Corona: వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా కలకలం
ABN, Publish Date - Dec 22 , 2023 | 08:31 AM
వరంగల్: అంతం అయిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకూ వ్యాప్తి చెందుతూ మరో సారి మానవాళిని భయపెడుతోంది.
వరంగల్: అంతం అయిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకూ వ్యాప్తి చెందుతూ మరో సారి మానవాళిని భయపెడుతోంది. ఏడాదిన్నర, రెండేళ్లుగా కరోనా మహమ్మారి జాడ లేక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి ఈ వ్యాధి విజృంభిస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేగింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళలకు కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మహిళా నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఎంజీఎంలో కరోనా వార్డు ఏర్పాటు చేశారు.
అమెరికాలో పుట్టి చైనాలో వ్యాప్తికి కారణమైన కొత్త వేరియంట్‌పై ప్రజలు మరో సారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. జేఎన్ 1 వేరియంట్ రూపంలో కొవిడ్ వైరస్ మరో సారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు వస్తున్న వార్తలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కలవర పడుతున్నారు. ఈ వ్యాధి మళ్లీ తమకు ఎక్కడ సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ ఏ మంత ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండడంతో ఊరట చెందుతున్నా లోలోపల మాత్రం కలవర పడుతున్నారు. జేఎన్ 1 వేరియంట్ కేరళలో ఇప్పటికే విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్‌లో కూడా ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా జిల్లా వైద్యా ఆరోగ్య అధికారులను హెచ్చరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయినా ప్రజలు భయపడుతు న్నారు. కొందరు బయటకు వెళ్లేప్పుడు మళ్లీ మాస్క్‌లను ధరించడం మొదలు పెట్టారు.
వైద్య శాఖ అధికారుల అప్రమత్తం
ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యా రు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పట్టణా ల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లోని డాక్టర్లు, ప్యారామెడికల్ సిబ్బంది, ముఖ్యంగా ఆశ వర్కర్లు జాగ్రత్తగా ఉండాలని, జేఎన్ 1 వేరియంట్ కేసులపై నిఘా పెట్టాలని, ఎవరిలోనైనా కొవిడ్ లక్ష ణాలు కనిపిస్తే వారికి ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి లేదా ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. గ్రామాల్లో దగ్గు, జలుబు, శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతుంటే వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ కరోనా నిరోధక వ్యాక్సిన్లు మొదటి, రెండవ డోసులతో పాటు బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని గుర్తించి వారిని వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకురావాలని కూడా అధికారులు ఆదేశించారు. వివిధ కారణాలవల్ల వ్యాక్సిన్ తీసుకోని వారు సమీప ఆరోగ్య కేంద్రాలకు వచ్చి తీసుకోవాలని కూడా అధికారులు కోరుతున్నారు.
Updated Date - Dec 22 , 2023 | 08:31 AM