వారంలో డీఎస్సీ!
ABN, Publish Date - Jan 23 , 2024 | 03:05 AM
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది.
6 వేలకు పైగా ఖాళీలతో ప్రకటన.. అధికారులతో మంత్రి బొత్స సమీక్ష
నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. 6 నుంచి 10 వేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులు వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేకసార్లు రకరకాల లెక్కలు వేయగా, తాజా అంచనాలతో కనీసం 6వేల మందిని భర్తీ చేయొచ్చన్న అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటుచేసిన ప్రీస్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే 8,366 మంది మాత్రమే అవసరమని పేర్కొంది. ఖాళీ ఉన్నప్పటికీ 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. కాగా.. ఎన్నికల కారణంగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Updated Date - Jan 23 , 2024 | 07:36 AM