OHRK Kishan Reddy: కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకత
ABN, First Publish Date - 2023-05-15T02:52:37+05:30
కిషన్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖుల్లో అతి ముఖ్యమైన నేత. యువ మోర్చాలో కోశాధికారిగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు జన హృదయ నేతగా గుర్తింపు ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో జనం కోరుకునే మార్పు వస్తుంది
కర్ణాటక ఓటమి ప్రభావం తెలంగాణలో బీజేపీపై ఉండదు
లిక్కర్ స్కాంలో ఆధారాలుంటే కవితను అరెస్టు చేస్తారు
రాజాసింగ్‌పై సస్పెన్షన్ తప్పకుండా ఎత్తివేస్తాం
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖుల్లో అతి ముఖ్యమైన నేత. యువ మోర్చాలో కోశాధికారిగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు జన హృదయ నేతగా గుర్తింపు ఉంది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు క్రియాశీలంగా పనిచేస్తున్న కిషన్‌రెడ్డి.. ‘ఏబీఎన్–ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పలు అంశాలపై మాట్లాడారు.
ఆర్కే: అట్టడుగు స్థాయి నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రి వరకు ఎదిగారు. ఎలా అనిపిస్తోంది..?
కిషన్‌రెడ్డి: పదవిని బాధ్యతగా ఫీలవుతాను. ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నా. హైదరాబాద్‌కు, నా నియోజకవర్గానికి, కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాననే బాధ ఉంది. కరోనా తర్వాత టూరిజం, ఆతిథ్య రంగాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ సరిదిద్దుతున్నాం.
ఆర్కే: కేంద్రమే పర్యాటకాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా..?
కిషన్‌రెడ్డి: ఇప్పుడు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని ప్రాంతాలను.. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద అభివృద్ధి చేసే వారికి ఇస్తున్నాం. టూరిజం అభివృద్ధి కోసం ఏటా రాష్ట్రాలకు రూ.5,500 కోట్లు ఇస్తున్నాం. మేం ఇచ్చిన నిధులతోనే అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో గోల్కొండ కోట, ఆర్ట్స్ కాలేజీ వద్ద లైట్లతో శాశ్వతంగా ఇల్యూమినేషన్, లైట్ అండ్ షోను ఏర్పాటు చేస్తున్నాం. చార్మినార్ దగ్గర కూడా లైట్ ఇల్యూమినేషన్‌ను పెడుతున్నాం.
ఆర్కే: కర్ణాటకలో బీజేపీకి దేనివల్ల నష్టం జరిగింది?
కిషన్‌రెడ్డి: దానికి చాలా కారణాలున్నాయి. యడియూరప్పను క్రియాశీలం చేయకపోవడం ఒక కారణమైతే.. పాలనలో కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో సదుద్దేశం ఉంది. రేపు పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయి.
ఆర్కే: రాహుల్‌గాంధీకి 24 గంటల్లోనే క్వార్టర్ ఖాళీ చేయాలని నోటీసులివ్వడం.. బీజేపీకి నష్టం చేసిందా?
కిషన్‌రెడ్డి: గతంలోనూ ఇలాంటివి జరిగాయి. లోక్‌సభ, సీపీడబ్ల్యూ విభాగం గత సంప్రదాయాలనే పాటించాయి.
ఆర్కే: తెలంగాణలో బీజేపీ ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టుంది...?
కిషన్‌రెడ్డి: అలా మేం అనుకోం. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈసారి ఎన్నికల్లో జనం కోరుకునే మార్పు వస్తుంది. మెజారిటీ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు.
ఆర్కే: ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సంఘర్షణ వస్తోంది కదా..?
కిషన్‌రెడ్డి: అతి పెద్ద సమస్య కాదు. పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తున్నాం. పార్టీలో గ్రూపులున్నాయనుకోను. సీఎం అభ్యర్థిని సమయమొచ్చినపుడు ప్రకటిస్తాం.
ఆర్కే: ఎంత చేసినా బీజేపీలో ఎవరూ ఎందుకు చేరట్లేదు?
కిషన్‌రెడ్డి: ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉంది. ఇప్పుడే వస్తే.. అధికార పార్టీ నుంచి ఇబ్బందులు వస్తాయని చాలా మంది బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు. సరైన సమయంలో వారంతా బీజేపీలో చేరతారు. కొత్త వాళ్లయినా సరే.. గెలవడానికి అవకాశం ఉన్న వారిని పార్టీలోకి తీసుకురమ్మని అమిత్ షా, నడ్డా చెప్పారు. తప్పకుండా వారికే టికెట్ ఇస్తామనే విశ్వాసాన్ని కలిగించాలని తెలిపారు.
ఆర్కే: కేసీఆర్‌ను జైలుకు పంపుతాం అంటారు. అది అసలు సాధ్యమా..?
కిషన్‌రెడ్డి: అవినీతిని అరికట్టడంలో వెనకకు వెళ్లే సమస్య లేదు. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసే వీల్లేదు. రాష్ట్రం కోరితే లేదా న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కొంత మంది ఆర్టీఐ కార్యకర్తలతో మాట్లాడుతున్నాం. సమాచారం సేకరించి చేస్తాం.
ఆర్కే: ప్రజల సొమ్మును ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తే కేంద్రానిదే కదా జవాబుదారీ?
కిషన్‌రెడ్డి: ఉపాధిహామీ నిధుల్లో దుర్వినియోగం జరుగుతోంది. ప్రశ్నిస్తే కేంద్రం.. పేదలకు వ్యతిరేకమని సీఎం కేసీఆర్ కుటుంబం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కేంద్రం అనేక పథకాలకు ఇచ్చిన నిధులను ఏపీ, తెలంగాణలో దారి మళ్లిస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు రూ.లక్ష కోట్లకు పైగా అప్పు ఇచ్చాం. దానిపై వివరణ అడిగితే.. రాష్ట్ర సర్కారు సరిగా ఇవ్వలేదు. దీంతో మిగతా అప్పు ఇవ్వడం ఆపాం. దీంతో కేసీఆర్ ప్రభుత్వం నుంచి పెద్ద గొడవ.
ఆర్కే: ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దెబ్బకు మీరు కొంచెం ఆత్మరక్షణలో పడిపోయారు కదా..?
కిషన్‌రెడ్డి: అస్సలు లేదు. ఎవరైనా ఎమ్మెల్యే బీజేపీలో చేరాలనుకుంటే నేనే మాట్లాడతాను కదా! స్వామీజీనో, ఇంకెవరినో పంపాల్సిన అవసరమేముంది? అదేమైనా నేరమా? కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టీడీపీ వాళ్లందరినీ చేర్చుకుంటే తప్పు లేదా? మేమేదో పెద్ద నేరం చేసినట్టు కెమెరాలు పెట్టి, వీడియోలు తీసి, సినిమాలు చూపిస్తే ఏమవుతుంది? ఇప్పుడేమైంది?
ఆర్కే: నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు లేని పంచాయితీ తమిళిసైతో ఎందుకు వచ్చింది?
కిషన్‌రెడ్డి: నాకు అర్థం కాలేదు. రాష్ట్రపతి వచ్చినప్పుడూ అంతే. ప్రణబ్ ముఖర్జీ వస్తే కాళ్లు మొక్కారు. ముర్ము వస్తే పౌరసన్మానం కూడా చేయలేదు. తమిళిసై యాదాద్రికి వెళ్తే ప్రొటోకాల్ ఉండదు. అందుకే ఆమె మాట్లాడారు.
ఆర్కే: రూల్స్ పాటించాలని అధికారులకు మీరు చెప్పరా?
కిషన్‌రెడ్డి: తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అధికారులు భయపడుతున్నారు. మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు ఫోన్ చేసినా వేరే ఫోన్‌లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.
ఆర్కే: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?
కిషన్‌రెడ్డి: నేను ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా చేస్తానా, పార్టీకి పని చేస్తానా అనేది పార్టీ నిర్ణయిస్తుంది.
ఆర్కే: మోదీ కూడా కేసీఆర్‌లాగే నియంతృత్వ పోకడలు పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి?
కిషన్‌రెడ్డి: అలా ఉండదు. ప్రతి బుధవారం క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. చాలా విషయాలు మంత్రులు చెప్పాక ప్రధాని నిర్ణయాలు మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మాకు ఎంతో స్వేచ్ఛనిస్తారు. నా శాఖపై నాకు పూర్తి అధికారం ఉంటుంది. ఈ విషయంలో ప్రధానమంత్రి సహా ఎవరూ జోక్యం చేసుకోరు. పైగా ఎలా చేయాలో ప్రధాని సలహాలిస్తూ మార్గనిర్దేశం చేస్తారు.
ఆర్కే: కర్ణాటకలో కేసీఆర్ పలుకుబడి పనిచేసిందా?
కిషన్‌రెడ్డి: పలుకుబడి ఉంటే అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? కుమారస్వామిని సీట్లడిగితే ఇవ్వలేదు. దీంతో ఆయనకు డబ్బులిచ్చి వచ్చేశారు. కర్ణాటకలోనే కాదు.. దేశం మొత్తం అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని ఓ జర్నలిస్టుతో చెప్పారు.
ఆర్కే: కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో పడదా?
కిషన్‌రెడ్డి: అలాంటిదేమీ ఉండదు. కర్ణాటకలో జేడీఎస్ బలహీన పడటం వల్ల కాంగ్రెస్ లాభపడింది.
ఆర్కే: మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలపై?
కిషన్‌రెడ్డి: అక్కడ తలమీద రూపాయి పెడితే చెల్లనివారు కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. వారిని బీఆర్‌ఎస్ వాళ్లు కళ్లకద్దుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పేరును మార్చడం ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశం. మాకు కలిసివచ్చే అంశం. సిద్ధాంతం లేకుండా డబ్బుతోనే రాజకీయం చేస్తామంటే సాధ్యం కాదు. ఇప్పటిదాకా వివిధ రకాల నేపథ్యంతో పార్టీలు వచ్చాయి తప్ప.. డబ్బు నేపథ్యంతో ఏ పార్టీ రాలేదు.
ఆర్కే: తెలంగాణలో కొందరు బీజేపీ నాయకులు మాకు ముస్లింల ఓట్లే అవసరం లేదంటున్నారు?
కిషన్‌రెడ్డి: ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లిం అతివాద భావజాలం ఉన్నవారు, మజ్లిస్ సమర్థకులను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తుంది. పాతబస్తీలో పెద్దసంఖ్యలో ముస్లింలు బీజేపీలో పనిచేస్తున్నారు. కేరళలో భారీ ఎత్తున క్రిస్టియన్లు బీజేపీలో చేరుతున్నారు. 85 శాతం క్రిస్టియన్లు ఉన్న నాగాలాండ్‌లో ఐదోసారి బీజేపీ కూటమి పార్టీలు అధికారంలో కొనసాగుతున్నాయి.
ఆర్కే: రాజాసింగ్ పరిస్థితేంటి? సస్పెన్షన్ ఎత్తేస్తారా?
కిషన్‌రెడ్డి: తప్పకుండా సస్పెన్షన్ ఎత్తివేస్తాం. జాతీయ పార్టీతో అందరం మాట్లాడుతున్నాం. సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.
ఆర్కే: ఆంధ్రా మూలాలున్న ఓటర్లు దూరమెందుకు?
కిషన్‌రెడ్డి: వారిని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఆర్కే: కవితను అరెస్టు చేయడానికి భయపడుతున్నారట?
కిషన్‌రెడ్డి: లిక్కర్ స్కామ్‌లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారందరూ అరెస్టయ్యారు. కవిత ప్రమేయం ఉన్నట్లు ఆధారాలన్నీ ఉంటే ఆమెను కూడా అరెస్టు చేస్తారు.
ఆర్కే: రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్ర పెద్దలు అడుగుతారా?
కిషన్‌రెడ్డి: అడుగుతుంటారు. అయినా కేంద్ర ప్రభుత్వంగా మావైపు నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకారమే ఉంది. బీఆర్‌ఎస్సే వారి పార్టీ నుంచి నాయకులను ఎలా చేర్చుకుంటారంటూ అడ్డం తిరిగింది. వారు తప్ప మరో పార్టీ తెలంగాణలో ఉండవద్దన్న ఆలోచనలో ఉన్నారు.
Updated Date - 2023-05-15T02:52:37+05:30 IST