వాన జోరు.. నగరం బేజారు..
ABN, First Publish Date - 2023-07-26T00:20:10+05:30
విరామం లేని వర్షంతో వరంగల్ నగరం అతలాకుతల మైంది. సోమవారం రాత్రి నుంచి వర్షం దంచి కొట్ట డంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటిమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది.
లోతట్టు ప్రాంతాల జల దిగ్బంధం – జనం అవస్థలు
వరంగల్‌లోనే సమస్య తీవ్రత.. హనుమకొండలో తక్కువ
డీకే నగర్, ఎస్‌ఆర్‌నగర్, సంతోషిమాత కాలనీలు నీటిమయం
బాధితులు పునరావాస కేంద్రాలకు తరలింపు
మంత్రి దయాకర్‌రావు, మేయర్, ఎమ్మెల్యేల సందర్శన
సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
వాగులను తలపించిన ప్రధాన రహదారులు
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జూలై 25: విరామం లేని వర్షంతో వరంగల్ నగరం అతలాకుతల మైంది. సోమవారం రాత్రి నుంచి వర్షం దంచి కొట్ట డంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటిమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ప్రజలు నానా ఇక్కట్లకు గురయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారయంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో వైపు జలమయమైన ప్రాంతా ల్లో మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు పర్యటించి అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షం కారణంగా చెట్లు నేలకూలాయి. నగరంలోని 70కిపైగా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే మధ్య మధ్యలో వర్షం కాస్త ఆగడంతో సమస్య తీవ్రం కాలేదు. మరో నాలుగు రోజు ల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడం, రెడ్ అల ర్ట్ ప్రకటిత నేపథ్యంలో నగరం ఆందోళన చెందుతోంది.
వరంగల్‌లోనే తీవ్రత..
భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతమే అధికంగా జలమయమైంది. కాలనీలు నీట మునిగాయి. హ నుమకొండ, కాజీపేటలో అంతగా ప్రభావం లేదు. వర్ధన్నపేట, రాయపర్తి ప్రాంతాల నుంచి వరద నీరు వరంగల్‌కు చేరడమే ఇందుకు కారణంగా అధికార యంత్రాం గం తెలిపింది. ఈ క్రమంలో వరంగల్‌లోని డీకేనగర్, ఎస్‌ఆర్‌నగర్, అండర్ రైల్వే గేట్, హాంటర్‌రోడ్డు, సంతోషిమాత కాలనీలు జలమయం అయ్యాయని చెబుతోంది.
పునరావాస కేంద్రాలకు తరలింపు
వరంగల్‌లోని సంతోషిమాత కాలనీ, డీకేనగర్, శంభునిపేట, రంగశాయిపేట, హాంటర్‌రోడ్డు, ఎస్‌ఆర్‌నగర్, గాంధీనగర్, సాయి గణేశ్ కాలనీ, మధురానగర్, లక్ష్మీసాయినగర్ కాలనీ, ఎంహెచ్‌నగర్, కాశిబుగ్గు తదితర ప్రాంతాలు నీట మునిగాయి. డీకేనగర్, సంతోషిమాత కాలనీ, హంటర్‌రోడ్డు ప్రాంతాలు పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు. ఇళ్లలోని వస్తువులు కొట్టుకుపోయాయి.
ఎయిర్‌బోట్స్‌లో తరలింపు
వరంగల్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు జీడబ్ల్యూఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలను అందించింది. డీఎఫ్‌వో శంకర్‌లింగం నేతృత్వంలో సంతోషిమాత, డీకేనగర్, హంటర్‌రోడ్డు ప్రజలను రెండు ఎయిర్‌బోట్స్‌లలో పునరావాస కేంద్రాలైన సంతోషిమాత గార్డెన్స్, వరంగల్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. నగరంలో పలు ప్రాంతంలో ఆరు చెట్లు నేలకూలగా డీఆర్‌ఎఫ్ వాటిని తొలగించింది. వరంగల్‌లో వరద నీటిలో చిక్కుకున్న ట్రాక్టర్‌ను డీఆర్‌ఎఫ్ సభ్యులు బయటకు లాగారు.
బీసీ హాస్టల్ విద్యార్థుల ఇక్కట్లు
వరంగల్‌లోని జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ వరద నీటిలో చిక్కుకోవడంతో హాస్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హాస్టల్‌లోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు దెబ్బతిన్నాయి. దీంతో బయటి నుంచి నిత్యావసర వస్తువులను కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో చేరవేశారు. తాడు సహాయంతో ఉపాధ్యాయలు రోడ్డు నుంచి హాస్టల్‌కు చేరుకున్నారు. ఉర్సులోని ఎస్‌టీపీకి వరద నీరు తరలింపు కోసం మూడు ఫీట్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయడమే సమస్యకు కారణమవుతోంది. పది ఫీట్ల పైప్‌లు వేయాల్సిన తరుణంలో మూడు ఫీట్ల పైపులు మాత్రమే వేయడంతో వరద ఉధృతితో నీరు హాస్టల్ సమీప కాలనీలు వైపు మళ్లుతోందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు.
వాగులుగా ప్రధాన రహదారులు
వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. ఫలితంగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. హనుమకొండ కొత్త బస్‌స్టేషన్ నీటితో నిండింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్త బస్‌స్టేషన్ రోడ్డు, బాలసముద్రం, జేఎన్‌ఎ్‌స, ములుగురోడ్డు తదితర రహదారులు జలమయం అయ్యాయి.
మంత్రి ఎర్రబెల్లి పర్యటన
నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. ఆయన వెంట ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సం గంరెడ్డి సుందర్‌రాజ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తదితర అధికారులు ఉన్నారు. వరంగల్‌లో ఎస్‌ఆర్‌నగర్, హనుమకొండ హంటర్‌రోడ్డు, రాజాజీనగర్, సమ్మయ్యనగర్, వాజ్‌పేయికాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇందిరానగర్, దీన్‌దయాళ్‌నగర్, కాజీపేట ప్రశాంత్‌నగర్, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో దయాకర్‌రావు మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. సహాయక చర్యలపై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు. 24 గంటల పాటు సేవలు అందించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృత సేవలు అందించాలన్నారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో సెలవులు పెట్టవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. వరంగల్‌లోని సంతోషిమాత కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలను వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ట్రాక్టర్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 24గంటలపాటు కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులో ఉంటాయి. టోల్‌ఫ్రీ ఉంచింది. టోల్‌ఫ్రీ నెంబరు 18004251980తో పాటు సెల్ నెంబరు 9701999645, వాట్సాప్ నెంబరు 7997100300 పోన్ చేసి ప్రజలు సహాయక చర్యలు పొందవచ్చు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను తెలియచేయవచ్చు. వాట్సాప్ నెంబరుకు సమస్య, ప్రాంతం ఫొటోలను పంపితే అధికారులు సులభంగా, వెంటనే ఆ ప్రాంతానికి చేరే అవకాశం ఉంటుంది. ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని కమిషనర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. నగరంలోని ముంపు ప్రాంతాలను సందర్శించిన అనంతరం మేయర్ గుండు సుధారాణి జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఫిర్యాదులు, పరిష్కార చర్యలను సమీక్షించారు. ఇదిలావుండగా, నగరంలోని మొత్తం 66 డివిజన్లలో వందకు పైగా శిథిలావస్థ ఇళ్లకు జీడబ్ల్యూఎంసీ అధికారులు మంగళవారం స్టిక్కర్లు అంటించారు. ప్రమాదకర భవనాలుగా పేర్కొన్నారు. చాలామంది ఇంటి యజమానులను ఖాళీ చేయుంచారు.
Updated Date - 2023-07-26T00:20:10+05:30 IST