Harish Rao: వైద్య సేవల్లో రాష్ట్రానిది 3వ స్థానం
ABN, First Publish Date - 2023-01-30T02:56:24+05:30
వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాలు గత ఏడాది అద్భుత పురోగతిని సాధించాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఏడాదిలోనే అత్యున్నత స్థాయికి
అన్ని విభాగాల్లో మెరుగైన పురోగతి
2022 ఒక మైలురాయి: మంత్రి హరీశ్
సర్కారీ ఆస్పత్రుల్లో ఓపీ 4.87 కోట్లు
పెరిగిన ఇన్‌పేషెంట్లు, శస్త్రచికిత్సలు
వార్షిక ప్రగతి నివేదిక-2022లో వెల్లడి
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాలు గత ఏడాది అద్భుత పురోగతిని సాధించాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని, ఏడాదిలోనే అత్యున్నత స్థాయికి చేరుకోగలిగామని చెప్పారు. ఉద్యోగులందరూ సంఘటితంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వైద్య. ఆరోగ్యశాఖ వార్షిక ప్రగతి నివేదిక-2022ను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నివేదిక తమ పనితీరుకు నిదర్శనం మాత్రమే కాదని, మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ‘హెల్త్ ఫర్ ఏవ్రీ ఏజ్... హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’’.. నినాదంతో అన్ని వయస్సుల వారికి వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి రూ.11,440 కోట్లు కేటాయించి తలసరి హెల్త్ బడ్జెట్‌లో దేశంలోనే మూడో స్థానంలో నిలిచామన్నారు. సగటున తెలంగాణలో ఒక్కో వ్యక్తి ఆరోగ్య సంరక్షణకు సర్కారు రూ.3,092 కేటాయించిందని వెల్లడించారు. గత ఏడాది వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకొని, వేగవంతంగా అమలు చేశామని మంత్రి హరీశ్ తెలిపారు.
కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది?
ఆరోగ్య రంగంపై చార్జిషీట్ పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి హరీశ్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య రంగం అధ్వానంగా ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది? అని ప్రశ్నించారు.
శ్వాసకోశ వ్యాధులకు అన్ని జిల్లాల్లో చికిత్స: హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీ: వాయు కాలుష్యం, ఇతరత్రా కారణాల వల్ల ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన విభాగాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు, లైవ్ వర్క్‌షా్‌పను హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్త్ ప్రొఫైల్‌లో కూడా ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఈ వ్యాధులన్నింటికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు. ఈ సదస్సు ద్వారా తొమ్మిది కొత్త పరికరాలు, ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నందుకు యశోద ఆస్పత్రి వర్గాలను ఆయన అభినందించారు.
Updated Date - 2023-01-30T02:56:25+05:30 IST