురుపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపాడు! అడ్డొచ్చిన అల్లుడిపైనా దాడి చేశాడు. బాధితుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దారుణహత్యలో అతడికి కన్న కొడుకులు కూడా సహకరించడం మరింత విషాదం. వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు కుమార్తె ఉషశ్రీ (35), ముగ్గురు కుమారులు సురేశ్, నరేశ్, వెంకటేశ్ ఉన్నారు. ఉషశ్రీ చిన్నప్పటి నుంచీ అదే గ్రామంలో నివాసం ఉండే తన తాత, అంటే మంగమ్మ తండ్రి మన్నెం వెంకయ్య వద్దే పెరిగింది. వెంకయ్యే ఆమె పెళ్లి చేశాడు. గోపవరం గ్రామానికి చెందిన పర్సబోయిన రామకృష్ణకు ఉషశ్రీని ఇచ్చి చేసి, తన ఆస్తిలో రెండెకరాల సాగుభూమితో పాటు ఇంటి కోసం పది గుంటల స్థలాన్ని కూడా ఇచ్చాడు. ఉషశ్రీ-రామకృష్ణ దంపతులు.. వెంకయ్య ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ పని చేసుకుంటున్నారు.
ఆమె ఐదు నెలల గర్భంతో ఉంది. కాగా వెంకయ్య ఇచ్చిన ఆస్తి విషయంలో ఉషశ్రీతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముళ్లు కొన్నేళ్లుగా గొడవ పడుతున్నారు. వైరా పోలీ్‌సస్టేషన్‌లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అనేకసార్లు పెద్దమనుషుల్లో పంచాయతీలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ భూములకు సంబంధించిన సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. శుక్రవారం ఉదయం రాములు తన కొడుకులు నరేశ్, వెంకటేశ్‌తో కలిసి గొడ్డలి, కొడవలి, గడ్డపారలతో ఉషశ్రీకి తాత ఇచ్చిన పదిగుంటల ఇంటిస్థలంలోని సుబాబుల్ చెట్లను నరికే ప్రయత్నం చేశారు. వారిని భర్త రామకృష్ణతో కలిసి ఉషశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే రాములు, నరేశ్, వెంకటేశ్ కలిసి ఉషశ్రీ, అల్లుడిపై గొడ్డలి, కొడవలితో దాడి చేశారు. తొలుత ప్రతిఘటించినా, తర్వాత భయపడిపోయి తప్పించుకునేందుకు వారు ప్రయత్నించినా వెంటాడి అతి దారుణంగా నరికారు. ఉషశ్రీ అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. రక్తపుమడుగులో ఉన్న రామకృష్ణను స్థానికులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-11-11T04:02:33+05:30 IST