ఆపరేషన్ ‘కోవర్ట్’
ABN, First Publish Date - 2023-10-30T00:38:56+05:30
అసెంబ్లీ ఎన్నికల సంరంభం ఆరంభం అయ్యింది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరాత్ర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు వేగుల(కోవర్టుల)ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థుల వద్ద నమ్మకమైన అనుయాయులను పెట్టి వారి బలాబలాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
ఎన్నికల వేళ కొత్త రకం ఎత్తుగడ
ప్రత్యర్థుల లోగుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నం
వేగులు అందిస్తున్న సమాచారమే అస్త్రంగా ప్రచారం
ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అడుగులు
అప్రమత్తమో, అనర్థమో తెలుసుకోలేని సందిగ్ధంలో అభ్యర్థులు
వరంగల్ సిటీ, అక్టోబరు 29: అసెంబ్లీ ఎన్నికల సంరంభం ఆరంభం అయ్యింది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరాత్ర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు వేగుల(కోవర్టుల)ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థుల వద్ద నమ్మకమైన అనుయాయులను పెట్టి వారి బలాబలాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేగులు అందించే సమాచారం అభ్యర్థులకు అత్యంత అవసరంగా మారింది. సమాచారానికి తగ్గ ఫలితం ఆర్థికంగా, వస్తు పూర్వకంగా వేగులకు అందుతోంది. దీంతో పార్టీల్లో కోవర్టుల సంఖ్య పెరుగుతుందనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. వేగులిచ్చే సమాచారం సరియైునదా.. కాదా.. అనే సందిగ్ధంలో అభ్యర్థులు పడుతున్నారు. ఒక్కో సారి కోవర్టులు ఇచ్చే సమాచారంతో అప్రమత్తమవ్వాలో లేక అనర్థాన్ని తెచ్చిపెడుతుందో తేల్చుకోలేని తికమక పరిస్థితుల్లో అభ్యర్థులు పడుతున్న సంఘటనలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి.
చెదిరిపోతున్న ముందస్తు వ్యూహాలు
గత కొంత కాలంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలను నాయకులు సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారికి అత్యంత విశ్వసనీయంగా ఉండే కొంత మంది నాయకులను ఎంచుకొని ప్రత్యర్థి పార్టీల కండువాలు కప్పుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యర్థి వ్యూహాలను, ఇతరాత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని అందుకు అనుగుణంగా నాయకులు వారి వ్యూహాలను మార్చుకుంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో పన్నిన వ్యూహాలు మార్చుకుంటున్న అభ్యర్థులు వేగుల సమాచారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వ్యూహాలు బెడిసికొడితే ఏం చేయాలోననే ఆందోళనల్లోనూ పడుతున్నారు. మరోవైపు తాము కష్టపడి పన్నిన వ్యూహాలు అవతలి పార్టీల వారికి తెలిసి పోతుండటంతో నాయకులు వారి అస్త్రశస్త్రాలను అత్యవసరంగా మార్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవర్టులు అధికమవ్వడం కూడా అభ్యర్థులను కలవర పెడుతుంది. ఈ పరిణామాలతో పార్టీలో ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో తెలియని సంకట స్థితిలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు.
వేగుల సమాచారమే అస్త్రంగా ప్రచారం
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులందరు వేగుల సమాచారం మీదనే ప్రచారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కోవర్టులు అందజేస్తున్న సమాచారంతో ప్రచారంతో సరికొత్త అంశాలను జోడిస్తూ ప్రత్యర్థుల లోపాలను ఎత్తి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోవర్టులు చేరవేస్తున్న సమాచారంతో అసలుకే ముప్పు వస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. వేగులిచ్చిన సమాచారంతో నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోవర్టుల సమాచారం కొంత మంది అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కోవర్టుల విధానం ఒక్కోసారి అభ్యర్థులను అప్రమత్తం చేస్తుండగా అప్పుడప్పుడు అనర్థాలకు కారణం అవుతోందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
తాయిళాల కోసమే కోవర్టులు..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆశజూపుతున్న తాయిళాల కోసమే వేగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని పట్టుకొని పనిచేస్తుంటే ఏం లాభం లేదని కొంత మంది వేగుల అవతారమెత్తి అనతి కాలంలోనే ఆర్థికంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లోని ప్రధాన పార్టీలన్నింటిలో వేగులు పని చేస్తున్నట్లు సమాచారం. వీరంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఇతర పార్టీల అభ్యర్థుల చుట్టూ తిరుగుతూ వారి సమాచారాన్ని సేకరిస్తూ రాత్రికల్లా సొంత పార్టీ గూటికి చేరుతున్నట్లు తెలుస్తుంది. వేగులకు బిర్యాని, మద్యంతో పాటు ధన, వస్తు తాయిళాలకు కొరత ఉండటం లేదు. దీంతో ఉదయం నుంచి అవతలి పార్టీ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి రాత్రి సమయంలో వేగులు ఇచ్చే సమాచారమే అభ్యర్థులకు కీలకంగా మారుతోంది.
ఇవీ ఉదాహరణలు...
ఫ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొంత మంది కార్పొరేటర్లు ఓ ప్రధాన పార్టీలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్న సంగతి వేగుల ద్వారా తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ అభ్యర్థి వారిని వారించి తాయిళాలు అందజేయడంతో చేరికలు నిలిచిపోయాయి.
ఫ మరో నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు ఓ పార్టీ అభ్యర్థి దసరా కానుకలు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడని వేగులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వెంటనే వారిని కలిసి మాట్లాడటంతో పార్టీ మారే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అయితే అప్పటికే ఎదుటి పార్టీ నుంచి కానుకలు స్వీకరించి ప్రస్తుత అభ్యర్థి పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రం పార్టీ మారుతున్నట్లు కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-10-30T00:38:56+05:30 IST