TS BJP : బీజేపీకి మూడో స్థానమే
ABN, First Publish Date - 2023-05-26T03:44:01+05:30
బీజేపీ.. దేశంలోనే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకొంటారు! అందుకే, పార్టీ, నాయకులకు వ్యతిరేకంగా ..
తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్సే!
కాంగ్రెస్ గెలిచే సవాలే లేదు
బీజేపీలోకి వలసలు క్లోజ్
మేం కాకపోతే, బీఆర్‌ఎస్ రావాలని కేంద్రం భావిస్తుంది
కేసీఆర్ వ్యతిరేక అంశం నిర్మించడంలో సంజయ్ విఫలం
40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే రెండో స్థానం ఎలా!?
బీజేపీ తటస్థంగా ఉంటే బాబు-పవన్‌కే ఏపీలో అధికారం
ఢిల్లీలో.. తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేత ‘చిట్‌చాట్’
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ.. దేశంలోనే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకొంటారు! అందుకే, పార్టీ, నాయకులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బహిరంగంగా ఎక్కడా స్పందించరు! కేవలం అంతర్గత వేదికల్లోనే ఫిర్యాదులు చేసుకుంటారు! కానీ, బీజేపీలోని కొంతమంది నాయకులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు! ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో విలేకరులతో చిట్‌చాట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా, ఇతర రాష్ట్రాల వ్యవహారాలు చూసే తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు కూడా గురువారం ఢిల్లీలో విలేకరులతో ‘చిట్‌చాట్’ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీకి మూడో స్థానమే లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నుంచి 30-40 మంది నేతలు వచ్చి చేరితే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రెండో స్థానంలోకి వచ్చిందని, ఆ పార్టీ లోంచి నేతల వలస ఆగిపోయిందని చెప్పారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి నేతలు వలస వచ్చే అవకాశాలు లేవని, పొంగులేటిలాంటి నేతలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీ అఽధ్యక్షుడైతే ఈ నాలుగు నెలల్లో ఆయన ఏమీ చేయలేరని, ఆయనకే నష్టం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎ్‌సకు పరిస్థితి సాఫీగా ఉందని, ఓట్ల శాతం తగ్గినా సీట్లు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. ‘‘మేం గట్టిగా పోటీ చేస్తే బీఆర్‌ఎ్‌సకే లాభం. మోదీ, అమిత్ షా, నడ్డా కలిసి కేసీఆర్‌ను తిడితే బీఆర్‌ఎ్‌సకే ఓటు శాతం పెరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య వ్యతిరేక ఓటు చీలిపోయి బీఆర్‌ఎస్ గెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాని పక్షంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలనే కేంద్రం భావిస్తుంది. ప్రాంతీయ పార్టీలతో.. కేసీఆర్, కేజ్రీవాల్ తదితరులతో బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రధాన పార్టీ అయితేనే ఇబ్బంది. బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్సే’’ అని వివరించారు. ఆ పార్టీ సారథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే అవకాశాలు లేవని, పార్లమెంట్‌లో కలిసి పని చేసినంత మాత్రాన దేశంలో కలిసి పని చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో హిందూ రాజకీయాలు నడవవు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందువుల నాయకుడుగా చిత్రించుకోవడం వల్ల విస్తృతంగా ప్రజల అభిప్రాయం బీజేపీకి అనుకూలంగా మారదని ఆ పార్టీ జాతీయ నేత అభిప్రాయపడ్డారు. తెలంగాణలో హిందూ రాజకీయాలు నడవవని చెప్పారు. ‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 శాతం కమిషన్‌ను ఒక ప్రధాన అంశంగా కాంగ్రెస్ మార్చగలిగింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అలాంటి ఒక ప్రధాన ప్రజా వ్యతిరేక అంశాన్ని సంజయ్ నిర్మించలేకపోయారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, తుంగతుర్తి, నకిరేకల్, మహబూబాబాద్‌తోపాటు అనేక నియోజక వర్గాల్లో బీజేపీకి పది వేల ఓట్లు కూడా లేవు. కనీసం 40 మంది బలమైన అభ్యర్థులు లేకపోతే రెండో స్థానమైనా ఎలా దక్కుతుంది!?’’ అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ముందు బీఆర్‌ఎ్‌సతో బీజేపీ యుద్ధం చేస్తుందని అనుకుని సర్వేలు చేశారని, ఇప్పుడు ఆ సర్వేలన్నీ ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు అస్తమానం డబ్బు సంచుల గురించే మాట్లాడుతుంటారని, బీజేపీ భావజాలాన్ని విమర్శిస్తారని, దాంతో, కార్యకర్తలు వారి నాయకత్వాన్ని అంగీకరించే వాతావరణం లేకుండా పోయిందని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల నాయకులు కాంగ్రె్‌సలో లేరని చెప్పారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు.
ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా పవనాలు
ఏపీలో జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, బీజేపీ తటస్థ పాత్ర వహిస్తే బాబు-పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని సదరు బీజేపీ జాతీయ నేత అన్నారు. కేంద్రం తటస్థంగా ఉంటే జగన్ వ్యతిరేకులు బయటకు వస్తారని, వారికి భయం పోతుందని చెప్పారు.
Updated Date - 2023-05-26T03:51:51+05:30 IST